టాలీవుడ్‌కు పాకిన టీటీడీ లడ్డూ వివాదం

లడ్డూ వివాదంపై ప్రముఖ సినీ నటులు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులు చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. విభేదాలు గుప్పు మన్నాయి.

Update: 2024-09-22 07:55 GMT

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదం కాస్తా తెలుగు సినీ పరిశ్రమకు పాకింది. దీనిపై చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు రాజకీయ పక్షాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం తాజాగా టాలీవుడ్‌కు కూడా పాకింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ నటులు తమ సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ నటులు తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఘర్షణ వాతావరణానికి దారి తీస్తాయా అన్నట్లు వారి పోస్టులు ఉన్నాయి. వారి మధ్య గతంలో నెలకొన్న పాత గొడవలు ఇంకా సమసి పోలేదు.. ఇంకా నివురు గప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉన్నాయనే అనుమానాలు ఉట్టిపడేలా పోస్టులు ఉన్నాయన్న చర్చ తెలుగు సినీ పరిశ్రమలో సాగుతోంది.

తిరుమల లడ్డూ వివిదాంపై తొలుత ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను కోట్‌ చేస్తూ మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు. జస్ట్‌ ఆస్కింగ్‌ ’అని పోస్టు పెట్టారు. ఇది అటు రాజకీయ వర్గాలు, ప్రజల్లోను ఇటు తెలుగు సినిమా వర్గాల్లోను పెద్ద చర్చగా మారింది.
అయితే మరో సినిమా నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్‌ పోస్టుకు కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రకాశ్‌రాజ్‌ దయచేసి మీరు అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుపతి తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి’ అని పోస్టు చేశారు.
ఇందులో మంచు విష్ణు ప్రకాశష్‌పైన వ్యంగ్యంగాను, ఘాటుగానే స్పందించారు. ఒక పక్క నిరుత్సాహ పడాల్సిన పని లేదని వ్యంగ్యం ప్రదర్శిస్తూనే మీ లాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో అని ఘాటుగానే స్పందించారనే చర్చ సాగుతోంది. అయితే మంచు విష్ణుకు, ప్రకాశ్‌ రాజ్‌కు మా ఎన్నికల నాటి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. ఎన్నడు జరగని రీతిలో ఈ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా జరిగాయి. వేర్వేరు ప్యానళ్ల నుంచి పోటీలోకి దిగిన వీరిద్దరు ప్రత్యర్థులుగా మారారు. ఈ ఎన్నికల సమయంలో మాటల యుద్దం కూడా సాగింది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ వెనుక మెగా ఫ్యామిలీ ఉందనే టాక్‌ కూడా వినిపించింది. మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్, అల్లు అరవింద్‌ తదితరులు వెనకుండి ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు సపోర్టు చేస్తూ అన్నీ తామై మోహన్‌బాబు కుటుంబానికి, మంచు విష్ణు ప్యానల్‌కు వ్యతిరేకంగా నిలచారనే చర్చ కూడా అప్పట్లో సాగింది.
అంతకు ముందు నుంచే మోహన్‌బాబుకు, చిరంజీవి కుటుంబానికి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగు సినీమా ఫంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్, మోహన్‌ బాబును వ్యంగాస్త్రాలతో బహిరంగంగానే విమర్శించారు. ఆ విభేదాలు మా ఎన్నికల్లో కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు కుటుంబానికి వ్యతిరేకంగా ప్రకాశ్‌రాజ్‌ను తెరపైకి తెచ్చారనే టాక్‌ ఉంది. ఆ సమయంలో ప్రకాశ్‌రాజ్, విష్ణుల మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా సమసి పోలేదని, నివురు కప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. లడ్డు వివాదం సందర్భంగా విష్ణు స్పందించిన తీరే నిదర్శనమే టాక్‌ వినిపిస్తోంది.
అయితే మా ఎన్నికల్లో కానీ అంతకుముందు నుంచి కానీ ప్రకాశ్‌రాజ్‌కు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటిది పవన్‌కళ్యాణ్‌ను కోట్‌ చేస్తూ ఎందుకు పోస్టు చేశాడు. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోకుండా, అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారనే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో ప్రకాశ్‌రాజ్‌కు మధ్య విభేదాలేమైనా నెలకొన్నాయా, లేకుంటే ఇలా ఎందుకు పోస్టు చేస్తారనే చర్చ కూడా వినిపిస్తోంది. లడ్డూ వివాదం పక్కన విష్ణు చేసిన పోస్టులో ప్రకాశ్‌రాజ్‌ను టార్గెట్‌ చేసినట్టుగానే ఉందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.
Tags:    

Similar News