నెల్లూరు 'లేడీ డాన్' అరుణ కారులో పోలీసులు గంజాయి పెట్టారా?

సెప్టెంబర్ 3 వరకు రిమాండ్, నెల్లూరు జిల్లా జైలుకు;

Update: 2025-08-21 07:35 GMT
నెల్లూరు పోలీసు స్టేషన్ లో నిడిగుంట అరుణ
యావజ్జీవ ఖైదీ అవిలేలి శ్రీకాంత్‌ ప్రియురాలు నిడిగుంట అరుణను ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కావలికి చెందిన మునగ వెంకట మురళీ కృష్ణమోహన్‌ను చంపేస్తానని బెదిరించిన కేసులో ఆమెతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధుల అండదండలతో అరుణ తన ప్రియుడికి పెరోల్ ఇప్పించిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి బాపట్ల జిల్లా అద్దంకి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంలో ఆమె ‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించారు. కారు డోర్‌ తెరవాలని ఒత్తిడి తెస్తూ గంజాయి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లొకేషన్‌ షేర్‌ చేస్తున్నా. మీడియా ప్రతినిధులే కాపాడాలి’ అంటూ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఓ వీడియో లైవ్‌ ప్రసారం చేసింది. పోలీసులు ఆమెను నెల్లూరుకు తరలించారు. ఆమె అనుచరులైన పల్లం వేణు, అంకెం రాజా, సీరం ఎలీషాను వేర్వేరుచోట్ల అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నెల్లూరులోని రెండో అదనపు మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరుపర్చగా సెప్టెంబరు 3 వరకూ రిమాండు విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. అరుణను ఒంగోలు జైలుకు, మిగతా ముగ్గురు నిందితుల్ని నెల్లూరు జైలుకు తరలించారు. అరుణ, శ్రీకాంత్‌ ముఠా బాధితులు ఇప్పుడు ఆమెపై ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు.
ఏమిటీ ఫిర్యాదు, ఎవరు చేశారు..
కావలికి చెందిన మునగ వెంకట మురళీ కృష్ణమోహన్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో 2010లో అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. అందులో ఓ ఫ్లాట్‌ను అరుణ అద్దెకు తీసుకుంది. తర్వాత దాన్ని రూ.28 లక్షలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ.3 లక్షలు చెల్లించింది. మిగతా సొమ్ము చెల్లించాలని బిల్డర్‌ కృష్ణమోహన్‌ అడగడంతో అరుణ, ఆమె అనుచరులు బెరించారన్నది ఫిర్యాదు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరుణ, ఆమె అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో పలువురు పోలీసు అధికారులతో ఆడియో సంభాషణలు, వీడియో రికార్డులు, కొంతమంది అధికారులు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో దిగిన ఫోటోలు ఉన్నట్లు సమాచారం. అవి ఎవరివి అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శ్రీకాంత్, అరుణతో కలిసి అక్రమాలకు పాల్పడిన రౌడీషీటర్లు, ఇతరుల వివరాలను సేకరించిన పోలీసులు, వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు.
ఆరుగురు ఏఆర్‌ సిబ్బందిపై వేటు
చికిత్స కోసమంటూ శ్రీకాంత్‌ను జైలు నుంచి తిరుపతి, నెల్లూరు ఆసుపత్రులకు తీసుకెళ్లిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఏఆర్‌ సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. శ్రీకాంత్‌ను ఆమె ప్రియురాలు అరుణ కలిసేందుకు అవకాశం ఇవ్వటం, దారిలో వారికి సకల సదుపాయాలు కల్పించటంపై అదనపు ఎస్పీ సీహెచ్‌. సౌజన్య విచారణ చేసి నివేదిక అందించారు. దాని ఆధారంగా గార్డు డ్యూటీ చేసిన ఏఆర్‌ సిబ్బంది ఖలీల్, కాజా, సుబ్బారావులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఎస్కార్ట్‌ డ్యూటీకి వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ గోపాల్, కానిస్టేబుళ్లు కిషోర్, గంగరాజులపై చర్యలకు ఉపక్రమించారు.

నెల్లూరు 'లేడీ డాన్' గా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను (Aruna)ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్‌లో ఇది మరో కీలక పరిణామం.
Tags:    

Similar News