సర్కారీ పీజీ కోర్సులకు విద్యార్థులు కావలెను!

యూనివర్శిటీల్లో కోర్సులకు గిరాకీ తగ్గడానికి కారకులెవరు?

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-15 02:46 GMT
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అస్థిత్వం ప్రమాదంలో పడింది. ప్రతి సంవత్సరం పీజీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గడమే దీనికి కారణం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలో నెగ్గలేని స్థితిలో ఉన్నత విద్యకు దూరం అవుతున్నట్లు అధ్యాపకులే తెగేసి చెబుతున్నారు. తద్వారా పీహెచ్డీ చేసే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. దీనికి మరో కారణం అధ్యాపకుల కొరత కూడా ఉండడమే.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది.
పీజీ సెట్ అమలులో ఉండడం, డిగ్రీ కోర్సులు నాలుగేళ్లకు పెంచడం, ఇంటర్ పాసయ్యాక విద్యార్థులు ఎటు మళ్లుతున్నారనే విషయాలపై పరిశీలనపై విద్యారంగ ప్రముఖులు, అధ్యాపకుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని అనేక డిపార్టుమెంట్లకు వెళ్లి వాకబు చేసినప్పుడు అందరి నోట ఒకే మాట వినిపించింది.
"అడ్మిషన్ల ప్రక్రియ విశ్వవిద్యాలయాల నుంచి తప్పించడం. పీజీ-సెట్ నిర్వహణతో ఉన్నత విద్య మండలి మాత్రమే సీట్లు భర్తీ చేయడం అనేదే అవరోధంగా మారింది" అని కూడా చెప్పారు. దీనికి తోడు..
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల ముందు డిగ్రీ కాలేజీలు ఢీలా పడ్డాయి. ఇంటర్ పాసయ్యాక డిగ్రీలో చేరుతున్న సంఖ్య తగ్గుతోంది. ఒక వేళ చేరినా డిగ్రీలో కూడా నాలుగేళ్లు చదవాలి. తాజాగా ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేసుకోవడానికి కాలేజీ యాజమాన్యాల ఎత్తుల నేపథ్యంలో పీజీ సెట్ వల్ల తీవ్ర నష్టం జరిగిందనేది తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకుడు ప్రసాదరావు విశ్లేషించారు.
పీజీ సెట్ వ్యవహారం పక్కకు ఉంచితే.. మరో విస్తుపోయే నిజం తెరపైకి వచ్చింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడానికి కేవలం 88 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంతే పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందనేది అర్థం చేసుకోవచ్చు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ విభాగం అధిపతి కే. సురేంద్రనాథరెడ్డి ఏమి చెప్పారంటే..
"మా విభాగంలో 40 సీట్లు ఉన్నాయి. సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు 14 మంది ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎంతమంది విద్యార్థులను కేటాయిస్తారనేది చూడాలి. ఇంకా 15వ తేదీ వరకు సమయం ఉంది" అని సురేంద్రనాథరెడ్డి చెప్పారు. విశ్వవిద్యాలయాలు దరఖాస్తులు తీసుకుని అడ్మిషన్లు చేసే సమయంలో పరిస్థితి మెరుగ్గా ఉండేదని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఎక్కువైతే, వారికి కౌన్సిలింగ్ ద్వారా సంఖ్యా పరంగా తక్కువ ఉన్న విభాగాల్లో భర్తీ చేసేందుకు శ్రద్ధ తీసుకునే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల విద్యార్థుల కొరత ఏర్పడిందనేది ఆంత్రోపాలజీ విభాగం హెడ్ ఆప్ ది డిపార్టుమెంట్ సురేంద్రనాథరెడ్డి చెప్పిన మాటలు.

విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారు ప్యాషన్ గా తీసుకుంటారు. పీజీసెట్ కు దరఖాస్తు చేసుకున్న సకాలంలో వారికి సమాచారం అందకపోవడం అనేది ఓ కారణమైతే, వారి సామర్థ్యం పోటీ పరీక్షలు ఎదుర్కోలేని పరిస్థితి కూడా ఉందని సురేంద్రనాథరెడ్డి ఒకింత ఆవేదన చెందారు. అలాంటి వారిని విశ్వవిద్యాలయాల్లోకి తీసుకుని రావడం ద్వారా ఆలోచనలు వికసింప చేసే అవకాశం కూడా లేకుండా పోయిందనేది ఆయన అభిప్రాయం.
ఘనమైన వర్సిటీ..
రాయలసీమలో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యారంగంలో చెరగని స్థానం. మిగతా విశ్వవిద్యాలయలకు కూడా అదే ఖ్యాతి ఉంది. ఎందరో మహోన్నతమైన వ్యక్తులను అనేక రంగాల్లో సేవల కోసం దేశానికి అందించిన ఘనత చరిత్రలో చిరస్థాయిగా ఉంది. ఒకో విశ్వవిద్యాలయం వెయ్యి ఎకరాల్లో 50 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు.
టీటీడీ సహకారంతో 1954లో అప్పటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో నిర్మించిన ఈ భవనాల్లో మొదట భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, జీవ, వృక్ష, ఆర్థిక శాస్త్రం వంటి విభాగాలను ప్రారంభించారు.
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియం ఆసియాలోనే అపూర్వమైన కట్టడం. గ్రంథాయంలో కూడా అరుదైన పుస్తకాలకు నిలయంగా మారిన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అటానమస్ గా ఉన్న సమయంలో ఏ ప్లస్ గ్రేడులో నిలిచింది.
తిరుపతి ఎస్వీయూ పీజీలో 58 విభాగాలతో నిర్వహిస్తున్న ఈ విద్యా సంస్థలో సుమారు 5,000 మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య మూడేళ్ల నుంచి రెండు వేల మంది విద్యార్థులకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎస్వీయూ ర్యాంకు జాతీయ స్థాయిలో 330, ప్రపంచస్థాయిలో 8,035 సంఖ్యలో నిలిచింది.
భాషలకు పాతర
విశ్వవిద్యాలయాల్లో తెలుగు, ఇంగ్లీషు విభాగాలకు పాతర వేస్తున్నారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీజీ సెట్ పరీక్షను సమర్థవంతంగా రాయడంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే దళిత, గిరిజనులు, పేదవర్గాలకు చెందిన విద్యార్థులు వెనుకబడుతున్నారనే మాటను ఓ ప్రొఫెసర్ ప్రస్తావించారు. పోటీప్రపచంలో నెగ్గురావడం తగిన వనరులు లేవనే విషయాన్ని ఆంత్రోపాలజీ విభాగం అధిపతి సురేంద్రనాథరెడ్డి ప్రస్తావించారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ తెలుగు విభాగాన్ని 1959లోనే ఏర్పాటు చేశారు. 120 మంది విద్యార్థులు ఉండాల్సిన ఈ విభాగంలో మూడళ్ల కిందటి వరకు 80 మంది ఉన్నారు. ఆ తరువాత తగ్గిపోతున్నారని ఆ విభాగం అధిపతి రాజేశ్వరమ్మ చెప్పారు.
"ద్వితీయ సంవత్సరంలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మా విభాగంలో చేరడానికి 17 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 13 మందిని మా విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి కేటాయించారు. వారు ఇంకా రిపోర్టు చేయలేదు. ఎంత మంది వస్తారో కూడా తెలియడం లేదు" అని తెలుగు విభాగం అధిపతి రాజేశ్వరమ్మ చెప్పారు.
తెలుగు శాఖలోకి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి వెళ్లే సరికి నెల్లూరు నగరం కిసాన్ నగర్ కు చెందిన విద్యార్థిని ధరణి శివప్రయ కనిపించారు. ఆమె ఏమన్నారంటే..
"నేను 2021-23లో పీజీ పూర్తి చేశా. పీహెచ్ డీ చేసేందుకు దరఖాస్తు చేయడానికి వచ్చాను. ఎస్వీయులోనే నేను పీజీ చేసే సమయంలో మా బ్యాచ్ లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా చిన్నది. పీజీ సెట్ నిర్వహణ వల్ల ఈ పరిస్థితికి కారణం" అని విద్యార్థిని ధరణి శివప్రయ తేల్చి చెప్పారు.
అధ్యాపకుల కొరత తీవ్రం...
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు చెప్పారు.
"2007 తరువాత రిక్రూట్ మెంట్ జరగడం లేదు. దీంతో డిగ్రీ కాలేజీల సంగతి దేవుడెరుగు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది" అని ఇంగ్లీషు విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్ చెప్పారు.
"నేను ఇదే విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ డిపార్టుమెంటులో చదివాను. అప్పుడు 12 మంది ఫ్యాకల్టీలు ఉన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీలు ముగ్గురు, తాత్కాలిక ప్రాతిపతికన ఒకరు ఉన్నారు. తప్పనిసరి పరిస్థితిలో రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ సేవలు వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది" అని ఆ అకడమిక్ కన్సల్టెంట్ వివరించారు. ఇంగ్లీష్ విభాగంలో 40 సీట్లు ఉంటే అందులో పేమెంట్ సీట్లు ఏడు ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఇంకా తగ్గే అవకాశం ఉంది" అని ఆయన వివరించారు.
ఈ విశ్వవిద్యాలయంలో 507 మంది శాశ్వత ప్రోఫెసర్లకు 156 మంది మాత్రమే ఉన్నారు. అంటే 351 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అకడమిక్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టు ప్రాతిపదికన 310 మంది పనిచేస్తున్నట్లు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకవర్గాలు చెబుతున్న సమాచారం. గత ఏడాది లెక్కలు పరిశీలిస్తే 4,600 మంది విద్యార్థులు ఉండాల్సిన విశ్వవిద్యాలయంలో 2,415 మందికి పడిపోయింది.
సంస్కృత విద్యా పీఠం వల్ల..
తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత ఎస్వీయూకు దెబ్బతగిలినట్టు ఆ విభాగం లోని రమేశ్ రెడ్డి అనే ఉద్యోగి చెప్పిన మాట. గత ఏడాది పది మంది విద్యార్థులు ఉంటే.. ప్రస్తుతం ముగ్గరు అడ్మిషన్లకు అర్హత సాధించారు. ఇంకా ఎనిమిది మంది వచ్చే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా రెగ్యులర్ ప్రొఫెసర్లు ఇద్దరు, మరో ఇద్దరు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. 30 మంది విద్యార్థులు ఉండాల్సిన హిందీ విభాగంలో పదికి మించి విద్యార్థులు లేరు. ఇక్కడ కూడా ఇద్దరు ఫ్యాకల్టీలు మాత్రమే ఉన్నారు. అకడమిక్ కన్సల్టెంట్లుగా ఇద్దరు ఉన్నారు.
చిత్తూరు జిల్లా ప్రధానంగా తిరుపతిలో ద్రవిడ భాషలకు నిలయంగా చెప్పవచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు స్థానికులు ఎక్కువగా తమిళంలోనే మాట్లాడుకునే వారు. ఈ పరిస్థితుల్లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పీజీ తమిళ విభాగంలో 20 సీట్లు ఉంటే, ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ఎనిమిది దరఖాస్తులు చేసుకున్నారని ఆ విభాగం గెస్ట్ ఫ్యాకల్లీ డాక్టర్ సీ. సెల్వం చెప్పారు. అకడమిక్ కన్సల్టెంట్లుగా ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పిన ఆయన పీజీసెట్ నిర్వహించిన ఉన్నత విద్యా మండలి తీరు వల్ల తమిళ భాషపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పీజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏమంటున్నారంటే..
"పీజీ సెట్ లో మరో నలుగురు అర్హత సాధించారు. వారికి సీట్లు కేటాయించలేదు. స్థానికత నిరూపించే పత్రాలు సమర్పించాలని నిబంధన పెట్టారు. మొదట ఈ విషయం అడగలేదు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక, మళ్లీ సమాచారం ఇస్తామని ఉన్నత విద్య మండలి నుంచి ఆ విద్యార్థులకు సమాచారం ఇచ్చింది" అని డాక్టర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్ విద్యార్థులు ఏమయ్యారు?
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 4,87,295 మంది విద్యార్థులు హాజరైతే 3,42979 మంది విద్యార్థులు ఉత్తర్ణీత సాధించినట్లు మే నెలలో ఫలితాలు ప్రకటించారు.
డిగ్రీ అడ్మిషన్లు జూన్ నెలలో ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభించడం ఏమిటని తిరుపతి ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకుడు ప్రసాదరావు ప్రశ్నించారు.
"ఇంటర్ పాసయిన విద్యార్థులు డిగ్రీలో ఈ పోటీ ప్రపంచలో రాణించడానికి అవసరమైన ఐఏ, బయోటెక్నాలజీ, ఇతర సైన్స్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో అందుకు అవసరమైన వసతులు, వనరులు కూడా లేవు. ఇక ఆ విద్యార్థుల గతి ఏమిటనేది కూడా ప్రశ్నార్థకమే" అని ప్రసాదరావు వ్యాఖ్యానించారు. దీనివల్ల
"డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి, పీజీలో చేరే వారి సంఖ్యకు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆటకంగా మారిందనడంలో సందేహం లేదు" అని కూడా ప్రసాదరావు విశ్లేషించారు.
2020 -21 నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్ లైన్ విధానంలోకి తీసుకుని వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో 2.62 లక్షల మంది చేరారు. 2022కు ఆ సంఖ్య 2.48 లక్షలకు పడిపోయింది. 2022 23 విద్య సంవత్సరంలో 1.41 లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరారు. ఈ ఏడాది జూన్ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 88,824 మందికి పడిపోయిన విషయం ఉన్నత విద్య మండలి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీజీ సెట్ తెరపైకి రావడం కూడా విశ్వవిద్యాలయాల ఉనికిని దెబ్బతీసినట్లు భావిస్తున్నారు.
ఆర్థిక భారం ..
విశ్వవిద్యాలయాల్లో ఎస్సీఎస్టీబీసీ,మైనారిటి పీజీ విద్యార్థులకు మెస్ బిల్లులు, స్కాలర్ షిప్పులపై చదువుకునే వారు. రాష్ట్రంలో కూడా జాతీయ విద్యావిధానం అమలులోకి రావడం వల్ల వసతి, విద్యా దీవెన పేరిట అమలు చేసిన పథకాలతో పేద విద్యార్థుల తలపై చెయ్యి పెట్టారని విద్యార్థి సంఘ నేత సూర్య వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఇంటర్ పాసయ్యాక విద్యార్థులు ఐటీ కోర్సుల్లో బీటెక్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సీట్లు దొరక్కుంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తక్కువ లేదని ఎస్వీయూలో పీహెచ్‌డీ చేసిన మల్లికార్జునరెడ్డి అంటున్నారు. డిగ్రీలో కూడా నాలుగేళ్లు చదవాల్సి రావడం వల్ల అడ్మిషన్లు తగ్గడానికి కారణమని ఆయన చెప్పారు. సైన్స్, టెక్నాలజీ కోర్సులకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత, ప్రయోగశాలల సమస్య వల్ల ముందుకు రావడం లేదని ఆయన విశ్లేషించారు.
Tags:    

Similar News