తిరుమల:మహిళలకు ఉచిత ప్రయాణం లేదెందుకని?
ప్రభుత్వం స్పష్టత ఇవ్వకున్నా.. రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-11 11:00 GMT
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది. రాష్ట్ర మొత్తం ఈ పథకం అమలు చేసిన తిరుపతి- తిరుమల మార్గంలో అనుమతించడం లేదు.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలన్న, మళ్లీ అక్కడి నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులో వచ్చే మహిళలు టికెట్ కొనాల్సిందే అనే విషయం స్పష్టమైంది.
తిరుమలకు ఉచిత ప్రయాణ పథకం వర్తింప చేయకపోవడం వెనక ఉన్న కారణం ఏంటి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం ప్రస్తావించదగిన విషయం. అయితే దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
"పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా చేయడం ఒకటైతే. రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు 47 లక్షల భారం తప్పుతుంది" అనే భావన ఆర్టీసీ అధికారుల నుంచి వ్యక్తమైంది.
రాష్ట్ర ప్రజారవాణ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు
"తిరుపతి తిరుమల మధ్య తిరిగే సప్తగిరి అల్ట్రా ఎక్స్ప్రెస్ తో పాటు. అంతర్రాష్ట్ర సర్వీసులు, ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదు" అని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర సర్వీసులు, ఏసీ బస్సుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్తింప చేయడం లేదు.
ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించకపోవడం వెనుక కారణం ఏమిటి అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఇదిలా ఉంటే,
రాష్ట్రంలో ప్రజా రవాణా శాఖ మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మేరకు
1. పల్లె వెలుగు బస్ సర్వీసులు
2. అల్ట్రా పల్లె వెలుగు
3. సిటీ ఆర్డినరీ బస్సులు
4. మెట్రో ఎక్స్ప్రెస్
5. ఎక్స్ప్రెస్ బస్సుల్లో.ఉచితంగా ప్రయాణం చేయడానికి వేరుగా 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీని అమలులోకి తెచ్చారు.
ఈ బస్సుల్లో మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తిరుమలకు ఎందుకు ఇవ్వలేదు..
రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలిగింది. తిరుమలకు మాత్రం ఈ పథకం వర్తింప చేయలేదు. తిరుపతి నుంచి తిరుమల మధ్య తిరిగే బస్సుల్లో అల్ట్రా డీలక్స్ సర్వీసులు కూడా ఉన్నాయి. తిరుమల బస్సులు మినహా మిగతా ప్రాంతాల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
50 ఏళ్ల వెనక్కి వెళితే...
ఐదు దశాబ్దాల కిందటి వరకు తిరుపతి తిరుమల మధ్య టిటిడి ఆధ్వర్యంలోని రవాణా శాఖ బస్సులు నడిపేది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం (గతంలో మొదటి సత్రం) నుంచి కొండ బస్సులు తిరుమలకు వెళ్ళేవి.
రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడిన తర్వాత కూడా టీటీడీ నే బస్సులు నడిపింది. అప్పటికి మొదటి ఘాట్ రోడ్డు మాత్రమే ఉండేది.
కాలం గడిచే కొద్దీ చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ప్రజా రవాణా నుంచి టిటిడి తప్పుకుంది. ఆ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించింది. ఈ బస్సుల్లో ప్రయాణించే టిటిడి ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఆర్టీసీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యాత్రికుల సంఖ్య పెరిగింది. వారికి రవాణా ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు కూడా సర్వీసులు గణనీయంగా పెంచారు.
మదనపల్లి, చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు, పొరుగున ఉన్న కడప, నెల్లూరు జిల్లాలోని డిపోలవంచే బస్సులను పక్కన ఉంచితే..
"తిరుపతి తిరుమల మధ్య ప్రస్తుతం 335 బస్సులు నడుపుతున్నాం" అని ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజినల్ మేనేజర్ ఎం .జగదీష్ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
తిరుపతి వన్ డిపో నుంచి 103 బస్సులు
తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి 147
తిరుపతి నగరంలోని మంగళం డిపో నుంచి 90
తిరుమల డిపో నుంచి 93 అల్ట్రా డీలక్స్ సర్వీసులు నడుస్తున్నట్లు రీజనల్ మేనేజర్ జగదీష్ తెలిపారు.
ఒక రోజుకు 1350 ట్రిప్పులు తిరిగే తమ బస్సుల్లో రోజుకు సగటున 77,500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
"ఇందులో తిరుపతి జిల్లా పరిధిలోని పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి డిపోల నుంచి కూడా తిరుమలకు బస్సు సర్వీసులు ఉన్నాయి. వీరి ద్వారా ఒక రోజుకు 47 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది" అని రీజినల్ మేనేజర్ జగదీష్ తెలిపారు.
"ఈ ఏడాది జూన్ నెలలో ఈ యాత్రికుల సంఖ్య
గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు 86, 830 మంది యాత్రికులు ప్రయాణాలు సాగించారని జగదీష్ వివరించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తో పాటు కొన్ని నగరాల నుంచి తిరుపతికి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో యాత్రికులు వస్తూ ఉంటారు. సరాసరి నా రోజుకు 80 వేల నుంచి లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు అనేది ఓ అంచనా. అయితే,
ఏపీలోని మహిళలకు మాత్రమే వర్తించే ఉచిత ప్రయాణం పథకం వల్ల మిగతా ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బందులు పడకూడదనే తిరుపతి, తిరుమల మధ్య మహిళలకు స్త్రీ శక్తి పథకం వర్తింప చేయలేదని తెలుస్తోంది. ఆదాయపరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు సగటున 45 లక్షల రూపాయల భారం తగ్గే పరిస్థితి ఏర్పడింది.
ఏ కారణంతో తిరుమలకు మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని వర్తింప చేయలేదని ప్రభుత్వం వివరిస్తే మినహా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.