పల్లకీ మోతకు అడుగులు నేర్పిన తిరుమల వెంకన్న

అది కొండకిందపల్లె. ఆ తరువాత చందమామలపల్లె. ఇప్పుడు పెరుమాళ్ల (దేవుడి) పల్లె. ఇంతకీ ఈ పల్లె వారే శ్రీవారి పల్లకీ ఎందుకు మోస్తారు.

Update: 2024-10-10 10:50 GMT

ఆదిశేషుడు.. వాసుకి... సూర్యచంద్రులు.. అంజనీపుత్రుడు మోసి తరించారు. అలాంటి దేవగణాలతో పాటు వైకుంఠవాడు... పక్షిరాజు గరుత్ముండు.. గజరాజు తదితర దేవగణాలు తమ భుజకీర్తులపై అలంకార ప్రియుడైన సప్తగిరీశుడిని తరతరాలుగా మోస్తూ తరిస్తున్నారు. ఆ పరంపరలో కొండరెడ్లు (వాహన బేరర్లు), పల్లకి మోయడం తమకు దక్కిన భాగ్యంగా భావిస్తారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లెకు టీటీడీ,, తిరుమలతో విడదీయలేని బంధం. ఆ పల్లెలో పెద్దలు కొందరు, కలత చెందుతున్నారు.


వారి డ్రస్ కోడ్ :  తలకు పసుపు రంగు రుమాలు, భూజాన టర్కీ టవల్, లైట్ కలర్ బ్లూ చొక్కా. అడ్డ పంచె. వాహన సేవలో ఇలా కనిపిస్తారు. గరుడసేవ రోజు వారి వస్త్రధారణలో మార్పు ఉంటుంది. వాహనంపై ఉన్నది రాజులకే రాజు, దేవదేవుడు కావడం వల్ల కుచ్చు టోపీని తలపించే రుమాలు ఉంటుంది. అన్నీ కొత్త వస్త్రాలు ధరిస్తారు. అడుగులు కూడా సంగీతాన్ని తలపించే శబ్దాలతో సాగుతాయి. 

నాడు కొండకిండపల్లె ...


ఆధునిక వసతులు అందుబాటులో రోజుల్లో నుంచి శ్రీవారిమెట్టు నుంచి తిరు మలకు కాలిబాట (ప్రస్తుతం అదే శ్రీవారిమెట్టు) ఉంది. అప్పట్లో కొండకింద ఓ కుగ్రామం ఉండేది. దాని పేరు ప్రజలందరూ కొండకిందపల్లె అని పిలిచేవారు. ఇక్కడి నుంచి తిరుమలలో ఆలయానికి అవసరమైన వస్తుసామగ్రి నెత్తిమోతపై తీసుకుని వెళ్లేవారు. కొందరు డోలీలు మోసేవారు. ఈ గ్రామంలో ఎక్కువమంది తిరుక్షేత్రానికి వెళ్లి అక్కడ చిన్నపనులు చేసి, వాహనం మోసేవారు. అందుకు వారికి మహంతులు అప్పట్లో ఒక గంగాళం శ్రీవారి ప్రసాదం ఇచ్చేవారు. అయినా, వారు స్వామివారి సేవను మాత్రం వదల లేదు. ఒకానొక సందర్భంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. పలువురు మరణించారు. దీంతో కొండకిందపల్లెలో ఖాళీ చేశారు.
ఈ గ్రామానికి చెందిన టీటీడీ రిటైర్డ్ ఏఈఓ పైడిపల్లి శ్రీనివాసులురెడ్డి ఏమంటున్నారంటే..

కొండకిందపల్లె ఖాళీ చేసిన మా గ్రామస్తులు తిరుపతికి సమీపంలో ఇళ్లుకట్టుకుని స్థిరపడ్డారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి పల్లకీ (వాహనం) మోసేవారున్న ఈ ఊరికి చందమామలపల్లె అని పేరు పెట్టారు. "శ్రీవారి పల్లకీమోతలో తరిస్తున్న కొండరెడ్ల భక్తిని చూసి, ఓ అధికారి ఈ గ్రామానికి పెరుమాళ్లపల్లెగా నామకరణం చేశారు" అని శ్రీనివాసులురెడ్డి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధితో అన్నారు. అప్పటి నుంచి ఇది పెరుమాళ్లపల్లెగా మారింది. అనేది ఆయన మాట.

ప్రసాదాలే భుక్తిగా..
తిరుమలలో స్వామివారి వాహనాన్ని మోసే వల్లకీ బోయీలందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో వారిని కొండకిందరెడ్లు అనే వారు. మహంతుల పాలన సాగే రోజుల్లో పల్లకీ బోయీలు రోజూ ఉదయాన్నే నడిని శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమలకు చేరుకునే వారు. అక్కడ ఆలయంలో చిన్న పనులు చేసే వారు. గోశాలలోని ఏనుగులు, పశువుల కోసం గడ్డికోసి మేత వేసే పనులు చేసే వారు తరువాత స్వామి వారి వాహనాన్ని మోసేవారు. సాయంత్రం కాగానే అర్చకస్వా ములు గంగాళంతో అన్నప్రసాదాలు ఇస్తే, వారు కొంత తిని, కొంత ఇంటికి తీసుకుని వచ్చి కుటుంబసభ్యులకు ఇచ్చేవారు. ఇది మినహా వారికి జీతభత్యాలు ఉండేవి కాదు. కేవలం స్వామి. వారి సేవే పరమావధిగా వారి జీవనం సాగింది.
శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించగానే భక్తులు తన్మయత్వంతో పులకిస్తారు. కోరికలు తీర్చే కొండంత దేవుడి సన్నిధికి చేరుకున్నందుకు ఉప్పొంగిపోతారు. తమ జన్మ ధన్యమైందని తలుస్తారు. సాక్షాత్తు వైకుంఠంలోనే ఉన్నట్లు తలపోసుకుంటారు. అలాంటిది వంద ఏళ్ల వంశపారంపర్యంగా దేవదేవుని సేవలో తరిస్తున్నారు. కొండరెడ్లు, స్వామివారిని మోయడం తమకు మాత్రమే దక్కిన భాగ్యం గా భావిస్తున్నారు.
డిగ్రీలు చదివినా..
మిరాశీ వ్యవస్థ సాగే సమయంలో కూడా కొండకిందపల్లె, పెరుమాళ్లపలైతోపాటు చుట్టుపక్కల ఐదు నుంచి ఏడు గ్రామాలవారు వాహనాలు మోయడం, సేవలు అందించడం తను హక్కుగా సాగేది. ప్రస్తుతం పెరుమాళ్లపల్లెలోనే సుమారు 18 మంది వల్లకీ మోసేవారు ఉన్నారు. వారి పిల్లలు కూడా లాపేక్ష లేకుండా సేవకు తరలుతున్నారు. ఉన్నత చదువులు చదువు కున్నవారు సైతం కార్పరేట్ ఉద్యోగాలు వదలి కోనేటిరాయుడి కొలువులో వాహనాలు మోయడానికి ఉవ్విళూరుతున్నారు. ఆ కోవలో  M.
com 
చదివిన మునిరెడ్డి, ఎంబీఏ పూర్తి చేసిన చెంచురెడ్డి, డిగ్రీలు పూర్తి చేసిన మాయివేలు, హరి కూడా శ్రీనివాసమంగాపురంలో వాహన బేరర్లుగా ఉన్నారు. వారి తండ్రి, తాతలు కూడా పల్లకీ మోసి తరించిన వారే.
గోవిందా... అంటే భారం అనిపించదు

వేదపండితులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి పల్లకీపై ఆశీనులను చేస్తారు. "గోవిందా అని నోరార పిలిచి, తుండు భుజానికి ఎత్తి, నాలుగు అడుగులు వేశాక భారం కూడా తెలియదు" అని వాహన బేరర్ డీ. మునికృష్ణారెడ్డి అంటున్నారు. శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, కపిలతీర్థం, తిరుమలతో పాటు మిగతా అనుబంధ ఆలయాల్లో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. పల్లకీ సేవ జరుగుతుంటుంది. "మాడవీధుల్లో కనీసం అంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు టన్ను బరువు ఉన్న వాహనం మోయడం" మాకు లభించిన పూర్వజన్మ సుకృతం అనేది మునికృష్ణారెడ్డి చెబుతున్న మాట.
మాకు దక్కిన భాగ్యం

"పల్లకీ మోయడం అనేది మా నాన్న, తాతకు దక్కిన భాగ్యం" అని మునికృష్ణారెడ్డి కూతురు మునీశ్వరి, ఇంటర్ చదువుతున్న జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. "నేను కూడా వాహనసేవకు వెళతా. అందులో ఆనందం ఉంది" అని జగదీశ్వరరెడ్డి చెబుతున్నారు.
మునీశ్వరి ఇంకో మాట అన్నారు..
"పల్లకిసేవ జరిగేటప్పుడు మా నాన్న భుజంపై వాహనం తుండు ఉంటుంది. ఆ సమయంలో దర్శనానికి వెళ్లినప్పుడు నా స్నేహితులకు కూడా మా నాన్న చేసే సేవ చూపించి, వివరించడం గర్వంగా ఉంటుంది" అని మునీశ్వరి వ్యాఖ్యానించారు. ఎందుకు అంటే ఈ భాగ్యం అందరికీ దక్కదు అనేది ఆమె అంటున్న మాట.

ఈ పల్లె ప్రజలతో మాట్లాడినప్పుడు కొంత వేదన కూడా కనిపించింది. తిరుమల, అనుబంధ తొమ్మిది ఆలయాల్లో వాహనబేరర్లు పెరుమాళ్లపల్లె వారే ఉండేవారు. అందులో తిరుమలలో ఆరుగురు ఉన్నారు. గతంలో 22 మంది ఉండేవారు. మొత్తం రెండు బ్యాచులుగా ప్రస్తుతం 30 ప్లస్ 30 సేవలు అందిస్తున్నారు. మొత్తానికి కొండపై 60 నుంచి 80 మంది సేవలో ఉన్నారు. గతంలో పెరుమాళ్లపల్లె వారినే వాహనబేరర్లుగా తీసుకునే వారు. ఎందుకో.. గత దశాబ్ద కాలంగా మార్పు వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. పొరుగు ప్రాంతాల వారిని కూడా వాహనసేవకు టైం స్కేల్, డైలీవేజస్ కింద తీసుకుంటున్నారు. దీనిపై పెరుమాళ్లపల్లె వాసి..
వారసత్వం ఉండాల్సిందే...

రిటైర్డ్ ఎస్ఐ గురుమూర్తిరెడ్డి ఏమంటున్నారంటే... "తరతరాలుగా శ్రీవారి వాహనాన్ని మోస్తున్న కొండరెడ్ల కుటుంబీకులకే అవకాశం కల్పించాలి. వారసత్వాన్ని కొనిసాగించాలి" అని గురుమూర్తిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువులు చదివిన మా పెరుమాళ్లపల్లె యువకులు స్వామివారి వాహన సేవకే ప్రాధాన్యత ఇస్తారు. యువకులను ప్రోత్సహించాలి. మా ఊర్లో తిరుమల తరహాలోనే స్వామివారికి తుండ్లతో పల్లకీ తయారు చేసి, సేవ నిర్వ హించే వాళ్లం. ఎందుకంటే అ పద్దతి పాటించడం మా ఊరికి దక్కిన వరం. ఇటీవల వల్లె విస్తరించడం, కరెంటు వైర్లు అడ్డుగా మారడంతో ఇబ్బందిగా మారి, ట్రాక్టర్ వినియోగిస్తున్నాం. పొరుగు ప్రాంతాల వారికి ఇవ్వడం అంటే శ్రీవారికి మా ఊరిని దూరం చేయడంగానే భావించాల్సి ఉంటుంది. కానీ, మా ఊరోళ్ల తనువంటే స్వామివారి చుట్టే ఉంటుందనే విషయం గమనించాలి" అని గురుమూర్తిరెడ్డి వేదనతో అన్నారు.
ఇంకొందరికీ దక్కిన భాగ్యం

పెరుమాళ్లపల్లెలో కొండరెడ్లకే పరిమితమైన వాహన సేవ మిగతా వారికీ దక్కింది. ఆ కోవలో గ్రామానికి చెందిన బాలమునిగౌడ్ పల్లకీసేవలో ఉన్నారు. మా మామ సుబ్బారాయుడు రిటైర్డ్ అయ్యారు. ఆయ అన్న కొడుకు ప్రసాద్ బాబు కూడా ఇదే సేవలో ఉన్నారు. మా తరంలో మాకు దక్కిన భాగ్యం ఇది. ఇలాంటి సేవ చేయడం అంటే, మా తల్లదండ్రులు చేసుకున్న పుణ్యం" అని బాలమునిగౌడ్ వ్యాఖ్యానించారు.
అడుగే ముఖ్యం
"పల్లకిని మోసే వయయంలో తండ్లు పట్టుకుని అడుగులు వేయడం ముఖ్యమైన ఘట్టం" అని మునికృష్ణారెడ్డి, గురుమూర్తిరెడ్డి, మురళీ మనోహరరెడ్డి (సెక్యూరిటీ గార్డు) అంటారు. అది వాస్తవం కూడా. పల్లకీ మోసే సమయంలో ఎక్కడా ఈ తరహా అడుగుల రిథం కనిపించదు.
పల్లకీ మోసే ముందు ఉన్న వ్యక్తి.. పాదాల మధ్య వెనుక ఉన్న మనిషి అడుగు ఉంటుంది. అదే క్రమంలో చివరి వరకు పాదాలు లయబద్ధంగా సాగుతాయి. తిరుమలకు వచ్చినప్పుడు, లేదా వీడియోల్లో గమనిస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అడుగులో తేడా రాకూడాదు. దీనికి శిక్షణ కూడా ఉంది.
"నేను ఏడాది పాటు శిక్షణ తీసుకున్నా" అని డీ. మునికృష్ణారెడ్డి చెబుతున్నారు. "తుండు ఎత్తుకున్నాక, నా వెనుక నిలబడే మనిషి, ముందుకు కదలమని మోకాలి పిక్కకింద గుద్దుతారు. అంటే నానే ముందుకు అడుగు వేయాలని అర్థం" అని మునికృష్ణారెడ్డి వివరించారు.
ఉదా: గరుడవాహన సేవ అయితే.. తుండ్లు, పల్లకీతో పాటు గరుడవాహనంపై శ్రీవారి ఉత్సవమూర్తి ఉంటుంది. ఇద్దరు పండితులు కూర్చుంటే మరో ఇద్దరు విగ్రహాన్ని పట్టుకుని నిలబడి ఉంటారు. ఉత్సవా మూర్తి పక్కన మరో ఇద్దరు గొడుగులు పట్టుకుని నిలుస్తారు. ఇంకో అర్చకుడు స్వామివారికి వింజామర వీస్తూ కనిపిస్తారు. దీంతో ఈ గురుడవాహన సేవ బరువు దాదాపు 1.5 టన్నులు ఉంటుంది.
మిగతా వాహనాలు కూడా టన్నుకు తక్కువ ఉండవు. ఇంత బరువు ఉన్న వాహనాన్ని ఒక్కొక్క వైపు సమానమైన ఎత్తు ఉన్నవారు 11 ప్లస్ 11 మంది. కుడివైపు కూడా అంతే సంఖ్యలో ఉంటారు. పల్లకీని మోసే సమయంలో ఎడమ భుజంపై తండు ఉన్నవారు కుడివైపునకు, కుడి భుజంపై తండు ఉన్న వారు ఎడమ వైపునకు ఏటవాలుగా నిలదొక్కు కుంటూ అడుగులు వేయాలని వారు చెబుతున్నారు. వల్ల కిని మోసే వారికి ఇది నేర్చుకోవడం ముఖ్యం. అని వల్లకీమోసే వారు చెబుతున్నారు.
అర్హత : శరీరదారుఢ్యమే..
టీటీడీలో శ్రీవారు, లేదా అనుబంధ ఆలయాల్లో పల్లకీమోతకు అర్హతలు కూడా ఉన్నాయి. ఈ సేవకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అప్పట్లో తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం నుంచి ఉగ్రాణం వరకు వంద కిలోల చక్కెర బస్తా మోయాలి. అది కూడా సెకండ్లు, నిమిషాల వ్యవధిలో మాత్రమే. అందులో సత్తా చాటిన వారికి పల్లకీ మోసే అవకాశం కన్పించేవారు.
ప్రస్తుతం : మారిన పరిస్థితుల్లో టీటీడీ ఉన్నతాధికారులు రాజకీయాలు నడుపుతూ తమ వంశంపారంపర్య మిరాశీని వద్దు చేసి, వివిధ ప్రాంతాల వారికి స్వామిసేవకు వినియోగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గిడ్డంగి వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
"ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి" అని రిటైర్డ్ ఎస్ఐ గురుమూర్తి రెడ్డి కోరుతున్నారు. గతంలో మాదిరే వాహనబేరర్లుగా పెరుమాళ్లపల్లె వాసులకే పరిమితం చేయడం ద్వారా, వంశంపారంపర్య హక్కును పునరుద్ధరించాలని కోరుతున్నారు. తద్వారా తిరుమల శ్రీవారి సేవలో మా పల్లెను మమేకం చేయాలని గురుమూర్తిరెడ్డి కోరారు.
Tags:    

Similar News