టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే
సోమవారం నామినేషన్‌లకు దాఖలు చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేశారు.;
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు తెరదించారు. ముగ్గురు నేతలను ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర కసరత్తు చేశారు. సోమవారం నామినేషన్‌లకు ఆఖరు కావడంతో అభ్యర్థులను ప్రకటించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బీసీ వర్గానికి చెందిన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటీ నాయుడు, ఎస్సీ వర్గానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మలను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ప్రకటించారు.
దీంతో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవడంలో వారు నిమగ్న మయ్యారు. రాయలసీమ కర్నూలుకు చెందిన బీటీ నాయుడుకు మరో సారి అవకాశం కల్పించారు. అటు సీఎం చంద్రబాబును, ఇటు నారా లోకేష్‌ను అంటిపెట్టుకొని ఉన్న బీదా రవిచంద్రకు అవకాశం కల్పించారు. సార్వత్రి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసిన నిరాశకు లోనైన ప్రతిభా భారతి కూతురు గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ నెలాఖరు నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబుల పదవీ కాలం మార్చి 29 నాటికి ముగియనుంది.