వల్లభనేని వంశీ ఒక నొటోరియస్ క్రిమినల్
విచారణలు, వైద్య పరీక్షలు, వాదనలు పూర్తి అయిన తర్వాత వంశీని విజయవాడ జైలుకు తరలించారు.;
By : Admin
Update: 2025-02-14 05:14 GMT
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మామూలు వ్యక్తి కాదు. ఆయనకు చాలా నేరి చరిత్ర ఉంది. అతను ఒక నొటోరియస్ క్రిమినల్. చట్టమన్నా.. న్యాయమన్నా.. ఆయనకు లెక్కలేదు. వల్లభనేని వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటూ విజయవాడ పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వల్లభనేని వంశీపై చాలా పకడ్బందీగా రూపొందించిన రిమాండ్ రిపోర్టును విజయవాడ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే సత్యవర్థన్‌ను కిడ్నాప్‌కు పాల్పడ్డారనే అభియోగంపై గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో విజయవాడ పోలీసులు వంశీని హైదరాబాద్‌లో రెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. విచారణ నిమిత్తం తొలుత విజయవాడ భవానీపురం పోలీస్టుషన్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ విచారణ చేయలేదు. అక్కడ నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దాదాపు 8 గంటల పాటు వంశీని విచారించారు.
అనంతరం గురువారం రాత్రి 9:15 గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం 10:15 గంటల సమయంలో విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. నాలుగవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి అయిన రామ్మోహన్ ముందు హాజరు పరిచారు. ఇదే కేసులో నిందితులుగా ఉండి అరెస్టు అయిన ఏలినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను కూడా ఇదే కోర్టులో హాజరు పరిచారు. అర్థరాత్రి వరకు కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరగంధం రాజేంద్రప్రసాద్, పీపీ సమీర, వల్లభనేని వంశీ, ఇతర నిందితుల తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చిరంజీవి వాదనలు వినిపించారు. దాదాపు గురువారం అర్థరాత్రి 2:30 గంటల వరకు ఇరు పక్షాల వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదానలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రభుత్వ న్యాయవాది వీరగంధం రాజేంద్రప్రసాద్ వాదనలతో ఏకీభవిస్తూ, నిందితుడు వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణలకు ఈ నెల 27 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు వెలువరించారు. కోర్టు ఎపిసోడ్ అనంతరం అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో వంశీ వేలి ముద్రలు, ఐరీష్ తీసుకున్న అనంతరం విజయవాడ జైలుకు తరలించారు.
కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు వంశీని పోలీసులు విచారించారు. టీడీపీ కార్యాలయంలో పని చేసే సత్యవర్థన్ జోలికి ఎందుకు వెళ్లారు? సత్యవర్థన్‌ను ఎలా ట్రాప్ చేశారు? ఎందుకు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు? వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించారు. అయితే అన్ని ప్రశ్నలకు తెలియదని వింశీ సమాధానం చెప్పారు. మరో వైపు చాలా పకడ్బందీగా వంశీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టును విజయవాడ పోలీసులు రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదనే లక్ష్యంతోనే బలమైన కారణాలతో రిపోర్టును రూపొందించారు.