Fishermen| సముద్రంలో చిక్కుకుని.. రాత్రంతా నరకయాతన
చేపలవేటకు వెళ్లిన బోటు ఇంజిన్ చెడిపోయింది. జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. 24 గంటల తరువాత సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు
By : SSV Bhaskar Rao
Update: 2024-11-27 10:31 GMT
సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. హెచ్చరికలు ఖాతరు చేయని నెల్లూరు జిల్లా (తిరుపతి జిల్లా)కు చెందిన 9 మంది జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. మెకనైజ్డ్ బోటు ఇంజిన్ పాడయింది. ముందుకు కదలలేని పరిస్థితి. అలలధాటికి తట్టుకోవడం కష్టంగా ఉంది. ఒక రాత్రి మొత్తం బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్య జాలర్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాపాడే వారి కోసం నిరీక్షించారు.
ఈ సమాచారం మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులకు అందింది. వెంటనే స్పందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోస్ట్కార్డు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అతి కష్టం మీద బోటుతో సహా తొమ్మిది మంది జాలర్లను సురక్షితంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు చేర్చారు.
"సముద్రంలో చిక్కున్న మత్స్యకారులు సురక్షితంగా కృష్ణపట్నం పోర్టుకు చేర్చాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి తుపాన్ తీవ్రతరం అవుతుందని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ ప్రభావం వల్ల 28వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులను కూడా ప్ర
భుత్వం, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయితే,
నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది తొమ్మిది మందిమత్స్యకారుల తో కూడిన మెకనైజేడ్ బోటు తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం, వైటి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో చేపల వేటకు వెళ్లారు. బోటు ఇంజిన్ పాడైపోవడంతో అందులోని జాలర్ల నుంచి కుటుంబీకులతో పాటు జిల్లా అధికారులకు ఈనెల 26వతేదీ (మంగళవారం) సాయంత్రం సమాచారం అందింది. దీంతో,
రంగంలోకి కృష్ణపట్నం పోర్టు సిబ్బంది
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. వెంటనే కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించారు. సమీపంలోని కృష్ణపట్నం పోర్టు అధికారుల సహకారంతో పెద్ద పడవల్లో సముద్రంలోకి బయలుదేరారు. దుగరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన IND TN 02 MM2588 బోట్ వద్దకు చేరుకున్నారు. పోర్టు నుంచి బయలుదేరిన పెద్దపడవకు మెకనైజ్డ్ బోట్ ఇనుపతాళ్లతో లంకే వేసి ఒడ్డుకు లాక్కుని వచ్చారు. బోటులో చిక్కుకున్న బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం పోర్టుకు చేర్చారు. దీంతో ఒకరాత్రి మొత్తం బిక్కుబిక్కుమంటూ సముద్రం ఘోష, ఎగిసిపడే అలల మధ్య ప్రాణభయంతో బిక్కచచ్చిపోయిన జాలర్లు తమకు మళ్లీ ప్రాణం పోశారంటతూ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వారి యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్యకారుల వివరాలు
1.సీహెచ్. రమేష్,
2. కె. ఏడుకొండలు
3.కె.చిట్టిబాబు
4. కె.తిరుపతి
5. వి.హరి బాబు
6.వై.అరవండి
7.కె.వెంకట రమణయ్య
8. సి.హెచ్ శివాజీ
9. ఎ.తిరుపతి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వాతావరణ శాఖ ఇచ్చే సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే అప్రమత్తం చేస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పడు చేపట వేటకు వెళ్లవద్దనే సూచనలు పాటించాలని కోరారు.