మెగా డీఎస్సీ 2025 (MDSC-2025) ఉర్దూ పేపర్ లీక్ అయిందా?

నిరుద్యోగులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఏమని ఫిర్యాదు చేశారు?

By :  Admin
Update: 2025-11-28 09:24 GMT

ఎలా జరిగింది? మైనర్ మీడియా ప్రశ్నా పత్రాల అనువాదకులే లీక్ కు కారకులా? టెట్, డీఎస్సి ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లీష్ నుంచి ఉర్దూలోకి అనువాదం, టైపింగ్ చేసిన వారి ద్వారానే జరిగిందా? అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె, పుంగనూరు, కడప నుంచి సంవత్సరాల కాలంగా పాఠ్యపుస్తకాల అనువాదం, టెట్, డిఎస్ సి... తాజాగా 2025 మెగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల అనువాదం, టైపింగ్ వెళ్లిన ఉపాధ్యాయుల స్వంత కుటుంబ సభ్యులు స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) సోషియల్ విభాగంలో మూడో ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ విభాగం లో రెండో ర్యాంక్... అక్క కొడుకు 8 వ ర్యాంకు సాధించడం.... అంతకు ముందు డిఎస్ సి లో వదిన ఫస్ట్ ర్యాంక్... మరో అనువాదకుని అక్క 12 వ ర్యాంకు.... అనేది సందేహాలకు తెరతీసింది. అంతకు ముందు జరిగిన డిఎస్ సి ల్లో అర్హత మార్కులు కూడా సాధించలేని మహిళకు 2025లో 14వ ర్యాంకు ఎలా వచ్చింది? అనే ధర్మసందేహం కూడా నిరుద్యోగులు లేవనెత్తారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె, గుర్రంకొండ కడప జిల్లాల నుంచి ప్రశ్నాపత్రాలను ఉర్దూలోకి అనువదించడానికి వెళ్లిన వారే తమ సంబంధీకులకు పరీక్షలకు ముందే వెల్లడించారా? బాధిత నిరుద్యోగులు లేవనెత్తిన సందేహాలు ఇవి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ 2025 (MDSC-2025) ఉర్దూ విభాగంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసిన రాయలసీమ ప్రాంత నిరుద్యోగ ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసిన ఫిర్యాదును (MDSC-2025) S.G.T. ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) సోషల్ స్టడీస్ కేటగిరీ పోస్టుల కోసం జిల్లా ఎంపిక కమిటీ (MDSC-2025)లో అన్నమయ్య, చిత్తూరు జిల్లా బాధితులు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి పంపించారు.

రాష్ట్రంలోని మైనర్ మీడియా ఉర్దూ, తమిళం, కన్నడం భాషల్లో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల తయారీకి రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లా మదనపల్లె, రాయచోటి, కడప పట్టణాల నుంచి అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయులు వెళుతునక్నారు. ఒరియా భాషలో ప్రశ్నపత్రాల తయారీకి విశాఖ ప్రాంతం నుంచి, తమిళంకు చిత్తూరు నుంచి, కన్నడ కు అనంతపురం బార్డర్ నుంచి వెళుతున్నట్లు సమాచారం. తాజా వివరాల్లోకి వస్తే..
డీఎస్సీ 2025 కోసం...
మెగా డీఎస్సీ 2025లో భాషా ప్రశ్నాపత్రాల్లో తెలుగు, ఇంగ్లీషు నుంచి ఉర్దూలోకి అనువదించడానికి అన్నమయ్య జిల్లా మదనపల్లి, గుర్రంకొండ చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి ఉపాధ్యాయులు వెళ్లారు. వారితో పాటు మదనపల్లె నుంచి ఓ ప్రయివేటు అధ్యాపకుడు కూడా వెళ్లారు. వారిలో కడప జిల్లా కేంద్రం నుంచి కూడా ఇంకొందరు ఉన్నట్లు తెలిసింది. వారిలో మదనపల్లె, పుంగనూరు పట్టణాల నుంచి వెళ్లిన ఉర్దూ టీచర్ల కుటుంబీకులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అనేది చర్చనీయాంశమైంది.
ప్రశ్నలు లీక్ చేశారు..?
డీఎస్సీ 2025 ఉర్దూ విభాగం ప్రశ్నలు లీక్ చేశారని బాధిత నిరుద్యోగులు ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ వినతిపత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అందించారు.
"జిల్లా ఎంపిక కమిటీ (మెగా DSC-2025) పరీక్షలో అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్రమాలు, అవకతవకలు జరిగాయి. తెలుగు, ఆంగ్ల భాష నుంచి ఉర్దూ భాషలోకి ప్రశ్నాపత్రాలు అనువదించిన టీచర్లే లీక్ చేశారు. తమ సంబంధీకులకు ప్రశ్నలు చెప్పారు. వారు ఎక్కువ మార్కులు సాధించడానికి సహకారం అందించారు. దీనివల్ల సంవత్సరాల పాటు చదివి పరీక్షకు హాజరైన మేము నష్ట పోయాం. దీనిపై విచారణ జరిపించండి" అని అభ్యర్థించారు.
ఉర్దూ పాఠ్యాంశాలు తయారు చేయడంలో మదనపల్లె ప్రాంతంలోని ఉర్దూ టీచర్లలో కొందరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా తెలుగు, ఇంగ్లిషు పాఠ్యాంశాలు ఉర్దూలోకి తర్జుమా (Translate) చేయడానికి మదనపల్లె ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు ఉర్దూ టీచర్ల సేవలను రాష్ర్ట ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు వినియోగించుకుంటోంది. ఆ కోవలోనే సుదీర్ఘ విరామం తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం డీఎస్సీ 2025 (MDSC-2025) నిర్వహించింది. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లీషు నుంచి ఉర్దూలోకి అనుమవదించడానికి వెళ్లారు.
మెగా డీఎస్సీ నిర్వహణ
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరం 16,347 పోస్టుల భర్తీకీ ఏప్రిల్ 20వ తేదీ మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ నెల ఆరో తేదీ నుంచి జూలై రెండో తేదీ వరకు సబ్జెక్టుల వారిగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 92.9 శాతం మంది నిరుద్యోగులు హాజర్యారు. ఈ ఫలితాలు జూలై మూడో తేదీ విడుదల చేశారు. వారం తరువాత మెరిట్ లిస్టును వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ, పండుగ వాతావరణంలో అర్హత సాధించిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందించింది. దీంతో మిగతా పోస్టుల విషయం పక్కన ఉంచితే, S.G.T. ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం సోషల్ స్టడీస్ కేటగిరీ పోస్టుల్లో ర్యాంకులు సాధించిన వారిని చూసి అర్హత సాధించలేని నిరుద్యోగులు అవాక్కయ్యారు.
ఇదీ నిరుద్యోగుల  ఎందుకు వచ్చిందంటే..

1) మదనపల్లెకు చెందిన ఓ అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ సోషియల్ (ఉర్దూ) (School Asst (Urdu) క్యాటగిరీ పరీక్షలో మూడో ర్యాంకు... స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ విభాగం లో రెండో ర్యాంక్ సాధించారు.

2) వారి బంధువు ఒకరు ఎనిమిదో ర్యాంకు సాధించి తిరుపతి కార్పొరేషన్ ఉర్దూ స్కూల్ లో పని చేస్తున్నారు. అది వారికి ఉన్న తెలివి కావచ్చు. పరీక్షలో ర్యాంకులు సాధించారని అందరూ భావించారు. డీఎస్సీ 2025 ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీషు నుంచి ఉర్దూలోకి ట్రాన్స్ లేషన్ చేయడం తోపాటు టైపింగ్ లో కీలకంగా వ్యవహరించిన టీచర్ ఒకరు స్వయాన చెల్లెలు కావడం,మరొకరు కూడా ఆ టీచర్ కు స్వయాన అక్క కొడుకు కావడం వల్ల ప్రశ్నాపత్రం లీక్ చేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

3. ప్రశ్నాపత్రం తయారీలో కీలకమైన మదనపల్లె టీచర్ వల్ల పుంగనూరు పట్టణానికి చెందిన ఆయన శిష్యుడే 2018 డీఎస్సీలో ఉర్దూ టీచర్ గా సెలక్ట్ అయ్యారు.
4. మదనపల్లెలోని తన గురువుతో కలిసి పుంగనూరు టీచర్ కూడా ఈ సంవత్సరం ప్రశ్నాపత్రం తయారీకి వెళ్లాడు. ఆ పుంగనూరు ఉపాధ్యాయుడికి స్వయాన అక్క చిత్తూరు జిల్లా స్థాయిలో 14వ ర్యాంకు సాధించారు. ఇక్కడా తప్పు లేదు. ఆ తెలివి, పట్టుదలతో పరీక్ష రాసి, టీచర్ పోస్టు సాధించారని చెప్పవచ్చు. "గత డీఎస్సీలో అర్హత మార్కులు కూడా సాధించలేని ఆమెకు 14వ ర్యాంకు ఎలా సాధ్యమైంది" అనే ధర్మసందేహాన్ని లేవనెత్తారు.
"మదనపల్లె టీచర్ తో కలిసి వెళ్లిన ఆ పుంగనూరు టీచర్ ముందుగానే ప్రశ్నలు లీక్ చేయడం ద్వారా తమ కుటుంబీలకు ర్యాంకుల పంట పండించుకున్నారు" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.
5. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారు చేయడానికి వెళ్లే మదనపల్లె టీచర్ కు స్వయాన వదిన 2018లో మొదటి ర్యాంకు సాధించిన విషయాన్ని కూడా ప్రస్తుతం తెరమీదకు తెచ్చారు.
పోస్టులే తక్కువ..
2025 డీఎస్సీ కోసం 80 పోస్టులు నోటిఫైడ్ చేశారు. అందులో 32 పోస్టులు భర్తీ చేశారు. అందులో కూడా రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఎస్సీ,ఎస్టీలకు నాలుగు, బీసీబీ (దూదేకుల) ఐదు, ఈడబ్ల్యూఎస్ నాలుగు, వికలాంగులకు ఒక పోస్టు కేటాయించారు. అంటే 17 పోస్టులు మాత్రమే ముస్లిం మైనారిటీలకు దక్కాయి. వాటిలో కూడా పరీక్ష పత్రాలు తయారు చేసిన సంబంధీకులకే ఉద్యోగాలు దక్కాయని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వారివల్లే ప్రశ్నలు లీక్..?
ఈ సంవత్సరం నిర్వహించిన మోగా డీఎస్సీలో ఉర్దూ భాషలో ప్రశ్నపత్రాలు ట్రాన్స్ లేట్ చేయడానికి విజయవాడకు వెళ్లిన ఈ భాష టీచర్లు, తమ కుంటుంబంలోని నిరుద్యోగులకు ప్రశ్నలు లీక్ చేయడం వల్ల ర్యాంకులు సాధించారని ఉద్యోగ అర్హత సాధించలేని నిరుద్యోగ యువతులు ఆరోపించారు.
"వారిద్దరు ప్రస్తుత DSC లోనే కాకుండా గతంలో జరిగిన DSC, TET, DIET CET ప్రశ్న పత్రాల అనువాదం చేసి Annamayya Dist లోనే కాకుండా ఇతర జిల్లాలలోనూ వారి Relatives, friends కు ఈ విధమైన సహాయం చేశారు. వీరివల్ల అర్హులైన పేద ముస్లిం విద్యార్థులు పూర్తిగా నష్ట పోతున్నారు" అని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరుద్యోగులు ఏమని కోరారంటే..
"2025 డీఎస్సీ ప్రశ్నాలు లీక్ చేసిన ఇద్దరు టీచర్ల తోపాటు అక్రమమార్గంలో ఉద్యోగాలు సాధించిన వారిపై విచారణ జరిపించండి" అని రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఇకపై విద్యా శాఖకు సంబంధించిన ఎలాంటి Confidential material తయారీ, DSC ప్రశ్నపత్రాల అనువాదం తెలుగు /ఇంగ్లీష్ లో నుంచి ఉర్దూ లో చేసే సమయం, ప్రశ్నాపత్రాల తయారీలో ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు అవకాశం కల్పించవద్దు అని కూడా కోరారు.
"ఈ ఇద్దరు ఉర్దూ ఉపాధ్యాయుల వల్ల కష్టపడి చదివినా మాకు అన్యాయం జరిగింది" అని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులు కూడా సీరియస్ గా తీసుకుని అంతర్గతంగా విచారణ సాధిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామం ఉర్దూ టీచర్లలో కలవరానికి గురి చేసినట్లే కనిపిస్తోంది.
Tags:    

Similar News