గాలిలో కలిసిన వలస కూలీల ప్రాణాలు

తిరుపతి వద్ద ఐదు అంతస్తుల భవనం పైనుంచి పడి ముగ్గురు కూలీలు మరణించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘ నేతలు ఆందోళనకు దిగారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-04-29 07:41 GMT
తిరుపతి: నిర్మాణంలో ఉన్న భవనం

కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం పొరుగు ప్రాంతాలకు వలస వస్తున్న కూలీలకు భద్రత లేకుండా పోయింది. భవన నిర్మాణలో కూలీలు పనిచేస్తున్న పైనుంచి కింద పడడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిరుపతిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో భవన నిర్మాణరంగంలో పనులకు వచ్చిన వలస కూలీలు కలవరం చెందుతున్నారు.


"అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కొరవడింది" అని సీఐటీయు రాష్ట్ర నేత కందారపు మురళీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికశాఖ నామమాత్రంగా మారిన నేపథ్యంలోనే ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని మురళీ ఆందోళన వ్యక్తం చేశారు.

సంఘటన వివరాల్లోకి వెళితే..
తిరుపతి నగరం కరకంబాడి మార్గంలోని మంగళం వద్ద ఐదు అంతస్తుల భవన నిర్మాణ పనులు కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఒంగోలు ప్రాంతం నుంచి కూలీ పనులు చేసుకుని జీవించడానికి కొన్ని కుటుంబాలు తిరుపతికి వచ్చాయి.
మంగళవారం ఉదయం భవనం పై అంతస్తుల్లో పనులు చేస్తున్న కూలీలు 60 అడుగులకు పైగానే ఉన్న భవనం పైనుంచి పట్టుతప్పి కింద పడిపోతూ ప్రాణభయంతో కేకలు వేయడం గమనించిన సమీపం ప్రాంతాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మృతులది ఒంగోలు
ఐదు అంతస్తుల పైనుంచి భూమిపై పడిన ముగ్గురు వసల కూలీలు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తిరుపతి నగరంలో కలకలం చెలరేగింది. భవనం పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారిని శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. వారంతా ఒంగోలు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారి కుంటుంబాల వివరాలు ఇంకా తెలియలేదు.
"రియల్" గా జాగ్రత్తలు లేవు
రియల్ ఎస్టేట్, బిల్డర్ గా మారిన వ్యక్తులు వలస కూలీలను నిర్మాణ రంగంలో పనులకు వాడుకుంటున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల నుంచే కాకుండా, తమిళనాడు నుంచి కూడా వలస వచ్చిన కూలీలు భవన నిర్మాణ పనులకు వెళుతున్నారు. భవన నిర్మాణాల పనులు కాంట్రాక్టు తీసుకునే బిల్డర్లు వలస కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేసే సమయంలో భద్రతా చర్యలు, ప్రధానంగా కూలీలకు రక్షణ కవచంగా ఉండాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విషయం తిరుపతి సమీపంలోని మంగళం తుడా క్వార్టర్స్ సమీపంలో ముగ్గురు వలస కూలీలు మరణించిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది.
కనిపించని తనిఖీలు
భవన నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వడం వరకే నగర పాలక సంస్థ, తుడా (Tirupati Urban development ) అధికారులు పరిమితం అవుతున్నారు. మినహా, భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలను అధికారులు తనిఖీలు చేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో బిల్డర్లు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు భద్రత కల్పించడానికి కార్మిక శాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర నేత కందారపు మురళి డిమాండ్ చేశారు.
"తిరుపతి నగరంలో వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రేతరులు కూడా కూలీలుగా వచ్చారు. వారికి సామాజిక భద్రత కల్పించండి" అని కందారపు మురళీ కోరారు. వలస కూలీల భద్రత కోసం తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మురళీ హెచ్చరించారు.

Similar News