Tirumala | వైకుంఠ ద్వార దర్శనాల వివాదానికి తెరపడుతుందా?
తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి భేటీలో చర్చ....
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-18 04:09 GMT
తిరుమలలో ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి తర్జనభర్జన పడుతోంది. తిరుమలలో ఈ రోజు మంగళవారం ఉదయం సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశికి తోడు నూతన సంవత్సరం-2026 జనవరి ఒకటో తేదీ కావడం వల్ల వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సామాన్య యాత్రికుల సంఖ్య కూడా భారీగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏర్పాట్లపై సమీక్ష
ప్రత్యేక పర్వదినాలు వరుసగా రావడం వల్ల యాత్రికులకు దర్శనం, వసతి కల్పించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు అధ్యక్షతన జరిగే పాలక మండలి సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుమలలో ఎక్కువ మంది సామాన్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి వైసీపీ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజులు వైకుంఠ ద్వారాలు తెరవడం వల్ల ఎక్కువ మందికి దర్శనం కల్పించడం సాధ్యం కావడం లేదని భావించిన ఆనాటి పాలక మండలి మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించిన తరువాత పది రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంచడం ద్వారా సుమారు 6.50 లక్షల నుంచి ఏడు లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. దీనికోసం తిరుపతి నగరంలో పది ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేసి, టోకెన్లు జారీ చేశారు.
విషాధ ఘటనతో..
ఈ సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం, ఆరుగురు మరణించిన విషాధ ఘటన చోటుచేసుకుంది. మరో 40 మంది వరకు గాయపడ్డారు. ఊహించని ఈ సంఘటనతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో టీటీడీ పాలక మండలి, అధికారులు అంతర్మథనంలో పడ్డారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచడం ఆగమశాస్త్రానికి విరుద్ధమనే వాదన తెరపైకి తెచ్చారు.
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తోపాటు ఆ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి సందిగ్ధంలో పడింది.
"వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులకు కుదరిస్తే యాత్రికుల ఆగ్రహానికి గురవుతాం. ఏడు లక్షల మందిని దర్శనాలకు దూరం చేసిన వాళ్లం అవుతాం. ప్రతిపక్ష పార్టీ నుంచి మాటల దాడి ఎక్కువగా ఉంది" అని పాలక మండలి అంతర్మథనానికి గురైంది.
తిరుమలలో గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ వ్యవహారంపై సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తసుకుంది.
"తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై అధ్యయనం చేస్తాం. నిపుణుల సలహాలు తీసుకుంటాం. ఆన్ లైన్ ద్వారా టోకెన్లు ఇవ్వాలా? మరో పద్ధతి అనుసరించాలా?" అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు చెప్పారు.
తిరుమలలో మంగళవారం భేటీ కానున్న పాలక మండలి సమావేశంలో ఇదే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా వచ్చే వీఐపీలు, వీవీఐపీలకు దర్శనం తోపాటు సామాన్య యాత్రికులకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లపై ఎలాంటి నిర్ణయం తీసకుంటారనేది మధ్యాహ్నం తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.