జనసేన విశాఖ సభ-పవన్ వ్యూహం ఏంటి?
ఈనెల 30న జరిగే పార్టీ సభలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయా?టీడీపీ విషయంలో జనసేనాని ఏమి చెబుతారు?;
By : V V S Krishna Kumar
Update: 2025-08-21 09:31 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటిమిలో కొనసాగుతూనే సొంతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.దీంతో ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది.మరి ప్రభుత్వం పనితీరు , కూటమిలోని పార్టీల పనితీరు ఎలా వుందన్న దానిపై ప్రజల అభిప్రాయం ఎలా వుంది?ఈ విషయంలో అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా అంతర్గత సర్వేలు నిర్వహించుకుంటూనే వున్నారు.బీజేపీ కూడా క్షేత్ర స్థాయిలో బలపడాలని ప్రయత్నిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెప్పించుకుంటూనే , పార్టీ పరంగా వున్న సమస్యలూ , క్షేత్ర స్థాయిలో జిల్లాల వారీగా పరిస్థితి ఎలావుందన్న దానిపై పక్కాగా సమాచారం సేకరించుకున్నట్లు చెబుతున్నారు.పార్టీ గెలిచిన 21 అసెంబ్లీ నియోజక వర్గాల పైనే కాకుండా మరో 30 నియోజక వర్గాలలో జనసేన బలంగా వుందని అంతర్గత సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ పరంగా కొత్త నియోజక వర్గాలపై దృష్టి సారించే ప్రయత్నం చేయాలని నేతలకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు.జనసేన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తూ పార్టీ నేతలతో విస్తృత చర్చలు జరుపుతూనే వున్నారు. తెలుగుదేశం తో పొత్తు కారణంగా వస్తున్న సమస్యలు, పొత్తు కారణంగా చేయాల్సి వస్తున్న త్యాగాలను గుర్తు చేస్తున్నారు.
30న విశాఖలో కీలక సమావేశం
భవిష్యత్ లో ఎలా ముందుకు వెళ్లాలి?ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి?కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు ఇంకా అందేలా ఏలా చేయాలి ?అన్న అంశాలకు విశాఖ సమావేశం వేదిక కానుంది.ఈనెల 30 వ తేదీ సాయంత్రం విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు , జనసైనికులు , వీర మహిళలు హాజరుకానున్నారు.ఈ సమావేశానికి 15 వేల మందికి పైగా హాజరవుతారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ , రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా విశాఖ సభ వేదికగా పవన్ ప్రకటించే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.ఏపీతో పాటుగా తెలంగాణలోనూ పార్టీ పైన పవన్ కొత్తగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.
సవాలక్షా సవాళ్లు
ప్రస్తుతం జనసేన అధికారం లో వున్న పార్టీయే.. కాని కూటమిలో భాగస్వామ్యంగా వుండటంతో ప్రభుత్వ పరంగా నిర్ణయాలన్నింటికీ బాధ్యత వహించాలి.అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను జనసేన పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి లేదు.దాంతో గతంలో అధికారంలో లేనప్పుడు పవన్ పలు సందర్భాలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకునే పరిస్థితి కనిపించడం లేదు.రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని సమీకరించే అంశాలను పవన్ వ్యతిరేకించారు. రైతుల పక్షాన ఉద్యమిస్తానంటూ పలుమార్లు హామీ ఇచ్చారు.ఇప్పుడు రాజధాని అమరావతికి అదనపు భూసేకరణ, సోలార్ కంపెనీలకు కరేడు లాంటి ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేక పోతున్నారు.ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని పవన్ కల్యాణ్ గత వైఖరిని ఎత్తిచూపేవిగా మారాయి.ఉపముఖ్యమంత్రిగా పవన్ తన శాఖల పరంగా నిర్ణయాలు, ప్రజలకు సేవలు అందించడంలో భేష్ అనిపించుకుంటున్నా,పార్టీ సొంతంగా ఎదగాలంటే అదిచాలదు.విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య,ఉద్దానం సమస్య వంటి వాటి విషయంలో తమ అధినేత పరిష్కారం చూపుతున్నారని, జనసేన నేతలు చెబుతున్నా,పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు.
ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే , చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ పవన్ పదే పదే చెబుతున్న మాటలు కూడా జన సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ప్లీనరీ మినహా పార్టీకి సంబంధించి,సమావేశాలు పెద్దగా నిర్వహించ లేదు.అందరికీ కూటమి ధర్మాన్ని వీడవద్దంటూ సూచన చేస్తూ వస్తున్నారు. జనసేన గెలిచిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు , తెలుగుదేశం ఎమ్మెల్యేలు వున్నచోట్లా కూడా జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. తమకు ప్రాధాన్యత దక్కడం లేదని అంతా టీడీపీ ఇంఛార్జుల హవానే కొనసాగిస్తున్నారని అంతర్గత సమావేశాలలో జనసేన నేతలు అధినేత ఎదుట మొత్తుకుంటున్నారు.పవన్ మాత్రం సమస్యలను పరిష్కరించుకొని కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు. మరి సమన్వయంతో నడుస్తూ , పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నది నేతలకు ప్రశ్నగా మారింది.
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి పార్టీ బలోపేతం పైన పవన్ ఫోకస్ చేసారు.విశాఖ వేదికగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఇందులో పవన్ ఎలా దిశానిర్దేశం చేస్తారు.తెలుగుదేశం క్రెడిట్ ను కాదని ,జనసేన ఏ విషయంలో క్యాష్ చేసుకుంటుంది..? ఎలా ముందుకెళుతుంది?ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వేడికైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ప్రశ్నించే పవన్ గొంతు ఏమయిందంటూ ,విపక్షం వైసీపీతో పాటు విమర్శకులు సైతం గొంతు కలుపుతున్నారు.అధికారంలో వున్నామన్న తృప్తేకానీ ,జనసైనికులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోవలసిందేనా ?మరి విశాఖ వేదికగా పవన్ ఏ స్వరం వినిపిస్తారో? ఎలా కేడర్ ను ఉత్సాహ పరుస్తారో? చూడాలి మరి