మూడునెలలు రేవంత్ కు కష్టమేనా ?

రుణమాఫీ రూపంలో రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాలు ఎదురు నిలిచింది. ఈ సవాలును అధిగమించటం రేవంత్ ఇజ్జత్ కే సవాలుగా తయారైంది.

Update: 2024-05-16 07:29 GMT

రుణమాఫీ రూపంలో రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాలు ఎదురు నిలిచింది. ఈ సవాలును అధిగమించటం రేవంత్ ఇజ్జత్ కే సవాలుగా తయారైంది. అధిగమించలేకపోతే అన్నీ వైపుల నుండి దారుణమైన ఆరోపణలు, విమర్శలను ఎదుర్కోకతప్పదు. ఇంతకీ విషయం ఏమిటంటే రైతురుణమాఫీ ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా తయారైంది. అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిక్స్ గ్యారెంటీస్ ప్రకటించారు. అందులో రైతు రుణమాఫీ చాలా ప్రధానమైనది. రు. 2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణాలను మాఫీచేస్తామని రేవంత్ ప్రకటించారు. అనేక అంశాలకు తోడు సిక్స్ గ్యారెంటీస్ పనిచేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నాలుగు హామీలను అమలుచేశారు కాని ముఖ్యమైన రుణమాఫీ హామీని ఆగస్టు 15వ తేదీకి వాయిదావేశారు.

రుణమాఫీకి ఆగష్టు 15వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నారు కాని అది ఆచరణలోకి రావటం అంత ఈజీకాదని అర్ధమవుతోంది. ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో రేవంత్ కు ఈ విషయం స్పష్టంగా అర్ధమైంది. ఎందుకంటే రుణమాఫీ అమలుచేయాలంటే సుమారు రు. 40 వేల కోట్లు అవసరం. ఇపుడు ప్రభుత్వం అప్పులమీదే నడుస్తోంది. ప్రతినెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికీ కిందా మీదా పడుతోంది. అలాగే కేసీయార్ హయాంలో చేసిన అప్పులు, వడ్డీలు కట్టడానికే ఏడాదికి రు. 62 వేల కోట్లవుతోందని అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి అంటే ఈ ఐదుమాసాల్లోనే రు. 17, 618 కోట్లు అప్పులుచేసింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఇంత భయంకరంగా ఉండగా ఆగష్టు 15వ తేదీకి రుణమాఫీ చేయాలంటే రు. 40 వేల కోట్లు ఎక్కడినుండి ప్రభుత్వం సేకరిస్తుందన్నది పెద్ద సమస్యగా మారింది.

ఎన్ని అవస్తలైనా పడండి కాని రుణమాఫీకి అవసరమైన నిధులు మొత్తాన్ని సేకరించాల్సిందే అని రేవంత్ ఉన్నతాధికారులకు కచ్చితంగా చెప్పారు. రుణమాఫీ కోసం రైతుసంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానిపేరుతోనే బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల్లో అప్పులు తీసుకునే మార్గం ఆలోచించమని రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు నిధుల సేకరణ విషయంలో ఇపుడు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం, పార్టీ పరువుపోతుంది. పార్టీని జనాలు ఎప్పటికీ నమ్మరు. ఇదే సమయంలో రుణమాఫీ చేయటానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపధ్యంలో కష్టాల్లో నుండి రేవంత్ ఎలా గట్టెక్కుతారా అన్న విషయం ఆసక్తిగా మారింది.

ఇదేవిషయాన్ని ప్రముఖ ఆర్ధికశాఖ విశ్లేషకుడు పాపారావు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులుచేయటంలో కేసీయార్నే అనుసరిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడూ అప్పులు చేస్తున్నారు, అప్పుడూ అప్పులే చేశారని చెప్పారు. అప్పులు చేస్తున్నారినే ప్రతిపక్షంలో ఉన్నపుడు కేసీయార్ ను కాంగ్రెస్, బీజేపీలు పదేపదే టార్గెట్ చేసిన విషయాన్ని పాపారావు గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన అప్పులను చూపకుండా కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేసినట్లు అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేసిన రేవంత్ ఇపుడు తానుకూడా అదేదారిలో నడుస్తున్నట్లు చెప్పారు. అధికారంకోసం ఒకలాగ, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలాగ వ్యవహరించటంలో అన్నీపార్టీలు ఒకేలాగుంటాయని అభిప్రాయపడ్డారు. అవసరానికి అప్పులు తీసుకోమని ముఖ్యమంత్రి చెప్పటం అంటే అధిక వడ్డీకి అప్పులు తీసుకురమ్మని చెప్పటమే అర్ధమని పాపారావు చెప్పారు.

Tags:    

Similar News