ప్రమాణాలకు తిలోదకాలు.. అందుకే కోర్టు నమ్మ లేదా..

పాలనలో కోర్టులు జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకు కారకులు పాలకులే. లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు తీర్పే దీనికి నిదర్శనం.

Update: 2024-10-05 03:35 GMT

‘నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి, ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’. ఇది ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రమాణం.

‘నారా చంద్రబాబు నాయుడు అను నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీనకు వచ్చిన, నాకు తెలియ వచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’. ఇది ఆయన చేసిన రెండో ప్రమాణం.
పై విధంగా ప్రమాణాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలియుగ దైవమైన వెంకటేశ్వరుని కోట్లాది మంది భక్తుల మనో భావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. భయానికి, రాగద్వేషాలకు, బంధూ ప్రీతికి అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణం ఏమైంది? ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన ప్రత్యేక దర్యాప్తును సుప్రీం కోర్టు ఆపివేసింది? అంటే ఇందులో రాజకీయం ఇమిడి ఉందని, ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు వ్యవహరించిన తీరులో ఇది భాగమేనని, ప్రధాన న్యాయ స్థానం భావించి ఉంటుందేమో అన్న ఆలోచన చాలా మందిలో మొదలైంది. పాలకులెవ్వరు వారి ప్రమాణాలను పాటించడం లేదని, సుప్రీం కోర్టు నిర్ణయంతో భావించొచ్చు.
నిజానికి వెంకటేశ్వరుని లడ్డులో కల్తీ జరిగిందని భావించినప్పుడు ప్రపంచంలోని భక్తులందరికీ ఈ విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు. ఎవరైతే అందుకు కారకులో సమగ్ర విచారణ జరిపి తర్వాత వారిని కఠిన శిక్షించొచ్చు. ఆ అవకాశం, అధికారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది. అలా కాకుండా కల్తీ జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టి ఆ తర్వాత విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇదంతా ఓ పథకం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర అని, ప్రజలను సంక్షేమ పథకాల విషయమమై మాట్లాడకుండా డైవర్ట్‌ చేసేందుకు ఆడుతున్న నాటకమని, నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు న్యాయమూర్తులే మాకు దిక్కని సుప్రీం కోర్టులో కొందరు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లను విచారించిన న్యాయస్థానం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఐదుగురు సభ్యులతో నియమించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలకుల తీరును తప్పు పట్టినట్టే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తును రద్దు చేసింది. కేంద్రమైనా, రాష్ట్రమైనా పాలకుల్లో ప్రమాణాలు కొరవడ్డాయని, సుప్రీం కోర్టు నిర్ణయం స్పష్టం చేస్తున్నట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ అయినా, సీఐడీ అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నుల్లో మాత్రమే పనిచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అంటే పాలకులు తాము చేసిన ప్రమాణాలను మరచిపోయి దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
సీబీఐ నుంచి ఇద్దరిని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి ఒకరిని కలిపి మొత్తం ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించేది మాత్రం సీబీఐ డైరెక్టరేనని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు సముచితమేనని కొన్ని వర్గాలు భావిస్తుంటే.. మరి కొన్ని వర్గాలు మాత్రం పాలకుల ఒత్తిడిలు కూడా ఈ బృందం మీద పని చేసే అవకాశం లేక పోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తమ్మీద రాజకీయాల కోసం ప్రజలతో పాలకులు చెలగాటమాడుతున్నారనే వాస్తవాన్ని కోర్టు గమనించినందు వల్లే ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఉంటుందనే అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేయడం విశేషం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్డీఏ కూటమిలోని పాలకులు ప్రతి అంశంలోను గత ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. నా కర్తవ్యాలను నిర్వహించేందుకు అవసరమైన మేరకు వ్యక్తికి కానీ, వ్యక్తులకు కానీ తెలియ పరచనని ప్రమాణం చేసిన పాలకులు ఏది అవసరమో, ఏది అనవసరమో తెలిసి కూడా వ్యక్తులకు వెల్లడించడం విమర్శలకు దారి తీస్తోంది. అందుకే పాలకుల తీరును కోర్టులు కూడా విశ్వసించడం లేదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. నిజానికి విపక్షాలు, మరి కొన్ని సంస్థలు కోరినట్లు సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. జాతీయ మీడియా సైతం కోర్టు నిర్ణయాన్ని అభినందిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని తూర్పార పట్టింది.
Tags:    

Similar News