ఏపీపీఎస్సీ నిర్వాకం

పరీక్షల ఫలితాల ప్రకటనలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం నిరుద్యోగులను కుదిపి వేస్తోంది. అస్తవ్యస్థ నిబంధనలు అభ్యర్థులను కోర్టులను ఆశ్రయించేలా చేస్తున్నాయి.;

Update: 2025-09-02 03:49 GMT
APPSC Secretary

పరీక్షలు రాసి నెలలు గడిచినా ఫలితాలు సకాలంలో రాకపోతే చదువుకున్న దానికి అర్థం ఏముంటుంది? ఇది నిరుద్యోగుల్లో పెద్ద సమస్య. ఉద్యోగ అవకాశాల కొరత, ఆలస్యాలు, యువతను డిప్రెషన్, ఆర్థిక సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏపీపీఎస్సీ సమర్థవంతంగా పనిచేయని కారణంగా పరీక్షలు నిర్వహించినా ఫలితాలు సకాలంలో రావడం లేదు. ఈ నెలాఖరు నాటికి 16 కొత్త నోటిఫికేషన్లు విడుదల కానుండటం ఆశాజనకంగా ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాని ఫలితాలు బాధను గుర్తు చేస్తున్నాయి.

మొత్తం 20 నోటిఫికేషన్ లకు సంబంధించి 1,670 పోస్టుల ఫలితాలు వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. వివిధ విభాగాలకు సంబంధించి గత నోటిఫికేషన్లలో భర్తీ­చేయ­గా మిగిలిపోయిన (క్యారీ ఫార్వర్డ్‌) 78 ఖాళీ­లకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు.

పైగా ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు మాట్లాడుతూ ఓఎమ్మార్ షీట్ కూడా ఫిల్ చేయడం పరీక్షలు రాసే వారికి చేతకావడం లేదని అనటం నిరుద్యోగులను మరింత బాధకు గురిచేస్తోంది.


తిరుపతిలో పరీక్షలు రాస్తున్న గ్రూప్-2 నిరుద్యోగులు

ఆలస్యం ఎందుకు?

గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు ఏప్రిల్ 2025లో వచ్చినా, మెయిన్ ఫలితాలు 4 నుంచి 6 నెలలు ఆలస్యమయ్యాయి. (సాధారణంగా 2 నెలల్లో వస్తాయి). కారణం కోర్టు కేసులు. ముఖ్యంగా రిజర్వేషన్ రోస్టర్ లోపాలు, క్వాలిఫికేషన్ వివాదాలు. ఆగస్టు 2025 నాటికి కొన్ని ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.

గ్రూప్-2 మెయిన్ ఫలితాలు 2025 ఏప్రిల్ 5న విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం ఫలితాలు 3 నుంచి 5 నెలల ఆలస్యమయ్యాయి. (సాధారణంగా 2 నెలల్లో వస్తాయి) ఇందుకు కారణం రిజర్వేషన్ రోస్టర్ ఎర్రర్లు, కోర్టు పిటిషన్లు, హారిజంటల్ రిజర్వేషన్ సమస్యలు. 2025 ఫిబ్రవరి 21న హైకోర్టు మెయిన్ ఎగ్జామ్‌ను కొనసాగించాలని ఆదేశించింది. కానీ వివాదాలు ఆలస్యానికి దారితీశాయి.


జనవరిలో జరిగిన పరీక్షలకు హాల్ టిక్కెట్లు తనిఖీ చేస్తున్న అధికారులు

డిప్యూటీ ఈవో (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్)

స్క్రీనింగ్ టెస్ట్ 2024 మే 25న జరిగింది. (2024 నోటిఫికేషన్) మెయిన్ ఎగ్జామ్ 2025 జనవరిలో నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు 2024 జూలై 3న విడుదలయ్యాయి. కానీ మెయిన్ ఫలితాలు 15 నెలలు ఆలస్యమయ్యాయి. సెప్టెంబర్ 2025 నాటికి కూడా పెండింగ్‌లోనే ఉంటాయి. కోర్టు కేసులు, ప్రక్రియలో లోపాలు ప్రధాన కారణం. 2024లో జరిగిన ఎగ్జామ్‌కు 2025లో ఫలితాలు రాకపోవడం నిరుద్యోగులను తీవ్రంగా బాధిస్తోంది.

ఎఫ్‌ఆర్‌ఓ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్)

ఏపీపీఎస్సీ (APPSC) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టులకు నోటిఫికేషన్ నెం. 11/2024 మార్చి 6, 2024న ఇచ్చింది. స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 16, 2025న జరిగింది. మెయిన్స్ పరీక్ష 2025 జూన్ 2 నుంచి 4 వరకు జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చి 17 నెలలు గడిచింది. ఇందులో ఆలస్యం ప్రధానంగా హైకోర్టు ఇంటీరియం స్టే ఆర్డర్ వల్ల ఏర్పడింది. దీని వల్ల ఫలితాలు, తదుపరి సెలక్షన్ ప్రక్రియ ఆగిపోయింది. సెప్టెంబర్ 2025 నాటికి కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంటాయని కార్యదర్శి చెబుతున్నారు. రిక్రూట్‌మెంట్ హోల్డ్ లో ఉంచటానికి కోర్టు వివాదాలే కారణమని కార్యదర్శి చెప్పారు. రిక్రూట్‌మెంట్ ఆన్ హోల్డ్ కారణంగా ఇంకా ఆలస్యం కావొచ్చు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు

అనలిస్ట్ గ్రేడ్-II పేపర్-I 2025 మార్చి 25, 26లో జరిగింది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఎగ్జామ్ మార్చి 2025లో నిర్వహించారు. ఫలితాలు ఆగస్టు 6, 2025న విడుదలయ్యాయి. (నోటిఫికేషన్ 15/2023). అనలిస్ట్ ఫలితాలు 5 నెలల ఆలస్యమయ్యాయి. క్వాలిఫికేషన్ వివాదాలు, మెరిట్ లిస్ట్ విశ్లేషణలో తేడాలు ఉన్నట్లు కార్యదర్శి రాజాబాబు చెప్పారు.

మహిళల హారిజంటల్ రిజర్వేషన్ సమస్య ఏమిటి?

హారిజంటల్ రిజర్వేషన్ అంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వర్టికల్ రిజర్వేషన్లు (SC/ST/BC) అమలు చేయడం. అయితే ఏపీపీఎస్సీలో ఈ అమలు తప్పుగా జరిగింది. మహిళలను వర్టికల్ రిజర్వేషన్‌లా ట్రీట్ చేసి, కోటా మించి సెలెక్ట్ చేయడం. (ఉదా. మహిళల రిజర్వేషన్ 33 శాతం అయితే... 48శాతం రిజర్వేషన్ ఇవ్వటం.) ఇది మెరిట్ బేస్డ్ సెలెక్షన్‌ను దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫిబ్రవరి 2025లో హారిజంటల్ రిజర్వేషన్ కోటా మించకూడదని రూలింగ్ ఇచ్చింది. గ్రూప్-2లో రోస్టర్ ఎర్రర్లు ఉన్నాయని పిటిషన్లు వచ్చాయి. సుప్రీం కోర్టు నవంబర్ 2025లో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ చేయనుంది. ఈ వివాదాల వల్ల ఫలితాలు సిద్ధంగా ఉన్నా ప్రకటించలేకపోతున్నారు. మొత్తం ప్రక్రియ స్తంభించిపోతోంది.

ఇటువంటి వివాదాలకు ఏపీపీఎస్సీ వారే కారకులు అవుతున్నారు. దీనిని మరిచిపోయి అభ్యర్థులపైనే నిందలు మోపుతున్నారు. అభ్యర్థులు కోర్టులకు వెళ్లడం, ఇతర అభ్యంతరాలు పెట్టడం వల్లనే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని ఏపీపీఎస్సీ వారు అంటున్నారు. ఏపీపీఎస్సీ గైడ్లైన్ ప్రకారం బాధ్యతలు నిర్వహిస్తే ఎవ్వరూ కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉండదు. వారికి ఆ అవకాశం ఏపీపీఎస్సీ వారే కల్పిస్తున్నారనటంలో సందేహం లేదు.

ఈనెల 7న ఫారెస్ట్ పోస్టులకు పరీక్ష

791 ఫారెస్ట్‌ బీట్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీ­సర్స్‌ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేశారు. 100 ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేశారు. వీరికి ఈనెల 7న 13 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సోమవారం తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల్లో 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉండటం వల్ల సమాధానాలు జాగ్రత్తగా ఆలోచించి మార్క్ చేయాలి.

అభ్యర్థుల సాధారణ పొరపాట్లు

పరీక్ష హాల్‌లో అభ్యర్థులు చేసే చిన్న పొరపాట్లు వారి శ్రమనంతా వృథా చేస్తాయి. లక్షల మంది పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఓఎమ్మార్ షీట్‌లు సక్రమంగా పూర్తి చేయడం అత్యంత కీలకం. ఈ విషయంపై ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు కొన్ని సూచనలు చేశారు. దిద్దుబాట్లు, కొట్టివేయడం, గోళ్లతో చెరిపేయడం లేదా వైట్‌నర్ ఉపయోగించడం వంటివి ఓఎమ్మార్ షీట్‌ను ఇన్‌వ్యాలిడ్ చేస్తాయి.

బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఏబీసీడీ సిరీస్‌లలో ఒకదాన్ని సరిగ్గా మార్క్ చేయకపోతే, మొత్తం షీట్ తిరస్కరణకు గురవుతుంది. చాలామంది అభ్యర్థులు ఈ పొరపాట్లు చేస్తున్నారు. ఇది వారి జీవితాలను తారుమారు చేస్తోంది.

ఇది విద్యా వ్యవస్థలోని లోపం కావచ్చు. స్కూల్, కాలేజీ స్థాయిలో ఇలాంటి ప్రాక్టికల్ శిక్షణ లేకపోవడం. ఫలితంగా నెలల తరబడి చదివినా ఒక చిన్న తప్పు వల్ల అవకాశం కోల్పోతున్నారు. ఏపీపీఎస్సీ ఇలాంటి సమస్యలను తగ్గించడానికి మాక్ టెస్టులు లేదా ఆన్‌లైన్ గైడ్‌లను మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచాలి.

Tags:    

Similar News