తిరుమల:14న కుమారధార తీర్థముక్కోటి సాహసయాత్ర

శేషాచలం అడవుల్లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికులకు అధికారులు కొన్ని సూచనలు కూడా చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-10 08:15 GMT

తిరుమల ఆలయానికి వాయువ్యంగా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో ముక్కోటి తీర్థాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ నెల 14వ తేదీ కుమారధార తీర్ధముక్కోటికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శేషాచలం అడవులు ప్రకృతి అందాలకు నెలవు. అరుదైన జీవులకు ఆవాసం. తిరుమల క్షేత్ర చరిత్ర ఆధారంగా విశేషమైన స్థలాలకు కూడా కేంద్రం. ఇంతటి చరిత్ర కలిగిన ఈ అటవీప్రాంతంలో తీర్థాలకు కొదవ లేదు. ఏడాదికి ఒకో తీర్థంలో ఒకరోజు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.


మాఘమాసం పెళ్లిళ్లతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా మోసుకుని వచ్చింది. కుమారధార తీర్థముక్కోటిని టీటీడీ మాఘమాసంలో పౌర్ణమిరోజు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తోంది. ఈ ఉత్సవానికి వచ్చే యాత్రికులు ప్రకృతి ఒడిలో కొండల పైనుంచి జాలువారే జలపాతం. సెలయేటిలో స్నానమాచరించడానికి యాత్రికులు ఓ అనుభూతికి లోనవుతారు.

తిరుమల నుంచి పది కిలోమీటర్ల దూరంలోని పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులో చేరుకోవచ్చు. అక్కడి నుంచి అడవులు, పర్వతశ్రేణువుల మధ్య లోయల్లో నడకమార్గంలో ప్రయాణించాలి. కొన్నిచోట్ల కొండలు ఎక్కడం. కిందికి దిగడం. తాళ్లసాయంతో ఏర్పాటు చేసిన నిచ్చెన పైనుంచి కూడా దిగి, ప్రయాణించడం యాత్రికులు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
నిబంధనలు

కుమారధార తీర్థ ముక్కోటి కోసం శేషాచలం అడవుల్లోకి వెళ్లడానికి యాత్రికులు కొన్ని నిబంధనలు పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది.
1. పాపవినాశనం వద్ద టీటీడీ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తుంది. మజ్జిగ, మంచినీటిని అందిస్తారు.
2. తిరుమలకు సమీపంలోని గోగర్భం డ్యాం నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి.
3. మధ్యాహ్నం 12 గంటల తరువాత కుమారధార తీర్థముక్కోటి ప్రాంతానికి అనుమతించరు
3. ప్రైవేటు వాహనాలను 14వ తేదీ అనుమతి లేదు.
4. కి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను కూడా అనుమతించరు.
ఇంజినీరింగ్ శాఖ ఏర్పాట్లు

శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీప్రాంతంలోని కుమారధార తీర్థముక్కోటి కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవానికి యాత్రికులు పోటెత్తనున్నారు. దీంతో యాత్రికులకు ఇబ్బంది లేకుండా టీటీడీ ఇంజినీరింగ్ విభాగం కొండ, కోనల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రకృతిలోని ఈ ప్రదేశంలో ఉన్న జలపాతం కింద స్నానం చేయడానికి యాత్రికులు శ్రద్ధ చూపించడమే కాదు. మరువలేని అనుభూతితో తిరుగుముఖం పడతారని అధికారులు చెబుతన్నారు. దీంతో ఇంజినీరింగ్ విభాగంతో పాటు, టీటీడీ అటవీశాఖ అధికారులు యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ఏమి చేస్తోందంటే..
తిరుమలలో మార్చి 14న (శుక్రవారం) జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 5 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే కుమార‌ధార తీర్థానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఇంకా ఏమి సూచించారంటే..
అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి లేదు. గోగ‌ర్భం డ్యాం నుంచి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌యివేటు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోరారు. పాపవినాశనం నుంచి కుమార‌ధార‌ తీర్థం వరకు భద్రతా సిబ్బందిని దారిపొడవునా అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
అన్నప్రసాదాలు..
శేషాచలం అటవీ ప్రాంతంలోని కుమారధార తీర్థముక్కోటి మార్గంలో తాగునీరు అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 5 గంటల నుంచి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగ‌లి, పులిహోర, సాంబార‌న్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్ర‌యివేటు సంస్థ‌లు, వ్య‌క్తులు అన్న‌దానం చేసేందుకు అనుమ‌తి ఇవ్వలేదని తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో భ‌క్తుల‌కు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్ట‌ర్లు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.

Similar News