సింఘాల్ వచ్చే 'పింక్ డైమండ్ 'మళ్లీ తెరపై కొచ్చే..

పరువు నష్టం దావా కేసులో టీటీడీ కోర్టులో డిపాజిట్ చేసిన రు.2కోట్లు మాటేమిటి?కేసు సాగుతుండగానే పురావస్తు శాఖ ఎందుకు ప్రకటన చేసింది?;

Update: 2025-09-16 12:34 GMT

'తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజులు ఆ కాలంలో బహూకరించిన ఆభరణాలలో పింక్ డైమండ్ అనేదే లేదు.అది పింక్ డైమాండ్ కాదు.. కేవలం కెంపు మాత్రమే' ఇది తాజాగా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తేల్చి చెప్పిన విషయం .దీంతో తిరుమల పింక్ డైమండ్ అంశం తిరిగి తెరమీదికి వచ్చింది.ఇన్ని సంవత్సరాల తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ విషయాన్ని ఇప్పుడెందుకు వెల్లడించారనేది అట్లుంచితే , ఈ ప్రకటనతో తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పై వున్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లేనా ?అన్న చర్చా సాగుతోంది.మరి అసలు లేని పింక్ డైమండ్ విషయంలో కోర్టులో కొనసాగుతున్న కేసును ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం తేలుస్తుందా .. ఈ పరువునష్టం దావా కేసులో కోర్టుకు డిపాజిట్ గా చెల్లించిన తిరుమల శ్రీవారి సొమ్ము అక్షరాల రెండు కోట్ల రూపాయలను తిరిగి పొందుతారా.. లేకపోతే ఈ కేసు గెలిచి టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసిన వారి నుంచి ముక్కుపిండి అంతకంత వసూలు చేస్తారో చూడాల్సివుంది.టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ ఉన్నప్పుడు మొదలైన పింక్ డైమండ్ వివాదం మల్లీ సింఘాల్ రెండోసారి ఈవోగా వచ్చినప్పుడే తెరపైకి వచ్చింది.

తిరుపతి కోర్టులో రేపు విచారణ
2018 నుంచి సాగుతున్న ఈ కేసు వాయిదాలకే పరిమిత మవుతోంది. మధ్యలో కేసు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించిన టీటీడీ మళ్లీ పిటీషన్ వెనక్కు తీసుకుంది.తిరుపతి కోర్టులో సాగుతున్న ఈ కేసు వాయిదా ఈ నెల 17 వ తేదీ (రేపు)వుంది .మరి ఇప్పుడు టీటీడీ ఏమి చేస్తుందన్నది ప్రశ్నగా మారింది.ఈ కేసులో గతంలోనే ఇంప్లీడ్ అయిన రాయలసీమ పోరాటసమితి నేత బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ " తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ పై జరుగుతున్న కేసును వేగవంతం చేసి వాస్తవాలను టీటీడీ భక్తకోటికి తెలియజేయాలి.గతంలో పింక్ డైమండ్ ప్రచారం వెనుక వున్న స్వార్ధ రాజకీయాలకు బహిర్గతం చేయాలి " అన్నారు. టీటీడీ కోర్టులో డిపాజిట్ చేసిన రెండు కోట్ల విషయం ప్రస్తావిస్తూ "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు ముడిపడి ఉన్న పింక్ డైమండ్ అంశాన్ని టిటిడి బోర్డు , ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించి కోర్టులో డిపాజిట్ గా కట్టిన 2 కోట్ల శ్రీవారి సొమ్మును టిటిడి ఖాతాలో జమయ్యేలా చూడాలి, అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి,శ్రీవారి సొమ్ము రూపాయి కూడా వదలడానికి వీల్లేదు" అన్నారు.
భక్తుల సొమ్ము దుర్వినియోగమా..?
పవిత్రమైన తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చిన సొమ్ము దుర్వియోగం కాకూడదని , అలాంటిది టీటీడీ బోర్టు తీసుకుంటున్న కొన్నినిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వుంటున్నాయని హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ అన్నారు.తిరుమల పింక్ డైమండ్ పరువు నష్టం కేసులో ఇంప్లీడ్ అయిన లలిత్ కుమార్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ " పింక్ డైమండ్ కేసులోపరువు నష్టం దావా వేసిన టీటీడీ బోర్డ్ , ఆ తరువాత కేసు విత్ డ్రా చేసుకుందామని చూసింది,డిపాజిట్ చేసిన 2 కోట్ల రూపాయలు వదులుకోడానికీ సిద్దమయ్యింది.అందుకే ఈ కేసులో హిందూ జనశక్తి తరపున ఇంప్లీడ్ అయ్యాం,కేసు వాపస్ కాకుండా చూశాం" అన్నారు."టీటీడీకి వచ్చే ఆదాయంలో రెండు కోట్లు తక్కువే కావచ్చు,కానీ పేదలు సైతం భక్తితో భగవంతునికి ఇచ్చిన సొమ్ము కూడా దానిలో వుంది.అలా ఎలా వదిలేస్తారన్నది మా ప్రశ్న ,అంతేకానీ రాజకీయాలకు పింక్ డైమండ్ కు మాకు సంబంధం లేదు.టీటీడీ గౌరవాన్ని కాపాడాల్సిందే" అంటూ తాము కేసులో ఇంప్లీడ్ ఎందుకయ్యామో చెప్పుకొచ్చారు.
మరికొందరు శ్రీవారి భక్తులు సైతం టీటీడీని రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆ పరిస్థితులు రావాలని అభిప్రాయపడ్డారు.పింక్ డైమండ్ అంశంపై ఏలూరు జిల్లా బీజేపీ ధార్మిక సెల్ మాజీ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ ఒక శ్రీవారి భక్తుడిగా స్వామి వారి సొత్తును , పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టీడీడీ బోర్డుపై వుందన్నారు. "లేని పింక్ డైమండ్ విషయంలో టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసిన అప్పటి ప్రధానార్చకుడు రమణదీక్షితులను ఎందుకు శిక్షించలేదు,బాధ్యుడిని చేసి పరువు నష్టం సొమ్ము కట్టించాల్సిందే,టీటీడీ కోర్టుకు 2కోట్లు కట్టింది.ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికే ఏమీ తేల్చలేదు.భక్తుల సొమ్ముకు జవాబుదారీ ఎవరు"అని ప్రశ్నించారు.అయినా ఆనాడు రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలపై పరువునష్టం దావా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వేసి వుంటే బాగుండేదన్నారు.
అసలు పింక్ డైమండ్ వివాదమేంటి?
తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్‌ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో అప్పటి తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీవారికి మైసూరు మహారాజు పింక్ డైమండ్ ఇచ్చారని అది కనబడటం లేదని ప్రధాన అర్చకులు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.2019 ఎన్నికల సమయం లోనూ ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పింక్ డైమండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరిపోయిందని పోలీస్ విజిలెన్స్ అధికారులు తమ బలగాలతో వెంటనే చంద్రబాబు నాయుడు ఇంటిలో తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుందని ఆలస్యం చేస్తే "ఖండాంతరాలు దాటిపోతాయని బహిరంగ ప్రకటన చేయడం కూడా రాజకీయ వివాదంగా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్రతిపక్ష పార్టీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అవాస్తవాలను ప్రచారం చేశారని వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అప్పటి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ,టీటీడీ ఈవో గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్,జేఈవో శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో కోర్టులో కేసు వేశారు.టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించారని భక్తుల మనోభావాలు గాయపరిచారని తిరుపతి 5 th ADJ కోర్టులో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు,విజయ సాయిరెడ్డి లపై 100 కోట్ల చొప్పున ఇరువురిపై 200 కోట్లకు పరువు నష్టం కేసు వేశారు. అందుకు గాను 2 కోట్ల రూపాయలను కోర్టులో శ్రీవారి నిధులను ఫీజు రూపంలో జమ చేసారు.అయితే హైకోర్టు , సుప్రీం కోర్టులలో కూడా పింక్ డైమండ్ విషయం సీబీఐకు అప్పగించాలన్న పిటీషన్లు దాఖలయినా , అసలు పింక్ డైమండ్ అనేదే తిరుమల శ్రీవారి ఆభరణాల జాబితాలో లేదని నిపుణుల కమిటీ తేల్చడంతో ,ఆయా పిటీషన్లను కోర్టులు కొట్టివేశాయి.అయితే తిరుపతి కోర్టులో టీటీడీ వేసిన పరువునష్టం దావా కేసు మాత్రం వాయిదాల పర్వంతో ఏడు సంవత్సరాలుగా సాగుతోంది.
ASI పింక్ డైమండ్ విషయం ఇప్పుడెందుకు చెప్పింది
తిరుమల పింక్ డైమండ్ పై ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్ మునిరత్నం నాయుడు ఇప్పుడు మాట్లాడటం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇంతకాలం తరువాత ఈ విషయంలో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ ఎందుకు నోరు తెరిచింది.టీటీడీ ఆ డిపార్టుమెంటును ఏమైనా కోరిందా తేలాల్సివుంది.పింక్ డైమండ్ ఉన్నది నిజమా?అపద్ధమా? అని నిర్ధారించాల్సినది తిరువాభరణం రిజిస్టర్ ప్రకారం "జుమాలజిస్టు"లే తప్ప ఆర్కియాలజిస్టులు కాదని, అలాగే కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఇలాంటి ప్రకటన చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కదా అని రెండు రోజులుగా భక్తులలో కలుగుతున్న సందేహాలను బీజేపీ నేత నవీన్ రెడ్డి వెలిబుచ్చారు.తాను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయిన విషయాన్ని గుర్తు చేశారు.అనిల్ కుమార్ సింఘాల్ ఈఓ గా గతంలో పని చేసిన సందర్భంలో పింక్ డైమండ్ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఈవోగా సింఘాల్ రెండవసారి బాధ్యతలు స్వీకరించిన 2 రోజులకే ఆర్కియాలజీ ప్రకటన అంటూ పింక్ డైమండ్ పై వరుస కథనాలు మీడియాలో రావడం అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా పింక్ డైమండ్ విషయంలో అబద్దపు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు చేపట్టి , స్వామివారి నిధులు కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Tags:    

Similar News