కాంగ్రెస్ ను పాకిస్ధాన్ తో పోల్చిన కేంద్రమంత్రి బండి
పాకిస్ధాన్ జట్టు, కాంగ్రెస్ పార్టీని ఒకటే అని బండి సంజయ్(Bandi Sanjay) చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.;
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అజ్ఙానం బయటపడింది. కరీంనగర్ జిల్లాలో ఎంఎల్సీ ఎన్నికల్లో మంగళవారం బండి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు పాకిస్ధాన్(Pakisthan), ఇండియా(India), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) అంటు పిచ్చిపోలికలు చేశారు. ఇక్కడే కేంద్రమంత్రి అజ్ఞానం బయటపడింది. ఎలాగంటే పాకిస్ధాన్ జట్టు-కాంగ్రెస్ పార్టీ ఒకటేనని బండి అన్నారు. అలాగే ఇండియా జట్టు-బీజేపీ పార్టీ ఒకటే అన్నట్లుగా బండి మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రొఫీ(Champions Trophy)ని దృష్టిలో పెట్టుకుని ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని, పాకిస్ధాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓట్లేయాలని పిలుపిచ్చాడు. ఇక్కడ బండికి తెలియని విషయం ఏమిటంటే ఛాంపియన్స్ ట్రొఫీ నుండి పాకిస్ధాన్ ఎలిమినేట్ అయిపోయిందని. ఎలిమినేట్ అయిపోయిన జట్టు గెలవటం అనే ప్రశ్నే ఉండదు కదా. ఇంతచిన్న విషయం కూడా తెలీకుండానే పాకిస్ధాన్ జట్టు, కాంగ్రెస్ పార్టీని ఒకటే అని బండి సంజయ్(Bandi Sanjay) చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
పాకిస్ధాన్ జట్టును ప్రచారంలోకితెచ్చి జనాల్లోని భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డికి ఓట్లేయించుకోవాలన్నది బండి ఉద్దేశ్యం అయ్యుండచ్చు. డైరెక్టుగా బీజేపీకి ఓటేయమని ఓటర్లను రిక్వెస్టుచేయకుండా క్రికెట్, పాకిస్ధాన్, కాంగ్రెస్ పార్టీ, ఇండియా, బీజేపీ అనే అర్ధంలేని పోలికలు తేవటం ఏమిటో బండికే తెలియాలి. మతపరమైన రాజకీయాలు, భావోద్వేగాలను రెచ్చగొడితే కాని బీజేపీకి జనాలు ఓట్లేయరనే ఆరోపణలను తాజా ప్రచారంలో బండి నిజం చేసినట్లయ్యింది. డైరెక్టుగా అడిగితే జనాలు ఓట్లేస్తారన్న నమ్మకంలేకనే బండి ఇలాంటి పిచ్చి పోలికలు తెచ్చినట్లున్నారు.
పనిలోపనిగా టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) అంశంలో కూడా రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బయడపడిందని, అరెస్టులు కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ఇంతవరకు ఓకేనే కాని ట్యాపింగ్ కీలక సూత్రధారి ప్రభాకరరావు అమెరికా(America)కు పారిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచేయలేకపోయినట్లు ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభాకరరావును అమెరికా నుండి తెప్పించలేకపోయినా, కేసీఆర్ ను అరెస్టు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చేతకాదన్నారు. అందుకనే ట్యాపింగ్ కేసును కేంద్రప్రభుత్వానికి అప్పగిస్తే వెంటనే రంగంలోకి దిగుతుందని చెప్పటమే విడ్డూరంగా ఉంది. ప్రభాకరరావును అమెరికా నుండి తెప్పించటం రాష్ట్రప్రభుత్వం చేతిలో లేదనే కదా రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది.
అమెరికాలో ఉన్న ప్రభాకరరావును ఇండియాకు రప్పించమని రాష్ట్రప్రభుత్వం నుండి సీబీఐ(CBI) రాసిన రెండు లేఖలకే దిక్కులేదు. రేవంత్ ప్రభుత్వం రాసిన రెండు లేఖల విషయంలో సీబీఐ ఏమిచేస్తోందనే విషయాలను మాత్రం బండి మాట్లాడటంలేదు. ఎంతసేపూ కేసీఆర్ ను అరెస్టుచేయాలనే డిమాండ్ తప్ప ఏ కేసులో అరెస్టుచేయాలి ? ఏ ఆధారాలతో కేసీఆర్ ను అరెస్టుచేయాలంటే మాత్రం బండి నోరిప్పటంలేదు.