నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి
ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కర్నూలు జిల్లాలో నీట మునిగి చనిపోయారు.;
కర్నూలు జిల్లా చిగలి గ్రామంలో బుదవారం విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న కుంట వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకొడదామని ఒకరికి ఒకరు అనుకుని కుంటలోకి దిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. పిల్లలకు లోతు తెలియకపోవడంతో కాళ్లు కిందకు అందక నీటిలో మునిగిపోయారు. కుంటలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల్లో శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ లు ఉన్నారు. తన స్నేహితులు నీటిలో మునిటిపోవడాన్ని చూసిన మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాదం విషయం తెలిపాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో ఈతకు దిగి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోత మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
చిన్నారుల దుర్మరణం అత్యంత బాధాకరం
కర్నూలు జిల్లా చిగలి గ్రామంలో చోటు చేసుకున్న విషాదం తీవ్రంగా కలచి వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆ గ్రామంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్ళి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన అత్యంత బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరుగ్గురు గురు చిన్నారులు మృతి చెందడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసిసారు. వారు కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.