జీఏడీకి టీటీడీ ఈవో శ్యాలరావు బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.;
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం కేసులో కీలకంగా వ్యవహరించిన టీటీడీ ఈవో జే శ్యామలరావును కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. కల్తీ లడ్డూ వ్యవహారంతో పాటు తిరుమల తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటన వంటి అనేక అంశాలలో శ్రీవారి ప్రతిష్టకు భంగం కలగకుండా చాకచక్యంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టిన టీటీడీ ఈవో జే శ్యామలరావును అక్కడ నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా నియమించారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న అనిల్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా ప్రభుత్వం నియమించింది. 2024 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్‌కుమార్ మీనాను సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి బదిలీ చేసి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ అనంతరామును అటవీ, పర్యావరణ శాఖ నుంచి బదిలీ చేసి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కే కృష్ణబాబును రోడ్లు, భవనాలు, రవాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఇప్పటి వరకు రోడ్లు, భవనాలు, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కాంతిలాల్ దండేని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. సివిల్ సప్లైస్ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సౌరభ్ గౌర్‌ను మెడికల్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న సీహెచ్ శ్రీధర్‌ను అదే మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నయమించారు. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న ఎంవీ శేషగిరి బాబును పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా నియమించారు. రెవెన్యూ ఎండోమెంట్ శాఖ కార్యదర్శిగా హరిజవర్‌లాల్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.