ఏడుకొండవాడికి 32 అడుగుల స్వర్ణరథం. ఓకే రోజు మూడు సేవల వెనుక కథ..

సాయంత్రం 4కు నిర్వహించే స్వర్ణరథం ప్రత్యేక ఏమిటంటే..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-29 10:03 GMT
తిరుమలలో స్వర్ణరథంపై మలయప్ప ఊరేగింపు (ఫైల్

తిరుమలలో మలయప్ప స్వామివారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు (సోమవారం) స్వర్ణరథంపై ఊరేగనున్నారు. ఈ స్వర్ణరథం తయారీకి వాడిన బంగారు వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ రోజు సాయంత్రం ఆ వాహనసేవ చూసే ముందు ఆ వివరాలు ఏమిటనేది పరిశీలిద్దాం.

తిరుమలో శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడు వాహనాలపై వేర్వేరు సమయాల్లో మలయప్ప స్వామి వారు వివరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ వాహనసేవల నిర్వహణలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజు ఉదయం, రాత్రి వాహనం సేవలు నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమల శ్రీవారి క్షేత్రంలో మలయప్ప స్వామి వారు సోమవారం ఉదయం శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో హనుమంతవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. గ్యాలరీలోని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

వాహనసేవ ముందు దేశంలోని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వివరణ కళారూపాలతో సేవ చేశారు. ఆ రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు.

సాయంత్రం బంగారు రథంపై
తిరుమల శ్రీవారు అలంకార భూషితుడు. కడా ప్రియుడు కూడా. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథం పై అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ బంగారు రథానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
తిరుమలలో స్వర్ణ రథం పై మలయప్ప స్వామి విహరించే సందర్భాలు కొన్ని ఉన్నాయి. శ్రీవారీ కళ్యాణోత్సవం, ఒకరోజు బ్రహ్మెత్సవంగా పరిగణించే రథసప్తమి రోజు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో భాగంగా ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి యాత్రికులు అత్యంత అద్భుత అవకాశం గా భావిస్తారు. తిరుమలలో సుమారు రెండు గంటల పాటు ఈ స్వర్ణ రథోత్సవం కనువిందుగా సాగడానికి టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
స్వర్ణ రథం ప్రత్యేకతలు
తిరుమల శ్రీవారికి స్వర్ణ రథానికి ప్రత్యేకతలు ఉన్నాయి. తిరుమల శ్రీవారికి మొదట చెక్కతో తయారుచేసిన రథం మాత్రమే ఉండేది. వెండితాపడం చేసిన రథాన్ని కొన్నేళ్లపాటు వినియోగించారు. తుప్పు పట్టడం, ఇతర సమస్యల వల్ల ఇబ్బందికరంగా ఉందని యాత్రికులు చెప్పడంతో టీటీడీ అధికారులు స్పందించారు.

వెండిరథం స్థానంలో స్వర్ణరథాన్ని తయారు చేయాలని సంకల్పించిన టీటీడీ అధికారులు ఆ పనులు 2019లో తమిళనాడులోని హస్తకళల అభివృద్ధి సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. తిరుమలలోనే ప్రత్యేక గదితో పాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాట్లు చేశారు. దీంతో రంగంలోకి దిగిన 18 మంది స్వర్ణకారులు రథం నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రీవారి వాహనమైన గరుత్మంతుడు భుజాలపై మోస్తున్నట్లు రథాన్ని సంసిద్ధం చేశారు. 2013 నాటికి ఆ పనులు పూర్తి చేయడం ద్వారా సిద్ధం చేశారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ ట్రయల్ రన్ నిర్మించడం ద్వారా మలయప్పస్వామివారి సేవకు రథం సిద్ధం చేశారు. మ్యూజియం ప్రాంతం నుంచి తీసుకుని వచ్చిన ఆ రథాన్ని ప్రస్తుతం ఆలయం ఎదురుగా ఉన్న వాహనమండపం సమీపంలో భద్రత మధ్య ఉంచుతారు. ఏడాదికి మూడుసార్లు మాత్రమే ఆ స్వర్థరథం మాడవీధుల్లోకి తీసుకుని వస్తున్నారు.
74 కిలోల బంగారుతో..
తిరుమల శ్రీవారి బంగారు రథాన్ని 28 టన్నుల బరువుతో కూడిన 32 అడుగుల ఎత్తులో తయారు చేశారు. ఈ రథం తయారీకి 74 కిలోల మేలిమి బంగారాన్ని వాడారు. 2900 కిలోల బరువు ఉన్న రాగి రేకులను అమర్చిన తర్వాత 9 లేయర్లతో బంగారు పూత వేశారు. అప్పట్లోనే ఈ బంగారు వినియోగించుకోవడానికి 74 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం.
అప్పటి తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఏమి చెప్పారంటే..
"32 అడుగుల ఎత్తు ఉన్న ఇలాంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా ఉండదనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం 28 వేల కిలోల బరువు గల ఈ స్వర్ణరథం తయారీకి 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 వేల కిలోల దారుచెక్క, ఇనుము వినియోగించాం. 18 ఇంచుల గేజ్‌ రాగిని, 9 లేయర్లలో బంగారు పూత పూయించాం" అని శ్రీనివాసరాజు వెల్లడించారు. దీని విలువ రూ.24.34 కోట్లు ఉంటుందని అప్పట్లో ఆయన వెల్లడించారు.
రాత్రి వాహనం..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప ( Tirumala Malayappa ) స్వామివారి మూడో వాహనసేవ రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి తిరుమల మాడవీధుల్లో విహరించనున్నారు. ఈ వాహనసేవ వెనుక ఉన్న ఆంతర్యంపై పురాణకథ ఏమిచెబుతోందంటే..
"నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది" అని పండితులు వివరించారు.
Tags:    

Similar News