తిరుపతిలో మహా శాంతి యాగం.. భక్తులకు ఈవో భరోసా..

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందన్న వివాదం రాజుకున్న క్రమంలో ఈరోజు ఆలయంలో మహాశాంతి యాగం ప్రారంభించింది టీటీడీ.

Update: 2024-09-23 08:28 GMT

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందన్న వివాదం రాజుకున్న క్రమంలో ఈరోజు ఆలయంలో మహాశాంతి యాగం ప్రారంభించింది యాజమాన్య బోర్డు. ఈ యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న వివాదం నేపథ్యంలో ప్రాయశ్చత్త కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల ప్రక్షాళన, ప్రాయిశ్చిత్త కార్యక్రమాలకు టీటీడీ చేస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే ఆలయంలో మహా శాంతి యాగాన్ని అర్చకులు నిర్వమిస్తున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో ఈ మహా శాంతి యాగం క్రతువు చేశారు. ముందుగా పుణ్యావచర కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా వాస్తు హోమం నిర్వమించి సంప్రోక్షణ చేయడంతో యాగం ముగిసింది. ఈ యాగంలో ఎనిమిది మంది అర్చకులు, ముగ్గురు ఆగమపండితులతో పాటు ఈవో శ్యామలరావు కూడా పాల్గొన్నారు. ఈ యాగం పూర్తయిన తరవాత భక్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఆలయమంతా ప్రోక్షణ చేశామని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఈ నేపథ్యంలో నెయ్యి తెచ్చే ట్యాంకర్లకు కూడా పూజ చేశారు.

అందుకే హోమం చేశాం

‘‘ఇటీవల ఆలయంలో జరిగిన అన్ని దోషాలు తొలగిపోవాలని ఈరోజు మహా శాంతి యాగం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పవిత్రోత్సవాల ముందే జరిగిన దోషం ఈ పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశాం. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో తొలగుతాయి. భక్తులు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని ఆయన చెప్పారు.

నెయ్యి టెస్టింగ్‌కు ప్రత్యేక ప్యానెల్: ఈవో

‘‘లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న విషయం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కల్తీ వస్తువులను అరికట్టడానికి టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది. స్వచ్ఛమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తాం. ఆ తర్వాత కూడా వచ్చిన నెయ్యి నాణ్యతను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు పూర్తవుతుంది. ఏన్‌ఏబీఎల్ ల్యాబ్ ద్వారా టెస్టింగ్ విధానాన్ని కొనసాగిస్తాం. 18 మందితో సెన్సరీ ప్యానెల్ సిద్ధం చేశాం. ఈ ప్యానెల్ ద్వారా నెయ్యి పరీక్షలను నిరంతరాయంగా నిర్వహిస్తాం. రూ.75 లక్షల వ్యవయంతో ఎన్‌ఏబీఎల్ తరహాలో ఇక్కడ కూడా ఒక ల్యాబ్‌ను సిద్ధం చేస్తాం. ఎఫ్ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కూడా ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. కల్తీ అన్న మాటకు కూడా తావులేకుండా చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

నెయ్యి ట్యాంకర్లకు ఎలక్ట్రిక్ లాకింగ్

తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందన్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వివరించింది.

Tags:    

Similar News