మోదీ పర్యటనను సక్సెస్‌ చేయాలి

తన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తారు.

Update: 2025-10-15 07:16 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఈ పర్యటనను గ్రాండ్‌గా నిర్వహించాలని సూచించారు. శ్రీశైలం, కర్నూలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ విధానాల ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.

టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయని వివరించారు. ఢిల్లీలో ఇటీవల గూగుల్‌ సంస్థతో చేసిన ఒప్పందం ద్వారా విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ డేటా హబ్‌ ఏర్పాటు చేరుతుందని, ఇది చారిత్రక నిర్ణయమని చెప్పారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌కు వచ్చినట్లే, ఈ హబ్‌ రాష్ట్రంలో ఐటీ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు రావడంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్‌ చొరవలు కీలకమని, ఐటీ మంత్రి నారా లోకేష్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్‌ ప్రతినిధులతో సంప్రదించి ఈ పెట్టుబడిని తెచ్చారని ప్రశంసించారు. 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పడే ఈ అతిపెద్ద ఏఐ డేటా హబ్‌ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తుందని ఆయన వివరించారు.
యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్‌ వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని, ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గొనే సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమాన్ని కూడా సక్సెస్‌ చేద్దామని పిలుపునిచ్చారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆదా అవుతుందని, ఈ నెక్ట్స్‌ జెన్‌ సంస్కరణలపై నెల నెలా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువస్తున్నామని, సీమ జిల్లాలు ఉద్యావన పంటలకు కేంద్రంగా మారాయని చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టులు, రైల్వే కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, గత పాలకులు సీమలో సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. రాయలసీమను టూరిజం డెస్టినేషన్‌గా మార్చుతామని, తిరుపతి, శ్రీశైలం, గండికోట వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివద్ధి చేస్తున్నామని చెప్పారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
రేపు ప్రధాని 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, కర్నూలులో జీఎస్టీ సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చంద్రబాబు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మూడు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సభను విజయవంతం చేయాలని, కూటమి నేతలంతా కలిసి రాష్ట్రాన్ని మోడల్‌ స్టేట్‌గా అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రధాని రాకతో శ్రీశైలం క్షేత్రానికి మహర్ధ రాబోతుందని, తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, నేతలు గూగుల్‌ సంస్థను రాష్ట్రానికి తెచ్చేందుకు చంద్రబాబు, లోకేశ్‌ చేసిన కృషిని ప్రశంసించారు.
Tags:    

Similar News