అమరజీవి త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం అవతరించిందని. కర్నూలు రాజధానిగా 1953, అక్టోబర్ 1 నుంచి తెలుగు ప్రజలకు స్వయం పాలన మొదలైందని వివరించారు. ఆ తర్వాత 1956,నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పాటైందని అన్నారు. ఈ తేదీలపై కొందరు రాజకీయ దుమారం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే అమరజీవి ఆత్మార్పణ చేసిన దినాన్ని డే ఆఫ్ శాక్రిఫైస్ గా నిర్వహిస్తున్నట్టు సీఎం తెలిపారు. 2026 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని...ఆ మహనీయుడిని శాశ్వతంగా స్మరించుకునేలా ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఏడాది పాటు జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ 15న 58 రోజుల దీక్షకు గుర్తుగా, మనందరికీ స్ఫూర్తి నింపేలా రాజధాని అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. జయంతి రోజున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని,ఇందుకోసం 6.8 ఎకరాల స్థలం కేటాయించా మన్నారు. ఇందులో పొట్టి శ్రీరాములు స్మృతి వనం, అలాగే ఆయన జీవిత విశేషాలతో మ్యూజియం సిద్ధం అవుతోందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఇలా ఒకరి కోసం స్మృతి వనం నిర్మించడం ఇదే తొలిసారి అని.. ఇది శ్రీ పొట్టి శ్రీరాములుకు కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవమని ముఖ్యమంత్రి తెలిపారు.
పొట్టి శ్రీరాములుకు గుర్తింపు ఇచ్చింది ఎన్టీఆర్
పొట్టిశ్రీరాములు త్యాగానికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే 1985లో తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. 2003 ,మార్చి 10న నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టి కేంద్రానికి పంపాం. ఆ తర్వాతే కేంద్రం జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నోటిఫై చేసింది. అలాగే చెన్నైలో ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని నిర్ణయించాం. భావితరాలకు గుర్తుండేలా దానిని మెమోరియల్ గా తీర్చిదిద్దుతాం. అలాగే ఆర్య వైశ్యుల సెంటిమెంట్ ను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుంది. ఆర్య వైశ్యుల కులదైవం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారు జన్మించిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండ అని మార్చాం. ఆర్య వైశ్యుల విన్నపం మేరకు కేస్ట్ సర్టిఫికెట్లలో మార్పులు చేస్తున్నామని సీఎం తెలిపారు. వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చినందుకు మహిళలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియచేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
మూడు రాజధానులు మహా కుట్ర
గత పాలకులు మూడు రాజధానుల పేరుతో మహా కుట్ర చేశారు. ప్రపంచమంతా మనల్ని అపహాస్యం చేశారు. మన రాష్ట్రం పేరు, రాజధాని పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతిని ప్రపంచం మెచ్చే నగరంగా తయారుచేస్తున్నాం. తిరుపతి, విశాఖలను మేటి నగరాలుగా తీర్చిదిద్దుతాం. ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫలాలు, చేపలు పండించే ప్రాంతంగా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలి వస్తున్నాయి. 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. పీపీపీ విధానంలోనే రహదారులు, ఎయిర్ పోర్టులు వంటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు పీ4 తెచ్చాం. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, సవిత, ఆర్య వైశ్య కార్పోరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.