తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు

శ్రీవారి భక్తులకు తిరుమల (Tirumala)లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది.;

Update: 2025-03-06 13:40 GMT

తిరుమలలోని అన్నప్రసాదం మెనూలో చేర్చిన వడలను భక్తులకు వడ్డిస్తున్న టీటీడీ ఛైర్మన్ నాయుడు

శ్రీవారి భక్తులకు తిరుమల (Tirumala)లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాదం మెనూలో అదనంగా గారెలను చేర్చాలని బిఆర్ నాయుడు నిర్ణయించారు. ఈ ఆలోచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీంతో శనగప్పప్పు గారెలు అన్న ప్రసాదంలో భాగమయ్యాయి. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. టీటీడీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన తనకు కలిగిందని బీఆర్​ నాయుడు వివరించారు. తన ఆలోచనను ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన అంగీకారంతో గారెల వడ్డింపు కార్యక్రమాన్ని మార్చి 6 నుంచి ప్రవేశపెట్టామని తెలిపారు.
ప్రతిరోజూ భక్తులకు 35వేల వడల వడ్డింపు : నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను తమ అధికారులు వడ్డిస్తున్నారన్నారని టీటీడీ ఛైర్మన్​ బీఆర్ఎస్​ నాయుడు తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల వడలను భక్తులకు వడ్డిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామన్నారు. అంతకుముందు స్వామివార్ల చిత్రపటాలు వద్ద వడలను ఉంచి టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వయంగా వడలను వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు టిటిడి చైర్మన్ తెలియజేశారు. వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపులను ఉపయోగిస్తారు.
ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆశిస్తున్నా : ఈ కార్యక్రమానికి ముందు జనవరి 20న ట్రయల్​ రన్​ నిర్వహించామని అది విజయవంతమైనట్లుగా ఛైర్మన్​ బీఆర్ నాయడు వివరించారు. చాలా రుచికరంగా ఉందని తెలిపారు. దీంతో ఈ రోజు నుంచి 35వేల మంది భక్తులకు వడలు వడ్డించాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేశారని. ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన వివరించారు.
Tags:    

Similar News