గూగుల్‌ విశాఖనే కాదు ఏపీనే మార్చేస్తుంది

రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలని, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలన్నది మా ధ్యేయమని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Update: 2025-10-15 06:58 GMT

హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్‌ పూర్తిగా మార్చేసిందని, అంతకంటే ఎక్కువ స్థాయిలో విశాఖను, ఆంధ్రప్రదేశ్‌ ను గూగుల్‌ మార్చేస్తుందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. అమరావతిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఎన్నో కంపెనీలు రానున్నాయని ఆయన తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం కారణంగా రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. గూగుల్‌ పెట్టుబడి ఫలితంగా లక్ష మందికి మించిన ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని వెల్లడించారు.

2024 సెప్టెంబర్‌లో గూగుల్‌ ప్రతినిధులు విశాఖకు వచ్చిన సమయంలో వారితో భేటీ అయ్యానని, డేటా సెంటర్‌ స్థలాన్ని పరిశీలించామని ఆయన చెప్పారు. ఆ సమావేశం తర్వాత నెల రోజుల్లోనే అమెరికా వెళ్లి గూగుల్‌ క్లౌడ్‌ నేతలను కలిశానని తెలిపారు. నవంబర్‌లో గూగుల్‌ బృందం ముఖ్యమంత్రిని సంప్రదించిందని, ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలుమార్లు చర్చలు జరిపారని వివరించారు. అనేక సంప్రదింపుల తరువాత ఈ భారీ పెట్టుబడి సాకారమైందని, ఇలాంటి పెద్ద పెట్టుబడులపై అంతటా చర్చలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలని, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలన్నది మా ధ్యేయమని లోకేశ్‌ స్పష్టం చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తున్నామని, శ్రీసిటీ ప్రాంతంలో గ్రేటర్‌ ఎకోసిస్టమ్‌లో బహుళ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. డైకెన్, బ్లూస్టార్, ఎల్జీ వంటి కంపెనీల పెట్టుబడులు విస్తరిస్తున్నాయని వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా పెట్టుబడులు పెడుతోందని, అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగాన్ని పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తున్నామని, ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ వంటి సంస్థలు పెట్టుబడులు చేస్తున్నాయని ఆయన వివరించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివద్ధి చేయడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని లోకేశ్‌ తెలిపారు. ఒప్పందాలు చేయడం మాత్రమే కాదు, వాటిని ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు సష్టించాలన్న హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని, ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని సవాలుగా స్వీకరించామని పేర్కొన్నారు. ఏ కంపెనీ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు ఉంటే, ఆంధ్రలో డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ లాంటి వేగవంతమైన అభివృద్ధి ఉందని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతోందని వివరించారు.
చరిత్ర సృష్టించడమైనా, రికార్డులు తిరగరాయడమైనా చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని లోకేశ్‌ అన్నారు. గతంలో కియా ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించామని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడం భారీ విజయమని, డేటా సెంటర్‌ ఏర్పాటు మరో మైలురాయి అని తెలిపారు. నవంబర్‌లో మరిన్ని శుభవార్తలు రానున్నాయని చెప్పారు. వైకాపా నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రికి డేటా సెంటర్‌ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. నవంబర్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నామని లోకేశ్‌ వెల్లడించారు.
Tags:    

Similar News