విశాఖ డెయిరీకి ఏమవుతుంది?
ప్రభుత్వాల నడుమ నలిగిపోతున్న యాజమాన్యం. గతంలో టీడీపీ హయాంలోనే లిమిటెడ్ కంపెనీగా మార్పు. ఇప్పుడు అక్రమాలంటూ అదే ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు.
విశాఖ డెయిరీ..! తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డెయిరీ ఇది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వరంగంలో నడుస్తున్న డెయిరీలకు గట్టి పోటీనిస్తోంది. ఉత్తరాంధ్ర సహా ఉభయ గోదావరి జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ డెయిరీ ఇప్పుడు వివాదాలతో పాటు రాజకీయాల్లోనూ చిక్కుకుని విలవిల్లాడుతోంది. వరసగా జరుగుతున్న పరిణామాలతో చివరకు ఈ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్కమార్ వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. 50 ఏళ్ల డెయిరీ ప్రస్థానంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.
విశాఖ డెయిరీ 1973లో సహకార చట్టం ప్రకారం విశాఖలోని అక్కిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటైంది. 50 వేల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో మొదలైన ఈ డెయిరీ ప్రస్తుతం 9 లక్షల లీటర్లకు పొంగిపొర్లింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకూ విశాఖ డెయిరీ విస్తరించింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలోనూ మరో డెయిరీ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ డెయిరీకి సుమారు మూడు లక్షల మంది పాల సరఫరాదార్లున్నారు. పాల సేకరణ, అమ్మకంతో పాటు పెరుగు, మజ్జిగ, లస్సీ, వెన్న, నెయ్యి, పన్నీరు, స్వీట్లు, బేకరీ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. వీటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోనూ మార్కెట్ ఉంది. ఈ డెయిరీ ద్వారా 1500 మంది ప్రత్యక్షంగా, వెయ్యి మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 2025కి రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ముందుకెళ్తంది.
గతంలో ఏం జరిగింది?
1973లో విశాఖ డెయిరీని కోఆపరేటివ్ సొసైటీ చట్టం ప్రకారం ఆడారి తులసీరావు స్థాపించారు. 1999లో శ్రీవిజయ విశాఖ డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్గా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 2006లో శ్రీవిజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ గా మార్పు చేశారు. ప్రస్తుతం లిమిటెడ్ కంపెనీగానే కొనసాగుతోంది. 1986 నుంచి 36 ఏళ్ల పాటు ఆయనే చైర్మన్గా కొనసాగారు. తులసీరావు మరణానంతరం 2023లో ఆయన కుమారుడు ఆనందకుమార్ చైర్మన్ అయ్యారు.
టీడీపీ హయాంలోనే లిమిటెడ్ కంపెనీ..
విశాఖ డెయిరీ వ్యవస్థాపక చైర్మన్ తులసీరావు ఆది నుంచీ టీడీపీలోనే కొనసాగారు. టీడీపీ అధినేతలు ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడులకు, ఆ పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. టీడీపీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. టీడీపీకి ఆర్థికంగానూ చేదోడు వాదోడుగాను నిలిచారు. ప్రస్తుత చైర్మన్ ఆనంద్ కుమార్ 2019లో అనకాపల్లి లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలకుల నుంచి ఒత్తిళ్లతో టీడీపీ నుంచి ఆడారి కుటుంబం వైసీపీలోకి వచ్చిందన్న ప్రచారం జరిగింది. క్రమంగా ఆడారి కుటుంబీకులు వైసీపీ పెద్దలకు సన్నిహితులయ్యారు. ఆనంద్కుమార్కు వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీటునిచ్చారు. అయితే ఆయన ఓటమిపాలయ్యారు. అప్పట్నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
టీడీపీ అధికారంలోకి రావడంతో..
టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో విశాఖ డెయిరీతో పాటు చైర్మన్ ఆనంద్కుమార్కు కష్టాలు మొదలయ్యాయి. నలభై ఏళ్లు తమ పార్టీలో ఉండి వైసీపీలోకి చేరిపోయారన్న కోపం టీడీపీ నేతల్లో బలంగా ఉంది. దీంతో ఇటీవల అధికారంలోకి రాగానే డెయిరీకి ఇబ్బందులు తప్పవన్న ప్రచారం సర్వత్రా జరిగింది. అందుకనుగుణంగానే విశాఖ డెయిరీ యాజమాన్యం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల నేతలతో పాటు ఈ డెయిరీకి పాలు పోసే పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిణామాలు ఒక్కొక్కటిగా డెయిరీకి ప్రతికూలంగా మారాయి.
ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఇటీవల హౌస్ కమిటీని నియమించింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ ఈనెల 9న డెయిరీని సందర్శించి విచారణ ప్రారంభించింది. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పించనుంది. సహకార సంఘం నుంచి లిమిటెడ్ కంపెనీగా మారింది టీడీపీ హయాంలోనేనని, ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వం దీనిపై హౌస్ కమిటీతో విచారణ జరిపించడం విడ్డూరంగా ఉందని ఈ వ్యవహారాలు తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ డెయిరీ రాజకీయాల్లో నలిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఊహించినట్టుగానే రాజీనామా..
ఇంతలో డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్ సహా తొమ్మిది మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖ డెయిరీకి కష్టాలు తప్పవని అంతా భావించినట్టే పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి తక్షణం రాజీనామా చేయడం ఒక్కటే తమ ముందున్న మార్గంగా డెయిరీ చైర్మన్ భావించారని తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, డెయిరీ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని చైర్మన్ చెబుతున్నారు. తిరిగి టీడీపీలోకి చేరేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని అంటున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ సీహెచ్. అయ్యన్నపాత్రుడు ఆనందకుమార్ చేరికకు ససేమిరా అంటున్నారని టీడీపీలో చెప్పుకుంటున్నారు. అందువల్ల కొన్నాళ్ల తర్వాత బీజేపీ లేదా జనసేనలో చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలా చేరడం ద్వారా కూటమి ప్రభుత్వంలో కష్టాల నుంచి గట్టెక్కవచ్చన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది.