గురువాయూరు శ్రీకృష్ణుడిగా మురిపించిన మలయప్ప
కనులపండువగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-25 06:59 GMT
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం మలయప్ప స్వామివారు గురువాయూరు శ్రీకృష్ణుడిగా పిల్లనగోవి చేతిలో ఉంచుకు అలంకారంలో ఐదుతలు ఉన్న చినశేష వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగారు.
తిరుమల ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలు యాత్రికులతో రద్దీగా కనిపించాయి. తెల్లవారకనే గ్యాలరీల్లోకి చేరుకున్న యాత్రికులు మలయప్ప వాహనసేవ చూసేందుకు గంటలకొద్దీ వేచి ఉన్నారు. వారికి అన్నప్రసాదాలు అందివ్వడంలో శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేశారు. దీనికోసం బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ నిర్వహించిన సమీక్షల్లో గ్యాలరీల్లో పర్యవేక్ష బాధ్యతలు సీరియర్ అధికారులకు అప్పగించారు.
రాజువెడలే..
రాజువెడలే రవితేజములలర అన్నట్లుగా మలయప్పస్వామి వారి వాహనసేవ జరిగింది. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు, గోవులు ముందు సాగుతుండగా స్వామివారి వాహనసేవ జరిగింది. ఇందులో దాదాపు 19 రాష్ట్రాల నుంచి వచ్చిన కళకారుల బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు
చిన్నశేషుడిని వాసుకి (నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.
ఈ వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.