విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎప్పుడు ముంచేద్దామా? అని కేంద్రం ప్రభుత్వం కాచుకు కూర్చుంది. ప్రైవేటీకరణ యత్నానికి ప్లాంట్ కార్మిక లోకంతో పాటు ప్రజా సంఘాలు అడ్డు తగులుతుండడంతో కాస్త దూకుడు తగ్గించుకుంది. కానీ ప్రైవేటీకరణపై తన పంతాన్ని నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉంది. దానికి అవసరమైన చర్యలను పరోక్షంగా చేస్తోంది. ఈ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టేయడం ద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని చాన్నాళ్లుగా ప్లాంట్ కార్మికులు చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించింది. తొలి దశలో సుమారు 1200 మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్‌ఎస్ పేరుతో ఇంటికి పంపింది. మలి విడతలో మరో 1100 మందికి వీఆర్‌ఎస్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా ప్లాంట్‌లో కార్మికులు, ఉద్యోగులను వదిలించుకుని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అంతేకాదు.. వైజాగ్ స్టీల్‌ను అనాదిగా వేధిస్తున్న ముడి సరకు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. అలా సొంత గనులు కేటాయించని పక్షంలో ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలన్న విజ్ఞప్తినీ అంగీకరించడం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కర్మాగారం పడుతూ లేస్తూ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరతామన్న పట్టుదలతోనే ఉంది. మొన్నటికి మొన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ యోచన నుంచి వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది.
లాభాల నుంచి నష్టాల్లోకి..
గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న నెపంతో ప్రైవేటీకరణ చేయక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే కొన్ని నెలల క్రితం నుంచి ఈ ప్లాంట్ అనూహ్యంగా లాభాల్లోకి అడుగు పెట్టింది. ఈ ప్లాంట్‌లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల్లో జూన్ నెల వరకు రెండు మాత్రమే పని చేశాయి. అప్పటికి పది నెలల క్రితమే మూతపడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను జూన్ 27 నుంచి మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. బ్లాస్ట్ ఫర్నేస్‌లు 1,2 ద్వారానే ఈ ఏడాది మార్చిలో రూ.18 కోట్లు, ఏప్రిల్‌లో 71 కోట్లు, మే నెలలో రూ.50 కోట్ల వరకు క్యాష్ ప్రాఫిట్‌ను సాధించింది. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వచ్చాక మరింత లాభాలను గడించవచ్చని కార్మికులు ఆశించారు. అయితే ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం ఈ ప్లాంట్ జూన్‌లో రూ.226 కోట్లు, జులైలో రూ.264 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇదే ఇప్పుడు కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
క్షీణిస్తున్న ఉక్కు ఉత్పత్తి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ముడి సరకు, కార్మికుల కొరత కారణంగా ఉక్కు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ప్లాంట్‌లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్ మెటల్ (లిక్విడ్ స్టీల్) ఉత్పత్తి జరగాల్సి ఉంది. నాలుగు రోజులుగా ఉత్పత్తి తగ్గుతూ వచ్చి మంగళవారం నాటికి అది 10,180 టన్నులకు పడిపోయింది. అంటే సగానికి సగం క్షీణించిందన్నమాట! అంతేకాదు.. బ్లాస్ట్ ఫర్నేస్–2లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో దానిని మూసేశారు. ఇక బ్లాస్ట్ ఫర్నేస్–3లోనూ గడచిన నాలుగు రోజులుగా ముడి సరకు కొరతతో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఈనెల 15న 7,046 టన్నులు, 16న 7,528 టన్నులు, 17న 6,005 టన్నులు, 18న 5,456 టన్నులు, 19న 5.262 టన్నుల చొప్పున మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌కు రోజుకు 9 వేల టన్నుల ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. మరోవైపు ఇప్పటిదాకా ఉక్కు తయారీకి అవసరమైన సింటర్, కోక్‌ను ప్లాంటే స్వయంగా తయారు చేసుకునేది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గేది. కానీ యాజమాన్యం సింటర్‌కు బదులు లక్షల టన్నుల్లో పెల్లెట్లను వినియోగించడానికి ఒప్పందం చేసుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు సొంత కోక్ వోవెన్లు ఉండగా బయట నుంచి కొనడం కూడా ఉత్పత్తి వ్యయం పెరిగి ప్లాంట్‌కు అదనపు భారమైందని చెబుతున్నారు. మరోవైపు బ్లాస్ట్ ఫర్నేస్–2 మూతపడిన నేపథ్యంలో అందుకు బాధ్యులను చేస్తూ ఎలక్ట్రికల్, మెయింటెనెన్స్, ఆపరేషన్ విభాగాల అధిపతులను సీఎండీ సక్సేనా సస్పెండ్ చేశారు.
కార్మికుల కొరత కూడా కారణమే..
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తాజాగా ఉత్పత్తి తగ్గిపోతుండడానికి కార్మికులు, ఉద్యోగుల కొరత కారణమని తెలుస్తోంది. గత మే నెలలో 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. వీరి స్థానంలో అనుభవం లేని ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల పనివారిని తీసుకొచ్చి పనులు చేయిస్తోంది. వీరి అనుభవ లేమితో ప్లాంట్‌లో సమస్యలొస్తున్నాయి. మరో 1200 మంది శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇచ్చింది. కార్మికులు, ఉద్యోగుల కొరతతో ఉన్న వారితో రోజుకు 12 గంటల పాటు పని చేయిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్లాంట్ ఉద్యోగులకు 330 శాతం జీతాల బకాయిలున్నాయి. ఇదంతా ప్లాంట్‌లో ఉత్పత్తిపై ప్రతక్ష్యంగాను, పరోక్షంగా పడుతోంది.
విభాగాల పనులు ప్రైవేటుకు..
మరోవైపు ఇటీవలే ఈ స్టీల్ ప్లాంట్‌లో వివిధ విభాగాలకు చెందిన 32 పనులను ప్రైవేటుకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)కు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై కార్మిక లోకం భగ్గుమంటోంది. ఇప్పటికే టోటల్ మెయింటెనెన్స్ పనులను ప్రైవేటు పరం చేసిన మేనేజిమెంట్.. తాజాగా కీలమైన 32 పనులను కూడా అదే బాట పట్టిస్తుండడం ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలో భాగమేనంటూ ఆందోళన చెందుతోంది.
ఉక్కుపై ఉద్యమానికి సన్నద్ధంః బొత్స
విశాఖ ఉక్కు పరిరక్షణకు త్వరలోనే ఉద్యమాన్ని చేపడ్తాం. కలిసొచ్చే వారితో ముందుకు వెళ్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 16 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు? ప్రధాని మోదీ రెండుసార్లు విశాఖ వచ్చినా ప్రైవేటీకరణ జరగదని ఆయనతో ఎందుకు చెప్పించ లేకపోయారు? ప్లాంట్‌లో 32 విభాగాలను ప్రైవేటీకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండడం దారుణం. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
యాజమాన్యానిదే బాధ్యతః వై.దాస్
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి తగ్గడానికి యాజమాన్యానిదే బాధ్యత. కింది స్థాయి అధికారులను బాధ్యులను చేయడం తగదు. విశాఖ ఉక్కును లాభాల్లో నడిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఉత్పత్తి తగ్గడానికి యాజమాన్యం కారణం చెప్పాలి. అనుభవం ఉన్న పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను తొలగించి అనుభవం లేని ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల లేబర్‌ను రప్పించి పనులు చేయిస్తున్నారు. ప్లాంట్‌లో పాడైపోయిన పలు పరికరాలను రీప్లేస్ చేయలేదు. అవసరమైన ముడి సరకును సరఫరా చేయడం లేదు. యాజమాన్యం వైఫల్యాలే ఉక్కు ఉత్పత్తి క్షీణించడానికి కారణం’ అని స్టీల్ సీఐటీయూ అధ్యక్షుడు వై.దాస్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.