TTD | శ్రీవారి సేవ ఇక విశ్వవ్యాపితం

దీనికి కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ ఆదేశించారు. 16 దేశాల ప్రతినిధులతో వర్చువల్ మీట్ నిర్వహించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-24 14:56 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD) అమలు చేస్తున్న శ్రీవారి స్వచ్ఛంద సేవను విశ్వవ్యాపితం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయాలని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం 14 దేశాల్లో ఉన్న వివిధ రంగాల ఎన్ఆర్ఐ నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.


తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు, అన్నదాన సత్రాల్లో శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని చెప్పారు.
టీటీడీ ఈఓ ఇంకా ఏమన్నారంటే..

టీటీడీ ఈఓ జే. శ్యామలరావు

"ప్రపంచంలో ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు" అని ఈఓ శ్యామలరావు చెప్పారు. వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
టీటీడీ ద్వారా అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని అభినందించారు. తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల్లో వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ , ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్.ఆర్.ఐలు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్.ఆర్.ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టిటిడిలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు .వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో తెలిపారు.
"ఈ అవకాశం తమకు స్వామి వారు కల్పించిన మహద్భాగ్యం" అని వర్చువల్ సమావేశానికి హాజరైన ఎన్ఆర్ఐలు వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని 14 దేశాల నుంచి ఎన్ఆర్ఐలు వర్చువల మీట్ లో పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని విభాగాల్లో సేవలు అందించడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. దీనివల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో యాత్రికులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు కలుగుతుందని ఈఓ శ్యామలరావు అభిప్రాయపడ్డారు.
ఏ దేశాల నుంచి పాల్గొన్నారంటే..
టీటీడీ ఈఓ శ్యామలరావు నిర్వహించిన వర్చువల్ మీట్ కు సూర్యప్రకాశ్, డాక్టర్ శివశంకర్ (జర్మనీ), సంతోష్ పల్లె, రమేశ్ గుమ్మడవల్లి ( (ఐర్లాండ్), లోకనాథం, శ్రీ విజయ్ కుమార్, శ్రీ అరుణ్ ముమ్మలనేని, శ్రీ శివరామ్ రెడ్డి, శ్రీ విజయ్ కుమార్, డా. అనిల్ కుమార్, డా. అనిల్ కుమార్, శ్రీమతి రీతు (యూకె ) నుంచి హాజరయ్యారు. అలాగే శివరామ్ (నెదర్లాండ్ ), కన్నెవిరనె ( ప్రాన్స్), సంతోష్ - శ్రీ చంద్ర అక్కల (పోలెండ్ ఐర్లాండ్), రమణకుమార్ రంగా (స్వీడన్), అమర్ కవి (స్విట్జర్లాండ్), రఘువీర్ బండార్, హర్షిత (అమెరికా), అమరనాథ్ (USA), రామ్ దాస్ (డెన్మార్క్), విక్కీ తురాయ్జా (మారిషష్ , శ్రీలంక), విక్రమ్ (దుబాయ్), Dr అనిల్ కుమార్ ( UK ) కూడా ఉన్నారు. టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి , సీఈ టివి. సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, శేషా రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, సీఎంవో నర్మద పాల్గొన్నారు.

Similar News