విద్యా వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటారా?

నూతన టీచర్ల నియామక సభ విద్యా విజయమా, రాజకీయ ఉపకరణమా?;

Update: 2025-09-16 08:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో DSC-2025 ద్వారా ఎంపికైన టీచర్లకు భారీ ఈవెంట్ ను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయించింది. DSC ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల కావడంతో సెప్టెంబర్ 19న వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. అయితే ఈ నియామకాలు రాజకీయ కార్యక్రమంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులను కుటుంబ సభ్యులతో సహా రప్పించడం, మకాం ఏర్పాటు చేయడం, విద్యార్థులు, ప్రజలను బస్సుల్లో తరలించడం వంటి ఏర్పాట్లు ఈ కార్యక్రమాన్ని ఒక భారీ రాజకీయ సభలా కనిపించేలా చేస్తున్నాయి.

ఉపాధ్యాయుల కోసం వెయ్యి బస్ లు

రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో విద్యార్థులు, కుటుంబ సభ్యులను రప్పిస్తున్నారు. ఇప్పటికే డీఈవోలు మండల ఎంఈవోలకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు కూడా సమాచారం అందించారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా బస్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా నుంచి 661 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరందరినీ తరలించాలంటే కనీసం 30 బస్ లు తప్పకుండా కావాలి. అంటే 661 మంది ఉపాధ్యాయులతో పాటు మరో 661 మంది సహాయకులు వస్తారు. అంటే ఒక్క ప్రకాశం జిల్లా నుంచి 1322 మంది వస్తారు. వీరు కాకుండా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కనీసం ఒక్క ప్రకాశం జిల్లా నుంచే 60 బస్ లకు తగ్గకుండా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బస్ లను ఏర్పాటు చేసే బాధ్యతను కూడా జిల్లా విద్యాశాఖ అధికారికే అప్పగించారు. ప్రత్యేకమైన ప్రభుత్వ కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తున్నారు.

రాష్ట్రం మొత్తం మీద కేవలం ఉపాధ్యాయులు, వారి సహాయకుల కోసం వెయ్యి బస్ లు ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున కనీసంగా నైనా 1500 లకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యప్తంగా బస్ లు అమరావతికి రానున్నాయి.

2016లోనూ ఏర్పాటు

సీఎం చంద్రబాబు నాయుడు 2016లో డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,313 ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను పంపిణీ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమం జూన్ 1 న జరిగింది.

అదే విధంగా ఇప్పుడు కూడా చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుడు, ఆయన తరపు మరో వ్యక్తి కలిస్తే 30వేల మంది పైన అవుతున్నారు. గతంలో ఇంత భారీగా ఉపాధ్యాయుల ఎంపిక కాలేదు కాబట్టి తక్కువ మందితో సభ నిర్వహించారు. కానీ ఈనెల 19న జరిగే సభ భారీగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ వారు చెప్పారు.

రాజకీయ చర్చకు ఆస్కారం...

DSC-2025 ప్రక్రియ ఏప్రిల్ 20న నోటిఫికేషన్‌తో మొదలై, జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించబడింది. 3.36 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న ఈ పరీక్షలో 92.9శాతం అటెండెన్స్ నమోదైంది. ఆగస్టు 22న మెరిట్ లిస్ట్ విడుదల కాగా, సెప్టెంబర్ 15న ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు ఈనెల 22 నుంచి 29 వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలోనే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి స్కూల్స్ అలాట్ మెంట్ ఇస్తారు. ఇదంతా జిల్లా సెలక్షన్ కమిటీ నేతృత్వంలోనే జరుగుతుంది. అలా కాకుండా వెలగపూడిలో ముఖ్యమంత్రి ద్వారా నియామక పత్రాలు అందించే కార్యక్రమం పెట్టడం వివాదాస్పద అంశం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఒక సాధారణ ప్రభుత్వ ఈవెంట్‌గా కాకుండా, భారీ సభగా మార్చడం అనేది రాజకీయ చర్చకు దారి తీస్తోంది.

పార్టీ నేతల హడావుడి

ఎంపికైన 16,347 మంది అభ్యర్థులు, వారి సహాయకులు (కుటుంబ సభ్యులు లేదా అసిస్టెంట్లు) సహా సుమారు 32,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీనికి తోడు కూటమి పార్టీల సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం 1 లక్ష మంది పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఎంపికైన ప్రతి అభ్యర్థిని ఒక అసిస్టెంట్‌తో సహా రప్పించాలని విద్యా మంత్రి లోకేష్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల్లో విద్యార్థులు, కుటుంబ సభ్యులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.

జిల్లా స్థాయిలో అధికారులు బాధ్యతలు చేపట్టడంతో రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి బస్సుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. విద్యార్థులను రప్పించడం వెనుక పార్టీల కార్యకర్తలు సమన్వయం చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థను ఉపయోగించుకోవడంగా విమర్శకులు చూస్తున్నారు.

సూపర్ సిక్స్ వాగ్దానాల్లో భాగంగా ప్రచారం

ఈ కార్యక్రమం ఒక సాధారణ నియామక ప్రక్రియ కాకుండా, కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' వాగ్దానాల్లో భాగంగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమయంలో DSC నియామకాలు సాధారణంగా జిల్లా స్థాయిలో జరిగేవి, కానీ ఇప్పుడు 1 లక్ష మంది సభకు ఏర్పాట్లు చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వనరులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం సరైందేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విద్యా శాఖ అధికారులు ఈ ఏర్పాట్లు అభ్యర్థుల సౌకర్యార్థమేనని చెబుతున్నప్పటికీ, పార్టీ సభ్యుల పాల్గొన్నత దీన్ని రాజకీయ రంగస్థలంగా మారుస్తోంది.

విపక్ష నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటివారు గతంలో ఇలాంటి చర్యలను విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీన్ని మరింత భారీగా చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి నియామకాలు సాధారణంగా జరగాలంటే, ప్రభుత్వం పారదర్శకతను పాటించాలి. నియామక పత్రాలు అందుకున్న తర్వాత, అభ్యర్థులు 10 రోజుల జిల్లా స్థాయి శిక్షణ పొంది, దసరా సెలవుల తర్వాత పాఠశాలల్లో చేరాలి.

ఉపాధ్యాయులను రాజకీయ ఏజెంట్లుగా మరుస్తున్నారు: ఈశ్వరయ్య

ఈ విషయమై ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులను కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకునే విధంగా ఈవెంట్లు నిర్వహించడం దారుణమని ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ చెడిపోతుందని, రాజకీయాలకు ఉపాధ్యాయులను తొత్తులుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు భావించాల్సి వస్తుందని అన్నారు.

Tags:    

Similar News