తిరుమల: శ్రీవారికీ ఓ కాన్వాయ్ ఉంది..
రాజకీయ నేతలకు కాన్వాయ్ ఉంటుంది. దేవాదిదేవతలకు తిరుమలేశుడు టాప్ వీవీఐపీ. భక్తకోటికి కలియుగ వైకుంఠం. ఇక్కడ కూడా శ్రీవారికీ కాన్వాయ్ ఉందండోయ్..
By : SSV Bhaskar Rao
Update: 2024-10-07 14:09 GMT
Heading
Content Area
రాజధాని, జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని, సీఎం, మంత్రుల వాహనానికి ముందు వెనక ఎస్కార్ట్ ఉంటుంది. సీఎం అయితే రోడ్ ఓపెనింగ్, అడ్వాన్స్ పైలట్, సెక్యూరిటీ, వీఐపీ వాహనం దీనికి సమాంతరంగా పక్కపక్కనే వాహనాలు ఉంటాయి. వెనక జామర్ వాహనం. సెక్యూరిటీ, ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఇలా అనేక వాహనాలు అరకిలోమీటర్ పొడవున ఉంటాయి.
ముక్కోటి దేవతలకు టాప్ వీవీఐపీ శ్రీవేంకటేశ్వర స్వామి. అశేష భక్తులకు ఆయన ఇష్ట దైవం. ఏడాదిలో 365 రోజులు ఆయన తిరుమల మాడవీధుల్లో విహరిస్తూనే ఉంటారు. భక్తులను కటాక్షిస్తూనే ఉంటారు.
"రాజు వెడలే రవి తేజములదరగ" అన్నట్లు శ్రీవేంకటేశ్వర స్వామి ఉభయ దేవరులతో ఠీవీగా పల్లకీపై ఆసీనులవుతారు. మాడవీధుల్లో ఆయన పల్లకిసేవ జరిగేటప్పుడు పక్కనే గ్యాలరీలో భక్తజనం నీరాజనాలు అందిస్తుంటారు. స్వామివారి వాహనానికి ముందు అనేక వాహనాలు ముందుకు సాగుతూ ఉంటాయి.
కాన్వాయ్ ఇలా..
అందులో స్వామివారి పల్లకీసేవకు అడ్వాన్స్ పైలట్ లా బ్రహ్మరథం ఉంటుంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు ఉండవు బ్రహ్మసర్వాంతర్యామి. అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ఖాళీ రథాన్ని భక్తులు ముందుకు లాక్కుంటూ వెళుతుంటారు.
ఈ వాహన సేవకు వెనుక
సర్వాంగ సుందరంగా అలంకరించిన ఏనుగులు అనుసరిస్తూ ఉంటాయి. మావటీలు ఆ ఏనుగులను మాడవీధుల్లో కుడి ఎడమ పక్కన క్రమ పద్ధతిలో నడిపించుకుంటూ వెళుతుంటారు. గ్యాలరీల్లోని భక్తులే కాదు. మాడవీధుల్లో తిరిగే భక్తులకు తొండంతో ఆశీర్వాదం అందిస్తుంటాయి.
వాహన మండపం నుంచి దేవేరులతో మలయప్పస్వామి ఆశీనులైన పల్లకీ శ్రీవారి ఆలయం సమీపం, గొల్లమండపం వద్దకు రాగానే క్రమపద్ధతిలో ఏనుగులు బారులుదీరి ఉంటాయి. స్వామి వారు సమీపంలోకి రాగానే ప్రొటోకాల్ పాటిస్తూ తొండంపైకి లేపి, ముందు కాళ్లు రెండు మడత వేసి, వెనుక కాళ్లపై నిలబడటాయి. స్వామివారికి నమస్కారం చేస్తూ, చేసే ఘీంకారం కళ్లారా చూడాల్సిందే. అది మాటలకు అందని దృశ్యకావ్యమే..
బలిష్టమైన వృషభ రాజులను కూడా పట్టు వస్త్రాలతో మేనుపై అలంకరిస్తారు. చూడముచ్చటగా ఉండే ఆ వృషభాలను నడిపిస్తారు. వీటిని సుక్షితులైన మావటీలు వెంటనడుస్తూ, క్రమపద్ధతిలో తీసుకుని వెళుతూ ఉంటారు.
మేలుజాతి అశ్వాలు కనువిందు చేస్తుంటాయి. వాటిని కూడా రంగురంగుల దుస్తులతో అలంకరించి నడిపిస్తూ ఉంటారు. వాటి వెనక సుక్షితుల మాటలు ఆలకిస్తున్నట్లే క్రమశిక్షణతో సాగుతాయి.
కళా నీరాజనం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలతో స్వామివారిని మెప్పించే విధంగా ప్రదర్శనలు ఇస్తారు. తిరుమల శ్రీవారిని అనేక రూపాలుగా కొలుస్తారు.
ఉత్తరాది భక్తులు బాలాజీగా ఆరాధిస్తే, తమిళ, కన్నడ ప్రాంత భక్తులు తిరుమలై అంటూ కీర్తిస్తారు. ఈ కళాకారులందరూ తమ ప్రాంత కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, మహదానందంగా స్వామివారిని కీర్తించడానికి ఒకరికి ఒకరు తీసిపోని విధంగా కళారూపాలతో భక్తజన కోటిని మరింతగా ఆలరిస్తారు.
నే పలికెద నాదం..
"కట్టెదురా నిలిచే కాణచైన కొండ.. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే" అని కీర్తిస్తూ నాదస్వరం తో స్వామివారిని కీర్తిస్తారు. అడుగడుగునా ఏడుకొండలవాడి వైభవాన్ని చాటుతూ, ఆనంద డోలికల్లో సరిగమల సంగీతంతో అమ్మ యత్వం చెందుతారు.
జీయర్ స్వాముల వేదగోష్ఠి
శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత కీలకమైన వ్యవస్థ జీయంగార్లదే. నాదస్వరం సంగీత ఝరి మధ్య.. పెద్ద జీయర్, చినజీయర్ స్వాముల ఆధ్వర్యంలో వేదగోష్టి స్వామి వారిని మైమరిపిస్తుంది. ఈ గోస్టి చెవులకు సోకుతుంటే భక్తులు కూడా పరమానందంగా గోవింద నామస్మరణతో పులకిస్తారు.
భక్తకోటి కీర్తిస్తుండగా.. పల్లకీలో ఠీవీగా..
ఈ కళలు, కళారూపాలు, మంది మార్బలం ముందు సాగుతుంటే, వేదగోస్టిని ఆస్వాదిస్తూ పల్లకీపై ఠీవిగా ఈ ఉభయదేవేర్లతో ఆశీనులైన మలయప్పస్వామి భక్తులను కటాక్షిస్తూ తిరుమల ఆలయ మాడవీధుల్లో చిద్విలాసంగా ఊరేగుతూ ఉంటారు. సర్వాలంకార భూషితుడైన శ్రీవారి ఉత్సవ మూర్తులను చూడగానే గ్యాలరీలో కూర్చున్న అశేష భక్తజనం తన్మయత్వంతో గోవిందా... గోవిందా.. అని స్మరిస్తూ, తమను తాము మరిచిపోయి మరో లోకంలో విహరిస్తున్నట్లు అనుభూతికి లోనవుతారు.
తడవకుండా..
స్వామివారి పల్లకి సేవను అనుసరిస్తూ భారీ ఘటాటోపాన్ని బోయీలు మోసుకుని వస్తూ ఉంటారు. వాహన మండపం నుంచి ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి వారు భక్తులను కటాక్షిస్తూ విహరిస్తారు. ఆ సమయంలో ప్రకృతి వైపరీత్యం ఏదైనా ఏర్పడితే వర్షంకురిసినా, లేదా బలమైన గాలులు వీచినా స్వామి వారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఘటాటోపం (భారీ గొడుగు) భుజాలపైన మోసుకుంటూ ఆశ్ఛాదనగా నిలుపుతారు.
గంటలపాటు సాగే... ఉత్సవం
భక్తులను కటాక్షించడానికి ఉభయదేవేరులతో కలిసి వాహన పడినపంలో ఉత్సవ విగ్రహాలను అలంకరిస్తారు. ఈ పల్లకీపై దేవతామూర్తులతోపాటు అర్చక స్వాములు కూడా ఆసీనులవుతారు. మరో ఇద్దరు పరిచారికలు రెండు గొడుగులు పట్టుకొని స్వామివార్ల విగ్రహాలకు అటు ఇటు నిలబడతారు. దాదాపు టన్నుకు పైగానే బరువున్న ఈ వాహనాన్ని అలుపు, సొలుపు లేకుండా వాహన బేరర్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ముగియడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఏ మాత్రం అలుపు లేకుండా ఉత్సవ మూర్తుల విగ్రహాలను కొలువు తీర్చిన పల్లకి సేవతో పాటు, దీని వెనక ఘటాటోపాన్ని బోయీలు అవిశ్రాంతంగా మోసుకుంటూనే వస్తారు.
ఈ తరహాలో స్వామివారు భక్తులను కటాక్షించడానికి ఈ విధమైనా కాన్వాయ్ తో ఆయన బయలుదేరుతారు. బ్రహ్మోత్సవాల వేళ ఉదయం, రాత్రి జరిగే వాహన సేవలు చూడడానికి భక్తజనం గంటల తరబడి గ్యాలరీలో నిరీక్షిస్తారంటే, ఈ ఉత్సవం ఎంతటి కనువిందుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా తిరుమలేశుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు తపిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలవేళ వాహనసేవలో పాల్గొనాలని, స్వామి వారిని చూడాలని కూడా తలుస్తారు. ఈ రెండు మహదవకాశాలకు ఇదే సందర్భం.