శ్రీవారికి త్రైమాసిక మెట్లోత్సవం ఎందుకు నిర్వహిస్తారు..
అలిపిరి నుంచి 31న దాససాహిత్య ప్రాజెక్టు భక్తి సంకీర్తన యాత్ర నిర్వహించడం వెనుక కథ?
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-26 13:31 GMT
ఫైల్ ఫొటోతిరుమలలో ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు.
టీటీడీ, దాససాహిత్య ప్రాజెక్టు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా 31వ తేదీ అలిపిరి పాదాల మండపం వద్ద ఉదయం 4.30 గంటలకు మెట్ల పూజ నిర్వహిస్తారు.
ఫైల్ ఫొటో
అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. కాలిబాటలో గాలిగోపురం, ఏడో మైలుతో పాటు చదునుగా ఉన్న ప్రదేశాల్లో భజన మండళ్ళ కళాకారులు ప్రదర్శనలో యాత్రికులను అలరించనున్నారు. దీనికోసం టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల మార్గంలో ఏడు కొండలు సాంప్రదాయ పద్ధతులను, దుస్తులు ధరించి కర్ణాటక హరిదాసులు సూచించిన విధంగా మెట్ల మీదుగా నడక సాగించడం మెట్లోత్సవంగా భావిస్తారు. వేలాది మంది భక్తులు హరిదాసులు, సంప్రదాయ పసుపు, ఆరెంజ్, తెలుపు దుస్తులు ధరించిన వారిలో వేంకటేశ్వరుడు, అన్నమయ్య వేషధారణలతో సంకీర్తనలు ఆలపిస్తూ తిరుమలకు సాగుతారు.
ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి
మెట్లోత్సవ ఆచారం ప్రసిద్ధ కన్నడ హరిదాసుల్లో పురందరదాసు, కనకదాసు, విజయాసులు ప్రారంభించినట్లు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. పురందరదాసు బ్రహ్మ ముహూర్తంలో మెట్ల మార్గంలోనే ప్రతి సంవత్సరం రెండు లేదా మూడుసార్లు, బ్రహ్మోత్సవాల వేళ తిరులకు వెళ్లే వారని ధర్మప్రచార పరిషత్ అధికారులు చెబుతున్నారు. అదే దాస సంప్రదాయం 15, 16 శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు.
తిరుమల త్రైమాసిక మెట్లోత్సవం కూడా అనాదిగా వస్తున్న ధార్మిక సంప్రదాయాల్లో ఒకటి. పూర్వం మహర్షులు, రాజర్షులు పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి అధిరోహించి ధన్యులయ్యారు.
ఆ బాటలోనే
తిరుమల శ్రీవారికి సేవలు అందించిన వారిలో తాళ్లపాక అన్నమాచార్యుడు శ్రీవారికి వేల సంకీర్తనలతో కీర్తించారు. శ్రీకృష్ణదేవరాయలవారు శ్రీవేంకటేశ్వరస్వామివారిని తన జీవితకాలంలో 1513 నుంచి 1521 వరకు ఎనిమిదిసార్తు దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శాసనాల ప్రకారం ఏడుసార్లు దర్శించుకున్నారనేది చరిత్రకారులు వెలుగులోకి తెచ్చారు. అన్ని సందర్బాల్లోనూ విలువకట్టలేని ఆభరనాలు స్వామివారికి సమర్పించారు. వారంతా అలిపిరి మార్గం నుంచే తిరుమలకు చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
"రాజర్షులు అడుగుజాడల్లో ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీవారి సేవ కోసం మెట్లోత్సవ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నాం" అని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు తెలిపారు.
ఆ ఆచారంలో భాగమే మెట్లోత్సవం
తిరుమలలో ఈ నెల 30, ఒకతో తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు భజన మండళ్ల శ్రీవారి నామసంకీర్తనలు, సామూహిక భజనల అనంతరం ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నవంబర్ ఒకటో తేదీ ఉదయం 8.30 గంటలకు సామూహిక నామసంకీర్తన, ఉదయం 9.30 గంటల నుంచి స్వామిజీలు ధార్మిక సందేశాలు ఇవ్వనున్నారు.
అలిపిరి వద్ద..
అలిపిరి మెట్ల వద్ద పూజ చేస్తున్న అన్నమయ్య 12వ తరం వారసుడు తాళ్లపాక హరినారాయణస్వామి (ఫైల్)
తిరుమలకు మెట్లోత్సవం ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద 31వ తేదీ తెల్లవారుజామున పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు కూడా భారీగా హాజరుకానున్నారు. పాదాల మండపం, శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయాలకు మధ్య ఉన్న తిరుమలకు ప్రారంభమయ్యే మెట్లకు సమీపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆశీలను చేస్తారు. దాససాహిత్య ప్రాజెక్టు అధికారులతో పాటు తాళ్లపాక అన్నచార్యుల వంశీకుడు విగ్రహాలకు పూజలు చేయడం, అనంతరం దాససాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు వేలాదిగా హాజరయ్య భక్త మండళ్ల కళాకారులను ఉద్దేశించి ధార్మిక సందేశాలు ఇవ్వనున్నారు. అనంతరం అన్నమయ్య 12వ తరానికి చెందిన వంశీకుడు తాళ్ళపాక హరినారాయణస్వామి, దాససాహిత్య ప్రతినిధులు స్వామివార్ల విగ్రహాలు తలపై ఉంచుకుని సంకీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగుతుంటే కళాకారులు భజనలతో వారిని వెన్నంటి సాగనున్నారు. అలిపిరి వద్ద ఈ దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లు చాలవేమో అన్నంత హృద్యంగా ఉంటాయి.