సోదరునికి టిక్కెట్ ఇప్పించుకుని వర్మను వదిలేశారు

అన్నీ నేను చూసుకుంటానన్నారు. వర్మ నిజమే అనుకున్నారు. తీరా వర్మకు పదవి దక్కలేదు. అందుకు పవన్ కల్యాణ్ కారణమని తెలుగు దేశం క్యాడర్ భావిస్తోంది.;

Update: 2025-03-12 07:00 GMT

అన్నీ నేను చూసుకుంటానని, నా తర్వాత స్థానం నీదేనని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను వదిలేశారు. తనకు దక్కాల్సిన ఎమ్మెల్యే టిక్కెట్ ను పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు వర్మ తన సీటును త్యాగం చేశారు. రానున్న మండలి ఎన్నికల్లో తప్పకుండా మీకు అవకాశం ఉంటుందని చెప్పటంతో ఆశగా వర్మ ఎదురు చూశారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు బాగానే పట్టు వుంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో రాజు సామాజిక వర్గానికి చెందిన వర్మ ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తాను అంటే ఏమిటో నిరూపించుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వర్మకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

వర్మ విషయంలో ఎందుకు పట్టుదలకు పోలేదు

వర్మకు సీటు ఇప్పించే విషయంలో పవన్ కల్యాణ్ పట్టుదలకు పోకుండా ఎందుకు వదిలేశారనే చర్చ మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. తెలుగుదేశం వారికి ఏ పని చేసినా జనసేన వారు సహించలేకపోతున్నారు. దీంతో జనసేన, టీడీపీల మధ్య పిఠాపురం నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీటిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదు. వచ్చే 14న జనసేన ప్లీనరీని కూడా ఇక్కడే పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. దీంతో ఇకపై పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనే పరిస్థితి లేకుండా పోతుందనే అనుమానం టీడీపీ వారిలో మరింత పెరిగింది.

పోటీగా నిలుస్తాడనేనా?

తనకు ఎక్కడా పోటీ దారుడుగా వర్మ మారుతాడోననే అనుమానంతోనే పవన్ కల్యాణ్ వర్మ విషయంలో పట్టుదలకు పోలేదని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించే విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. పదవి లేకపోయినా వర్మకు చంద్రబాబు నాయుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి ప్రయారిటీనే ఇస్తున్నాడు. ఇక ఎమ్మెల్సీ అయితే తనతో సమానంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు జరపటం మొదలు పెడితే సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉందని భావించిన పవన్ కల్యాణ్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

భగ్గుమన్న వర్మ అనుచరులు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు తప్పకుండా ఉంటుందని భావించిన వర్మ తన అనుచరులతో నామినేషన్ పత్రాలు రెడీ చేసుకుని ఉన్నారు. నామినేషన్ ముందు రోజు సాయంత్రం ఒక ఎస్సీ, ఇద్దరు బీసీ అభ్యర్థులను చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన క్రమంలో సీటు ఇవ్వలేక పోతున్నామని, పార్టీలో, ప్రభుత్వంలో మీకు ఎప్పుడూ ప్రయారిటీ ఉంటుందని వర్మకు నచ్చ జెప్పారు. అయితే టీడీపీ క్యారడ్, వర్మ అనుచరులు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఫైల్స్, ఇతర కాగితాలు తగుల బెట్టి సీఎం చంద్రబాబును బూతులు తిట్టారు.

వర్మను బాబు దూరం చేసుకుంటాడా?

సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ఆలోచనలు దూర దృష్టితో ఉంటాయంటారు. అందుకే పవన్ కల్యాన్ ను దూరం చేసుకోకుండా, పిఠాపురంలో తెలుగుదేశం క్యాడర్ ను కాపాడుకునే పనిలో ఉన్నారనేది కూడా ప్రస్తుతం ప్రజల్లో చర్చకు దారి తీసింది. వర్మపై పిఠాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరుల్లో అభిమానం ఎక్కువగా ఉన్నందున ఆయననే ఆయుధంగా చేసుకుని పవన్ కల్యాణ్ దూకుడుకు కాస్త కళ్లేం వేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నారని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.

ఒక దశలో నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు లేదని, కార్పొరేషన్ పదవి ఇచ్చే అవకాశం మాత్రమే ఉందని చర్చ జరిగింది. కూటమి అనుకూల పత్రికల్లో ఈ వర్తలు రావడంతో ముఖ్యమంత్రితో చర్చించిన పవన్ కల్యాణ్ నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News