'తిరుమలలో దళారీలను రూపుమాపండి’.. సిఐటియు డిమాండ్

తిరుమల కొండపై దళారీ వ్యవస్థ వేళ్లూనికుని పోయిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు.

By :  Admin
Update: 2024-08-24 11:59 GMT

తిరుమల కొండపై దళారీ వ్యవస్థ వేళ్లూనికుని పోయిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. ఎన్ని సంస్కరణలు చేపడుతున్నామని అధికారులు, ప్రభుత్వం ప్రకటించినా ఏదో ఒక కొత్త రూపంలో ఈ దళారీ వ్యవస్థ పుట్టుకొస్తూనే ఉందని తాజా ఉదాహరణలు వెల్లడి చేస్తున్నాయని అన్నారు. అన్ని పనులకు స్వామిని వస్తువుగా వాడుకోవడం, అవినీతి పెచ్చరిల్లి పోవడం తదితర కారణాల రీత్యా ఈ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

తిరుమల కొండపై దళారీ వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే స్వయంగా మంత్రులను సైతం మీ లేఖలు ఇవ్వండి... నెలకు రూ. 15 నుంచి 20 లక్షలు చెల్లిస్తామని చెప్పే స్థాయికి వెళ్లారంటే వీరి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. తిరుమల కొండపై దళారీలు ఏ స్థాయిలో ఉన్నా వారిని ప్రాసిక్యూట్ చేయాలని, దళారీ వ్యవస్థను రూపుమాపడానికి పారదర్శకత ఒకటే మార్గమని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుమల జెఇఓ కార్యాలయానికి ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి ఏ కార్యాలయం నుంచి ఎన్ని సిఫార్సు లేఖలు వస్తున్నాయి? అనే విషయాన్ని ప్రతిరోజు వెల్లడించడం ద్వారా వీటిని అరికట్టడానికి సాధ్యమవుతుందని తెలిపారు.

మొదటి నుంచి తాము ఈ డిమాండ్ ను చేస్తున్నా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగానే ఉన్నాయని పారదర్శకత పాటించకుండా, దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఏ రకంగానూ సాధ్యం కాదని తక్షణం చర్యలు చేపట్టాలని కందారపు మురళి సూచించారు.

Tags:    

Similar News