Tirumala | కిటకిటలాడుతున్న తిరుమల

టీటీడీ అధికారులు శ‌నివారం 90,211 మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం కల్పించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-25 13:34 GMT
తిరుమల: శ్రీవారి దర్శనానికి క్యూలో వెళుతున్న యాత్రికులు

వేస‌వి సెల‌వుల కార‌ణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో పనిచేయడం ద్వారా భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంకుంది. 

తిరుమలలోని వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంత‌రాయంగా అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేపట్టింది. శ‌నివారం 90,211 మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగింది.


మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంతో పాటూ ఇత‌ర అన్న‌ప్ర‌సాద కేంద్రాల్లో క‌లిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జ‌రిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి రోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు.
మే 24న ఒక్కరోజే మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించారు.
ఆరోగ్యశాఖ విస్తృత సేవ‌లు
క్యూలైన్లలో నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మైస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంట‌లు సేవలు అందిస్తున్నారు.
శ్రీవారి సేవకుల విశేష సేవ‌లు

తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ దాదాపు మూడు వేల మంది శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు విస్తృత‌ సేవ‌లు అందిస్తున్నారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా నాలుగు షిప్టుల‌లో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవ‌ల‌ను శ్రీ‌వారి సేవ గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
స‌మ‌ర్థ‌వంతంగా క్యూల నిర్వ‌హ‌ణ‌

విజిలెన్స్, ఆలయ విభాగాలు ద‌ర్శ‌న‌ క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.
కల్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్ ,బ్రాడ్ కాస్టింగ్ త‌దిత‌ర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి.

Similar News