పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతున్న 'తిరుపతి బాలోత్సవం'

ఎస్జీఎస్ కాలేజీలో అక్టోబర్ 25న ప్రారంభించే సంబురం పోస్టర్ల ఆవిష్కరణ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-21 03:48 GMT

తిరుపతిలో ప్రతి సంవత్సరం రెండు సార్లు బాలల దినోత్సవం జరుగుతుంది. మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ జయంతి ఒకటి. రెండోది తిరుపతి బాలోత్సవం పేరిట నిర్వహించే పండుగ. తిరుపతిలో నాల్గవ సంవత్సరం బాలల సంబరాలకు కార్యక్రమం ఖరారైంది. పాఠశాలల పిల్లల్లోని ప్రతిభకు పదును పెట్టడానికి ఈ ఏడాది అక్టోబర్ 25, 26వ తేదీల్లో "తిరుపతి బాలోత్సవం" నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున తెలిపారు.

"చిత్రలేఖనం, జానపదం, సాంఘిక నాటకాలు, సంప్రదాయ కళలను మరింత ప్రోత్సాహించే విధంగా బాలోత్సవం నిర్వహిస్తున్నాం" అని మల్లారపు నాగార్జున తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనకు పదును పెట్టాలనే ఆశయంతో మూడేళ్లుగా తిరుపతిలో పిల్లల పండుగ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతి ఎస్‌జీఎస్‌ (శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాల) పిల్లల పండుగ నిర్వహించనున్నట్లు చెప్పారు.

తిరుపతిలో ఈ ఏడాది నాల్గవసారి నిర్వహించే "తిరుపతి బాలోత్సవం" బాలల పండుగ పోస్టర్లను వేమన విజ్ణాన కేంద్రంలో శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. బాలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున, గౌరవాధ్యక్షుడు టెంకాయల దామోదరం, అధ్యక్షులు నడ్డి నారాయణ తదితరులు మాట్లాడారు.

పిల్లలకు ఆటవిడుపు..
పాఠశాల పిల్లలు యాంత్రిక జీవనం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని తిరుపతి బాలోత్సవం నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలకు మానసిక వికాసం అవసరం ఉంది. పాఠశాల విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, చదువు, ర్యాంకులనే పరుగులో అలసి పోతున్నారని తిరుపతి బాలోత్సవం నిర్వాహకులు చెప్పారు. పిల్లలకు ఆటవిడుపు, ఆటపాటలు లేకుండా పోయాయన్నారు. ప్రతిభ ఉన్నా దాన్ని బయటికి తీసే అవకాశం ఉండడం లేదన్నారు. ఈ వాతావరణం నుంచి బయటికి తీసుకుని రావడానికే బాలోత్సవం పేరిట పిల్లల పండుగ నిర్వహిస్తున్నాం అని సంస్థ గౌరవాధ్యక్షుడు టెంకాయల దామోదరం చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలతో పాటు దాతలు సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు.

విభాగాలు ఇవి
తిరుపతి బాలోత్సవంలో భాగంగా అకడమిక్‌, కల్చరల్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయని మల్లారపు నాగార్జున, దామోదరం తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 37 అంశాలు ప్రధానంగా ఉంటాయని వారు తెలిపారు. వీటిని 75 విభాగాలుగా విభజించి ఎనిమిది వేదికలపై సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో చిన్నారులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
అకడమిక్‌ విభాగంలో చిత్రలేఖనం, వక్తృత్వం, బొమ్మకు కథ, పద్యంభావం, స్పెల్‌ బి (ఇంగ్లీషు), పదకేళి, కథ చెబుతా... ఊకొడుతారా, గణితం`తర్కం, లేఖా రచన తదితర అంశాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. సాంస్కృతిక, హస్తకళల విభాగాల్లో ఏకపాత్రాభినయం, జానపద నృత్యం, జానపద గీతాలు, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్‌ డాన్స్‌, ఫ్యాన్సీ డ్రెస్‌, శాస్త్రీయ సంగీతం, కోలాటం, ఇన్‌స్ట్రుమెంట్‌, మట్టితో బొమ్మలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నాల్గవ ఉత్సవాలకు ఏర్పాట్లు
తిరుపతిలో 2022 సంవవ్సరం నుంచి వరుసగా బాలోత్సవం పిల్లల పండుగలు నిర్వహించినట్లు నాగార్జున తెలిపారు.

తిరుపతిలో మొదటిసారి 2022లో నిర్వహించిన బాలోత్సవానికి 3500 మంది విద్యార్థులు హాజరయ్యారని నాగార్జున తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యా సంఖ్య గణనీయంగా పెరగడం మా సంస్థకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. 
2023 సంవత్సరంలో 5700 మంది విద్యార్థులు పాల్గొంటే 2024లో ఆ సంఖ్య ఎనిమిది వేల మందికి పెరిగిందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు కూడా ప్రోత్సాహిస్తున్న కారణంగా విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. ఇతా ప్రతి సంవత్సరం తిరుపతి బాలోత్సవానికి ఆదరణ పెరుగుతోందని   వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం కార్యదర్శి గురునాథం, ముఖేష్, జెవివి రఫీ, రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రశెట్టి,మట్టా పురుషోత్తం రెడ్డి,హేమచంద్ర,హెల్పింగ్ టు ఆదర్శ్ మణికంఠ,వుయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్టు తహసున్నీసా, దివ్యాన్గ్ సేవాట్రస్టు మునిలక్ష్మి,చెస్ బాలాజీ చౌదరి,తైక్వాండో బాలకృష్ణ,ఇంపాక్ట్ శ్రీధర్ విట్టలం, చిత్రకారులు, డాక్టర్ సాగర్ గిన్నె, అర్చన, గాయత్రి పాల్గొన్నారు.
Tags:    

Similar News