చంద్రబాబు రాజకీయాలకు..మన రాజకీయాలకు తేడా ఉంది

వెన్నుపోటుతోనే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.;

Update: 2025-05-01 13:42 GMT

చంద్రబాబు రాజకీయాలకు.. మన రాజకీయాలకు చాలా తేడా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులతో గురువారం జగన్‌ సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు మీద, ఆయన పాలన మీద, చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 నెలలచంద్రబాబు పాలనలో ఆయన చేస్తున్న రాజకీయాలకు, వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నామని, దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అధికారం కోసం చంద్రబాబు ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారని అన్నారు.

సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీలకు ఆరింటిని వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. ఒకే ఒక్క దానిని టీడీపీ గెలుచుకుంది. అలాంటిది ఎంపీపీ పదవి వైఎస్‌ఆర్‌సీపీకే రావాలి. కానీ చంద్రబాబు అత్యంత హీనంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మార్కాపూరంలో 15 ఎంపీటీసీలకు గాను 15 వైఎస్‌ఆర్‌సీపీనే గెలుచుకుంది. అక్కడ ఎంపీపీ కూడా వైఎస్‌ఆర్‌సీపీకే రావాలి. కానీ అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అయినా వైసీపీ వాళ్లంతా ఒక్కటిగా నిలబడినందుకు హ్యాట్సాఫ్‌ అని అన్నారు. పిఠాపురంలో కూడా వైసీపీ వాళ్లు గట్టిగా నిలబడ్డారని మెచ్చుకున్నారు. కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులకు గాను 19 వైసీపీ గెలిస్తే, టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. ఇక్కడ కూడా చైర్మన్‌ పదవి వైసీపీకి రావాలి. కానీ దౌర్జన్యాలు చేసి, బెదిరింపులకు పాల్పడి అన్యాయంగా ప్రవర్తించారని జగన్‌ మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలను తీసుకొస్తే వాటిని అన్నింటిని నాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్‌ మండిపడ్డారు.
Tags:    

Similar News