ఏపీలో స్టార్ హోటళ్ల స్టార్ తిరగనుంది
అర్థ రాత్రి 2 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న స్టార్ హోటళ్ల యాజమాన్యాలు.;
By : Admin
Update: 2025-04-04 05:58 GMT
ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ హోటళ్లకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకోవడం పట్ల యాజమాన్యాలు ఫుల్ కుషీగా ఉన్నారు. తమకు మంచి రోజులు వచ్చాయనే సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని త్రీ స్టార్, ఆపై క్లాసిఫైడ్ స్టార్ హోటళ్లల్లో బార్ లైసెన్స్‌ల ఫీజులను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటళ్లల్లో బార్ లైసెన్స్ ఫీజును రూ. 60 లక్షల నుంచి రూ. 25లక్షలకు తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ హోటళ్ల అసోసియేషన్ ఏపీ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
స్టార్ హోటళ్లలో బార్ లైసెన్స్‌లు తగ్గించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, అసోసియేషన్ ప్రతినిధులు మలినేని రాజయ్య, గోకరాజు గంగరాజు మాట్లాడుతూ భారీ లైసెన్స్‌ల ఫీజుల కారణంగా ఇన్ని సంవత్సరాలు స్టార్ హోటళ్లు ఆర్థికంగా నష్ట పోయాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టార్ హోటళ్లకు ఊతమిచ్చినట్టు అయ్యింది. స్టార్ హోటళ్లు నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి పయనించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడనుంది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బార్ లైసెన్స్ ఫీజులు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు ఉండగా, తెలంగాణలో రూ. 40లక్షల చొప్పున ఉంది. ఏపీలో ఇప్పటి వరకు రూ. 60 లక్షలు ఉంది. కూటమి ప్రభుత్వం దీనిని రూ. 25లక్షలకు తగ్గించింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని 54 త్రీ స్టార్, ఆపై క్లాసిఫైడ్ హోటళ్లకు మంచి కాలం వచ్చింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారంతో అమరావతిలో కొత్తగా 17 స్టార్ హోటళ్లు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా బాగా స్థిరపడిన తెలుగు వారు తిరిగి వెనక్కి వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు టూరిజం పరంగాను అభివృద్ధి చేయాలి. దీనిలో తమ పాత్ర కూడా పోషిస్తామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో పాటుగా తమ సమస్యలను కూడా ఈ సందర్భంగా తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పర్యాటక పాలసీలో హోటళ్లకు కరెంటు చార్జీల్లో రాయితీని, ఆస్తి పన్ను తగ్గింపు వర్తింపచేసి హోటళ్ల రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తని చోట్లల్లో అర్థరాత్రి 12 గంటల వరకు హోటళ్లను, అర్థరాత్రి 2గంటల వరకు స్టార్ హోటళ్లలో బార్లు తెరచి ఉంచేందుకు అవకాశం కల్పించాలని కోరారు.