చనిపోయిందా..చంపేశారా

మృతురాలు సాతుపాటి జ్యోతికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.

Update: 2025-11-08 09:11 GMT

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. కాలిన గాయాలతో రక్తమోడుతూ ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయికుమార్ భార్య సాతుపాటి జ్యోతి (20)గా గుర్తించారు. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీవ్రమయ్యాయని సమాచారం. జ్యోతి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. భర్త సాయికుమార్‌పై అనుమానం ఉన్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ వివాదాలు ఇంత దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. 

Tags:    

Similar News