జూబ్లీహిల్స్ ఎన్నికలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది
కమ్మవాళ్ళ ఓట్లను వేయించుకోవటం కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్(BRS) పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి
సీనియర్ ఎన్టీఆర్ కాలంచేసి సుమారు 30 ఏళ్ళవుతోంది. అయినా అన్నగారి పేరు రాజకీయాలకు సంబంధించి ఏదో రూపంలో ఇప్పటికీ జనాల్లో నానుతునే ఉంది. ఇపుడు విషయం ఏమిటంటే(Jubilee Hills by poll)జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా అన్నగారి(Sr NTR) పేరు బాగా వినబడుతోంది. నియోజకవర్గంలోని అనేక సామాజికవర్గాల్లో కమ్మవారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళ ఓట్లను వేయించుకోవటం కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్(BRS) పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎన్టీఆర్ పేరు వివాదాలకు కేంద్రంగా మారింది.
ఈమధ్యనే కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ప్రముఖులు అడిగినట్లుగా అమీర్ పేట్ లోని మైత్రీవనం దగ్గర ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు రేవంత్ హామీ ఇచ్చారు. రేవంత్ తో భేటీ తర్వాత కమ్మ సామాజికవర్గంలోని ఓట్లను కాంగ్రెస్ కే వేయిస్తామని ప్రముఖులు సీఎంకు హామీ ఇచ్చారు. అక్కడితో ఆఎపిసోడ్ ముగిసింది. ఇపుడు అదే ఎపిసోడ్ ను సడెన్ గా బీఆర్ఎస్ లోని కమ్మ ప్రముఖులు తెరమీదకు తీసుకొచ్చారు. ఎలాగంటే ఎన్టీఆర్ జ్ఞాపకాల కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని, గతంలో బీఆర్ఎస్ ఖమ్మం లక్కారం చెరువులో 50 అడుగుల విగ్రహం పెట్టిందని గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో పెట్టింది వాస్తవమే కాని ఆ విగ్రహాన్ని చూస్తే ఎన్టీఆర్ ది అని అనుకోరు. అప్పట్లోనే విగ్రహంపై అనేక సెటైర్లు పేలినా ప్రభుత్వం, కమ్మ ప్రముఖులు పట్టించుకోలేదు.
అయితే అప్పటికే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూకట్ పల్లిలో పెట్టాలని కమ్మ ప్రముఖులు, కమ్మ సంఘం బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహాన్ని కుకట్ పల్లిలో కాకుండా ఖమ్మంలో ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ జ్ఞాపకాలను పదిలం చేయటంకోసం కేసీఆర్ చాలా కష్టపడ్డారు కాబట్టి కమ్మ ఓటర్లంతా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతకే ఓట్లేయాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపిచ్చారు. ఎన్టీఆర్ మీద అభిమానంతోనే తనకొడుక్కి తారకరామారావు అని కేసీఆర్ పేరు పెట్టుకున్న విషయాన్ని నామా గుర్తుచేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తన పేరుకు ఎన్టీఆర్ లోని తారకరామారావుకు ఎలాంటి సంబంధంలేదని ఒక ఇంటర్వ్యూలో కేటీఆరే స్వయంగా వివరణ ఇచ్చారు. తనపేరులోని తారకరామారావుకు, ఎన్టీఆర్ పేరుకు సంబంధంలేదు మొర్రో అని స్వయంగా కేటీఆరే వివరణ ఇచ్చినా నామా మాత్రం అంగీకరించటంలేదు.
మైత్రీవనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ హామీ ఇచ్చారు కాబట్టి కమ్మోరంతా నవీన్ కే ఓట్లేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే, కాదు కాదు గతంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో ఏర్పాటుచేసి అభిమానాన్ని చాటుకున్నాము కాబట్టి తమ అభ్యర్ధి సునీతకే ఓట్లేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ కమ్మ ఓట్లు ఎవరివైపు మొగ్గుచూపుతాయో ?