TOLL TAX| తొలిదశలో ఈ స్టేట్ హైవేలపై 'టోలు' తీస్తారు!

జాతీయ రహదారుల (నేషనల్ హైవేస్) మాదిరిగానే రాష్ట్ర రహదారులపై వెళ్లే వాహనాల నుంచి కూడా అదే తరహాలో రుసుము వసూలు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.

Update: 2024-11-27 04:17 GMT
ఇప్పటికే హైవే ఎక్కితే టోల్ ఫీజు జూలు విదిలిస్తోంది. వాహన యజమానికి చేతి చమురు వదులుస్తోంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వివిధ వాహనాల నుంచి రోడ్డు నిర్వహణ నెపంతో ఏళ్ల తరబడి టోల్ ఫీజు వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు అది చాలదన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారుల (నేషనల్ హైవేస్) మాదిరిగానే రాష్ట్ర రహదారులపై వెళ్లే వాహనాల నుంచి కూడా అదే తరహాలో రుసుము వసూలు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. అదే అమలయితే వాహన యజమానులు ఎడాపెడా బాదుడును భరించాల్సిందే..
జాతీయ రహదారుల నిర్వహణ పేరిట కొన్నేళ్ల నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) టోల్ ఫీజును వసూలు చేస్తోంది. ఇందుకోసం ప్రతి 60 కి.మీలకు ఒకటి చొప్పున టోల్ గేట్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు 60 లోపు కిలోమీటర్ల కారు/జీపులో ప్రయాణిస్తే ఒకపక్క సగటున రూ.150 చెల్లించాల్సి వస్తోంది. (కొన్ని టోల్ గేట్లలో ఈ మొత్తం ఎక్కువగానూ ఉంటోంది) అది 24 గంటల వరకే చెల్లుబాటు అవుతోంది. అదే రానుపోను 24 గంటల్లో అయితే సగం చెల్లించాలి. 24 గంటలు దాటి ఒక్క నిమిషం అయినా మొత్తం కట్టాల్సిందే.
ఇలా ప్రతి 60 కి.మీలకు ఇదే తరహా బాదుడు కొనసాగుతుంది. గతంలో టోల్ ఫీజును ఆయా ప్లాజాల వద్దనే విధిగా చెల్లించాల్సి వచ్చేది. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోందన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ముందుగానే ఫాస్టాగ్ రీచార్జి చేయించుకోవలసి ఉంటుంది. సంబంధిత టోల్ గేట్కు చేరుకున్న వాహనానికి ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ నుంచి స్కాన్ చేసుకుని ఆ ఖాతా నుంచి టోల్ ఫీజు ఆటోమేటిక్ గా జమ చేసుకుంటుంది. ఇలా కార్లు, జీపులే కాదు.. లారీలు, బస్సులు, వ్యాన్లు, ట్రక్కులు వంటి వాహనాల యజమానులు నేషనల్ హైవేపై టోల్ ఫీజులు చెల్లించాలంటేనే బెంబేలెత్తి పోవలసిన పరిస్థితి కొనసాగుతోంది. పైగా ఈ టోల్ ఫీజుల చార్జీ ఏటా 5 శాతం పెంచుకోవడానికి సంబంధిత ప్లాజాల నిరాహకులకు (కాంట్రాక్టర్లకు) అనుమతి ఉంది. దీంతో ఏటా ఈ ఫీజు పెరుగుతూనే ఉంటుంది. ఇలా టోల్ ప్లాజాల బాదుడు నుంచి తప్పించుకునే పరిస్థితి వాహన యజమానులకు ఉండడం లేదు.
కూటమి వచ్చాక ..
ఒకపక్క లీటరు పెట్రోలు రూ.110, డీజిల్ రూ.100కి పెరిగి చేతి చమురు వదులుస్తున్నాయి. దీనికి అదనంగా టోల్ ఫీజులు తోడయ్యాయి. ఇవి చాలవన్నట్లు కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సరికొత్త బాదుడుకు సిద్ధమవుతోంది. ఇకపై రాష్ట్ర ర హదారులపై ప్రయాణించే వాహనాలకూ టోల్ వడ్డనకు సన్నాహాలు చేస్తోంది. దీనికి మెరుగైన రోడ్ల నిర్వహణ కోసం అంటూ కొత్త రాగం అందుకుంది. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో కాంట్రాక్టర్లకు టోల్ ఫీజు వసూలు బాధ్యతను అప్పగించాలని చూస్తోంది. తొలివిడతలో 18 రోడ్లలో 1307 కి.మీలు, రెండోవిడతలో 68 రోడ్లకు 3931 కి.మీల మేర పీపీపీ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం సలహా సంస్థలను ఎంపిక చేసుకుని నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు నిధులనూ మంజూరు చేసింది.
ఇదీ ప్రభుత్వ వాదన..
ఈ సరికొత్త బాదుడు పథకానికి ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోంది. ఏటా రోడ్లకు గుంతలు పడుతున్నాయి. వాటిని పూడ్చడానికి ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు. నిధుల కేటాయింపు కోసం నెలలు, ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఐదేళ్లకోసారి రోడ్ల రెన్యూవల్స్ కోసం అనుమతి అవసరం. ఆ అనుమతులు రావడానికి చాలా సమయమే పడుతోంది. ఈలోగానే గోతులు నూతులుగా మారుతున్నాయి. రోడ్ల పక్కన తుప్పలు, డొంకలు బలిసిపోతున్నాయి. అందువల్ల జాతీయ రహదారుల మాదిరిగానే రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు వసూలు చేసి, ఈ రోడ్ల నిర్వహణ చేపట్టవచ్చన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇందుకోసం పీపీపీ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించి వారి ద్వారా టోల్ ఫీజు వసూలు టోల్ ఫీజు వసూలు చేయడం ఇందులోని అంతరంగమన్నమాట!
ఇది అమలులోకి వస్తే సంబంధిత రాష్ట్ర హైవేలపై తిరిగే (2, 3 వీలర్లు మినహా) మిగిలిన అన్ని వాహనాలు టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఇలా వచ్చిన సొమ్ముతో రోడ్లు గోతులు పడితే మునుపటిలా ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం రాకుండా సత్వరమే మరమ్మతులు చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల వాహనాల ప్రయాణం సాఫీగా సాగుతుందని అంటోంది. ఐదేళ్లకోసారి బీటీ (తారు) లేయరు వేసుకోవడానికి వీలవుతుందని, నిర్వహణ వ్యయం అంతా సంబంధిత కాంట్రాక్టరే చూసుకుంటాడని పేర్కొంటోంది.
అధ్యయనానికి సన్నద్దం..
కూటమి ప్రభుత్వం బుర్రకొచ్చిన ఈ ఆలోచన అమలుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి నడుం బిగించింది. ఇందుకోసం సలహా సంస్థలను ఎంపిక చేసుకుని, నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎంపిక చేసిన ఆయా రోడ్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది? భవిష్యత్తులో ఎంత పెరిగే అవకాశం ఉంది? వాహనాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? కాంట్రాక్టరుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

పీపీపీ విధానంలో తొలివిడత ఎంపికైన రోడ్లు

రోడ్డు వివరం                                                                     కి.మీలు

చిలకపాలెం-రాంభద్రపురం-రాయగడ                              130.40

విజయనగరం-పాలకొండ                                                  72.55

కళింగపట్నం శ్రీకాకుళం-పార్వతీపురం                             113.40

భీమునిపట్నం-నర్సీపట్నం                                              78.10

కాకినాడ-జొన్నాడ                                                                 48.84

కాకినాడ-రాజమండ్రి కెనాల్                                                  65.20

ఏలూరు-మేడిశెట్టివారిపాలెం                                                 70.93

నర్సాపురం-అశ్వారావుపేట                                                  100.55

ఏలూరు-జంగారెడ్డిగూడెం                                                      51.73

గుంటూరు - పర్చూరు                                                              41.44

గుంటూరు-బాపట్ల                                                                  51.24

మంగళగిరి-తెనాలి-నారాకోడూరు                                             40.05

బేస్తవారిపేట-ఒంగోలు                                                              113.25

రాజంపేట-గూడురు                                                                  95.0

ప్యాపిలి-బనగానపల్లి                                                                  54.44

దామాజీపల్లి-తాడిపత్రి                                                                 99.19

జమ్మలమడుగు-కొలిమికుంట్ల                                                          43.0

సోమందేపల్లి-తూముకుంట                                                             35.53

మొత్తం 18 రోడ్లు                                                                              1307

Tags:    

Similar News