TIRUMALA | మద్యం మత్తులో స్పెషల్ పోలీసుల వీరంగం

వారిలో ఇద్దరిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పారిపోయారు. వారిని విధుల నుంచి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ సస్పెండ్ చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-23 17:11 GMT

శ్రీవారి క్షేత్రంలో ముగ్గురు ఏపీఎస్పీ (APSP ) బెటాలియన్ పోలీసులు గాడి తప్పారు. మధ్య మత్తులో వీరంగం సృష్టించారు. వారు ప్రయాణించిన పోలీస్ వాహనాన్ని ప్రమాదానికి గురి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో ఒకరు ముస్లిం. మద్యం మత్తులో పోలీసు వాహనంలోనే తిరుమలకు వెళ్లిన ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు హంగామా సృష్టించారు. వాహనాన్ని కూడా ప్రమాదానికి గురి చేసిన సంఘటన శుక్రవారం జరిగింది.

తిరుమలలో జరిగిన ఈ సంఘటనపై కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ సీరియస్ గా స్పందించారు. ముగ్గురు బెటాలియన్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ ఉల్లంఘనపై సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ముగ్గురు వీరే..
1)హెడ్ కానిస్టేబుల్ 1003 కె. ఓంకార్ నాయక్
2)కానిస్టేబుల్ 1028 బి. రాజశేఖర్
3) కానిస్టేబుల్ 1354 ఎస్. కె సిరాజుద్దీన్
వారిని సక్రమంగా విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ, ఇంచార్జ్ ఆఫీసర్కు మోమో జారీ చేస్తున్నట్లు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ తెలిపారు.
టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఈ సంఘటనపై ఘాటుగా స్పందించారు.
"టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలతో తిరుమల అపవిత్రం అవుతోంది" అని విడుదల చేసిన ఓ వీడియోలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాది వైసీపీ పై ఏడవడం మినహా, మరో పని చేయలేదు అని అధికార టిడిపి నాయకులను ఆయన తూర్పారబట్టారు.
మద్యం మత్తు.. పోలీసు వాహనం
తిరుమలలో ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. తిరుమల క్షేత్రం, భద్రత కోసం వివిధ కీలక ప్రదేశాల్లో వారినీ విధుల్లోకి తీసుకున్నారు.
పోలీస్ వాహనంలో బయలుదేరిన ముగ్గురు కానిస్టేబుళ్లు మధ్యమత్తులో తిరుమల కు చేరుకున్నట్లు చెబుతున్నారు. కొండపై కూడా ఇష్టానుసారంగా పోలీసు వాహనాన్ని నడిపి, భయాందోళనకు గురిచేసినట్లు తెలిసింది.. మద్యం మధ్యలోనే వాహన నడుపుతున్న ఓ కానిస్టేబుల్ తిరుమల బాలాజీ నగర్ సమీపంలోని వార్డు సచివాలయం గోడకు ఢీ కొట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసు వాహనం టైర్ కూడా పంచర్ అయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే తిరుమల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగానే పసిగట్టిన ఓ కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారీ అయినట్లు తెలిసింది. మరో ఇద్దరిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం 300 పాయింట్లు
మద్యం మత్తులో పోలీసు వాహనంలో వచ్చిన ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులను. మద్యం ఎంత తాగారు అనేది టెస్ట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పరికరం ఉదగానే 300 పాయింట్లు చూపించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.
బాధ్యతా రాహిత్యం
తిరుమల కొండపై చోటు చేసుకుంటున్న పరిణామాలు టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యుల బాధ్యత రాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయని వైసిపి అధికార ప్రతినిధి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన వీడియోలు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది పూర్తిగా మాపై విమర్శలు, ఆరోపణలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కాలం మొత్తం గడిచిపోయింది అని అన్నారు.
"టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అపచారాలు, ఘోరాలు జరిగాయి? అనే విషయాల్లో సమీక్ష, సరిదిద్దుకునే ప్రయత్నాలు లేవు" అని భూమన విమర్శించారు.
అందువల్లే ముగ్గురు పోలీసులు.. పోలీసు వాహనంలోనే తప్ప తాగి తిరుమలకు వెళ్లగలిగే సాహసం చేశారని ఆయన అన్నారు.

Similar News