దుర్గమ్మకు టీటీడీ వెంకన్న సారె
ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారికి టీటీడీ బోర్డు సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పణ
By : The Federal
Update: 2025-10-01 13:44 GMT
ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులు బుధవారం సారె సమర్పించారు. టీటీడీ బోర్డు సభ్యులైన సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు, టి. జానకి దేవి, ఎ. రంగశ్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చామని సుచిత్ర ఎల్లా తెలిపారు. ‘మహర్నవమి రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. దుర్గమ్మ కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాం,‘ అని ఆమె పేర్కొన్నారు.
నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ, ‘అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. తిరుపతి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమ్మవారు మరింత శక్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా ఆశీర్వదించాలని కోరుకున్నాం,‘ అని వెల్లడించారు. సారెతో ఆలయానికి విచ్చేసిన టీటీడీ బృందానికి దుర్గగుడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు శుభప్రదంగా నిలిచింది.