తిరుమల : సుగంధాలు, పరిమళ జలాలతో శ్రీవారి ఆలయం శుద్ధి

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ క్రతువు ఎందుకు నిర్వహిస్తారంటే..

Update: 2024-10-01 05:43 GMT

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల నాల్గవ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీతో ముగుస్తాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి, ఆలయం లోపల ఉన్న ఉపదేవాలయాలు, ప్రసాదాల పోటు (ప్రసాదాల తయారీ కేంద్రం), ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు స్వామివారి పూజల కోసం వినియోగించే సామగ్రిని శుద్ధి చేశారు.

కోయిల్ (ఆలయం) ఆళ్లార్ (భక్తుడు) తిరు (శ్రేష్టం) మంజనం అంటే (స్నానం) అని అర్ధం. గర్భగుడి, ఆలయం, ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.

శ్రేవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమం ఏడాదిలో నాలుగుసార్లు నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మెత్సవాలకు ముందు ఈ కోయిల్ ఆళ్లార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. కాగా,

శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరమంజనం నిర్వహించారు. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ లోకనాథంతో పాటు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూలవిగ్రహంపై..
తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించే సమయంలో శ్రీవారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. గర్భాలయంతో పాటు ఏడో వాకిలి వరకు ఆలయంలో సుగంధ పరిమణాలు కలిపిన జలాలను చల్లారు. ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామితో పాటు అన్ని విగ్రహాలపై సుగంధ పరిమళాలు వెదజల్లారు. అనంతరం శ్రీవారి విగ్రహానికి కప్పిన వస్త్రాన్ని తొలగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమాల తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
పవిత్ర జలాల్లో కలిపే పదార్థాలు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయంలో వెదజల్లే జలాల్లో ఏమి కలుపుతారంటే... నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి వస్తువుల చూర్ణం కలిపిన నీటిని ఆలయంతో పాటు గోడలపై కూడా వెదజల్లుతారు. దీనివల్ల ఆలయంలో సుగంధ పరిమణాలు ముక్కుపుటాలను తాకుతుంటే, కలగే ఆనందం మధురంగా ఉంటుంది. అలంకార ప్రియుడైన శ్రీవారికి ఇవన్నీ నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
Tags:    

Similar News