ఎమ్మెల్యే ‘బుడ్డా’ ఏంటీ ఈ అరాచకం?
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులను బంధించి చితక బాధి వదిలేశారు. ఎందుకు ఇలా చేశారు?;
శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం వివాదాలు, దాడులు, ఆరోపణలతో ముడిపడి ఉంది. ఆగస్టు 19, 2025న జరిగిన శ్రీశైలం అటవీ అధికారులపై దాడి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ ఆదేశించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "ఎవరైనా సరే, అటవీ అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు" అంటూ ట్విటర్‌లో స్పందించారు. ఈ సంఘటనలో సీసీటీవీ ఫుటేజీల ఆధారాలుగా ఉన్నాయి.
ఎమ్మెల్యే చుట్టూ వివాదాల సుడులు
బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం వివాదాలతో నిండి ఉంది. 2024 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఆయనపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మైనేత (MyNeta) రికార్డుల ప్రకారం ఆయనపై రెండు కేసుల్లో ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్ - భయపెట్టడం) కింద ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక కేసులో ఐపీసీ సెక్షన్ 326 (ఆయుధాలతో తీవ్ర గాయాలు కలిగించడం) కింద ఛార్జ్‌లు ఉన్నాయి. ఇవి ఆయన రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక గ్రూప్ తగాదాల కారణంగా నమోదైన కేసులు.
జూలై 5, 2025న ఆయన అనుచరులు మాజీ మంత్రి, టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన అనుచరులు నంద్యాల ఎంపీ శబరిని కూడా చుట్టుముట్టి గెరావ్ చేశారు. ఇది పార్టీ అంతర్గత వివాదాల నుంచి పుట్టినదిగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
2024 ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అత్మకూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా కేసుగా పరిగణలోకి తీసుకున్నారు.
జనవరి 2022లో ఆయన కుటుంబానికి చెందిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి (బీజేపీ ఇన్‌ఛార్జ్)తో సంబంధం ఉన్న గ్రూప్ ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. ఇది స్థానిక రాజకీయ శత్రుత్వాల నుంచి వచ్చింది.
గతంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 341 కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇవి 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు రికార్డు అయ్యాయి. అలాగే నంద్యాల ఎంపీని నిలదీయడం, పార్టీ అంతర్గతంగా వివాదాలు సృష్టించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలు ఆయన రాజకీయ స్టైల్‌ను సూచిస్తున్నాయి. పార్టీలోనూ ఆయనపై అసంతృప్తి పెరుగుతోంది.
శ్రీశైలం సంఘటనపై విశ్లేషణ
ఆగస్టు 19 రాత్రి శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ వద్ద జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అటవీ అధికారులు (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి. రామ్ నాయక్, ఇంచార్జి సెక్షన్ ఆఫీసర్ జె. మోహన్ కుమార్, బీట్ ఆఫీసర్ టీకే గురవయ్య, డ్రైవర్ షేక్ కరిముల్లా)ను కిడ్నాప్ చేసి, దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారిని వారి వాహనంలోనే తీసుకెళ్లి సున్నిపెంటలో వీధుల్లో తిప్పి, కొట్టి, మొబైల్ ఫోన్లు, వాకీటాకీలు, నగదు లాక్కున్నారు. బాధితులు శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చట్టపరమైన చర్యలు
అధికారులను బలవంతంగా తీసుకెళ్లడం, గాయ పరచడం, కొట్టడం వంటి సంఘటనలకు సీసీటీవీ ఫుటేజీలు ఆధారాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ సంఘటనపై నమోదైన సెక్షన్ ల ఆధారంగా 10 సంవత్సరాల వరకు నిందితులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మద్యం సేవించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సర్వెంట్‌లపై దాడి (IPC 353) కూడా వర్తిస్తుంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సీఎం ఆదేశాలతో విచారణ వేగవంతమవుతుంది. టీడీపీ నుంచి సస్పెన్షన్ లేదా పార్టీ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని నిరూపిస్తోంది. గత ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే, ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇది పార్టీ ఇమేజ్‌కు పరీక్షే.