శ్రీవారి ఆలయంలో వెలిగిన కార్తీకదీపం..

తుపాను ముసురులోనూ ప్రకాశించిన కార్తీకపౌర్ణమి.

Update: 2025-12-04 15:47 GMT
శ్రీవారి ఆలయంలో వెలిగిన కార్తీకదీపాలు

సాలకట్ల కార్తీక దీపోత్సవంతో తిరుమల శ్రీవారి ఆలయం గురువారం రాత్రి దేదీప్యమానంగా మారింది. శ్రీవారి సన్నిధితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణ‌మినాడు దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తిరుమలలో శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహించారు.


తిరుమల పెదజీయర్ స్వామి, టీటీడీ, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు, వేదపండితులు అధికారులు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కొత్తగా తయారు చేసిన కుండ ప్రమిదగా మార్చడం ద్వారా అందులో నెయ్యి పోసి, చేతితో తయారు చేసిన దూది ఒత్తులు వేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీయోగనరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు.

బలిపీఠం వద్ద..

శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి మహద్వారం దాటగానే ధ్వజస్తంభానికి సమీపంలోని బలిపీఠంపై ప్రమిదను పోలిన కుండను ఆలయ అర్చకుడు ఉంచారు. అందులో నెయ్యి పోసి, దూదితో చేసిన ఒత్తిని వేయడం ద్వారా వెలగించారు. ఆ తరువాత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కార్తీక దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీకమాసంలో అది కూడా కృతిగా తిథిలో కార్తీకపౌర్ణమి విశిష్ట క్రతువును ప్రారంభించారు.

ఆలయంలో ప్రదక్షిణ

శ్రీవారి ఆలయంలో మొదట కార్తీకదీపాలు వెలిగించారు. ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఆనందనిలయం కింది భాగంగలోని శ్రీవెంకటేశ్వరస్వామివారి సన్నిధి అంటే ఆలయ ప్రాకారంలో విమాన ప్రదక్షిణం చేశారు. ఆ తరువాత ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. దీంతో కార్తీకపౌర్ణమి వేళ కార్తీకదీపోత్సవం ఘనంగా నిర్వహించారు..
దేదీప్యమానంగా...

శ్రీవారి ఆలయం, పరిసరాలు రోజు సాయంత్రం కాగానే విద్యుత్ వెలుగుల్లో జిగేలు మంటు ఉంటుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ సన్నిధి, ధ్వజస్తంభం సమీప ప్రదేశాల తోపాటు ప్రధాన ప్రదేశాలన్నీ కార్తీకదీపం కాంతుల్లో మరింత వెలుగులు విరజిమ్ముతూ, ఆధ్యాత్మిక పరిమణాలు వెదజల్లాయి.
ప్రదక్షిణ తరువాత..

ఆనందనిలయం నుంచి ప్రదక్షిణ పూర్తయిన తరువాత సంపంగి ప్రాకరంలోని ఆలయాల్లో కూడా కార్తీకదీపాలు వెలిగాయి. గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేశారు.
కార్తీకదీపాలు వెలుగులో శ్రీవారి ఆలయ సన్నిధి మరింత ఆకర్షణీయంగా మారింది. కార్తీక పౌర్ణమినాడు గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే, కార్తీకదీపోత్సవం కావడం వల్ల ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి వారి గరుడవాహన సేవను రద్దు చేశారు. సహస్రదీపాలంకణ సేవ కూడా టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి, జానకిదేవి, జీ.భానుప్రకాష్ రెడ్డి, నరేష్, అదనపు సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Tags:    

Similar News