శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీ
జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.;
By : The Federal
Update: 2025-05-15 07:36 GMT
వివిధ కేసుల్లో విజయవాడ జైలులో రిమండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో తీవ్రంగానే ఇబ్బందులు పడుతున్నాని, దీంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని వల్లభనేని వంశీ బుధవారం కోర్టును విజ్ఞప్తి చేశారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన కోర్టు వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు గురువారం వంశీని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
గత వంద రోజులుగా వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ను కిడ్పాన్ చేశారనే కేసు మీద ఈ ఏడాది ఫిబ్రవరిలో వంశీని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే సత్యవర్థన్ కేసులో వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే డాక్యుమెంట్లు, షూరిటీలు సమర్పించే విషయంలో జాప్యం నెలకొనడంతో జైల్లోనే వంశీ ఉన్నారు. మరో వైపు బుధవారంతో వంశీ రిమాండ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వంశీని కోర్టులో హజరుపరిచారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని కోర్టు దృష్టికి వంశీ తీసుకెళ్లారు. దీనిపైన స్పందించిన న్యాయాధికారి తక్షణమే వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.