పదవుల పంపకం అధి'నేతలకు' పరీక్షే!

నామినేటెడ్ పదవుల భర్తీ అధినేతలకు పరీక్షగా మారినట్లు కనిపిస్తోంది. ఆశావహులకు కూడా వారు అదే పరిస్థితి కల్పించారు. "పనితీరు ప్రామాణికం" అనే సీఎం చంద్రబాబు మాటలే.. డిప్యూటీ సీఎం నోట ప్రతిధ్వనించడం పార్టీ నేతల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లుగా కనిపిస్తోంది.

Update: 2024-07-18 04:12 GMT

"కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తాం" అని

సీఎం ఎన్. చంద్రబాబు మాటలే ఆలస్యంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ నోట ప్రతిధ్వనించాయి.
"అభిప్రాయ సేకరణకు టీడీపీ, పనితీరే కొలబద్ద" అని జనసేన ఎవరికి వారు కొన్ని ప్రామాణికాలు నిర్ణయించుకున్నారనే విషయం వారి మాటల ద్వారానే వెల్లడైంది. అందులో తమ పనితీరు కొలమానం అవుతుందా? లేదా? అనే మీమాంసలో టీడీపీ, జనసైనికులు నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. 
2024 ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి ఎన్నికలు ఎదుర్కొని, అధికారంలోకి వచ్చింది. అందులో మూడు పార్టీల నేతలు పట్టువిడుపులతో వ్యవహరించారు. రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంకు, పటిష్ట యంత్రాంగం కలిగిన టీడీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో 31 వదులుకుంది. అలాగా ఎనిమిది ఎంపీ సీట్లను కూడా మిత్రపక్ష పార్టీలు జనసేన, బీజేపీకి కేటాయించింది. దీంతో ఇక్కడ టీడీపీ నాయకులు అవకాశాలు కోల్పోయారు. జనసేన కూడా పట్టుదలకు పోకుండా సీట్లను తగ్గించుకుని, సహకారం అందించింది. టీడీపీ సీట్లు వదులుకున్న చోట, తమ పార్టీ నేతలకు పదవులతో సంతృప్తి పరచడం సీఎం చంద్రబాబుకు పరీక్షగా మారింది.
బాబు అభిప్రాయ సేకరణ?
సొంత పార్టీ నేతలో పాటు కూటమిలోని జనసేన, బీజేపీకి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట రాష్ట్ర స్థాయి పదవులతో భర్తీ చేయడానికి సమాలోచనలు సాగుతున్నట్లు సమాచారం. దీంతో ఒత్తిడి తీవ్రంగానే ఉంది. అందువల్ల నియోజకవర్గాల్లోని నాయకులను పదవులకు ఎంపిక చేయడానికి ఐవీఆర్ఎస్ పద్ధతిని అమలు చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలదాటింది. ఆ రెండు పార్టీల్లో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ విషయంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలపై ఒత్తిడి కూడా తీవ్రంగానే ఉన్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ గుంభనంగా ఉంటోంది. వారు అడగకున్నా, ఆ పార్టీ పెద్దలతో సంప్రదించక తప్పదు. అదే సమయంలో టీడీపీతో పాటు మిత్రపక్ష పార్టీలు, నాయకులను సంతృప్తిపరిచే కీలక బాధ్యత కూడా సీఎం ఎన్. చంద్రబాబునాయుడుపైనే ఉంది. ఒకవిధంగా ఆయనకు ఇది పరీక్షే అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఆయన ఎలాంటి రాజకీయ చతురత ప్రదర్శిస్తారనేది ఆసక్తిగా మారింది. పదవుల రేసులో ఉన్న వారిలో సీఎం చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉస్సూరు మనిపించాయి.
సమాచారం సిద్ధం?
రాష్ర్టంలో నామినేటెడ్ పోస్టుల వివరాల సేకరణలో జీఏడీ నిమగ్నమైంది. రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులతో పాటు, డైరెక్టర్ల వివరాలను అందించాలని ఆయా శాఖలకు వారం క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రీజియన్, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మార్కెట్ కమిటీ పదవుల వివరాలు కూడా సేకరిస్తోంది. ఈ వివరాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. వాటి ఆధారంగా పదవుల పందేరానికి శ్రీకారం చుట్టాలని సీఎం ఎన్. చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
సీట్ల సర్దుబాటు నుంచి పరీక్షే..

2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు కుదర్చడంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారనే విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి టీడీపీ చీఫ్, సీఎం ఎన్. చంద్రబాబుకు పరీక్ష ప్రారంభమైంది. సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగింది. అది నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం వరకు పరీక్ష వెంటాడుతూనే ఉంది. ఎన్నికల్లో పోటీకి 60 సీట్లు తీసుకోవాలనే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి, ఒకపక్క, విమర్శలు, ఆరోపణలు మరోపక్క ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా, బేషజాలకు వెళ్లకుండా "రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం" అని సీట్ల సంఖ్యను తగ్గించుకోవడంలో కూడా జనసేన చీఫ్ వపన్ కల్యాణ్ హూందాగా వ్యవహరించారు. "ఓటు చీలనివ్వను" అనే మాటకు కట్టుబడిన ఆయన తమ పార్టీ తీసుకున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి, మిత్రపక్షాలకు కూడా సహకారం అందించారు. కానీ, నామినేటెడ్ పదవుల్లో ఎవరికి ఎన్ని పదవులు, ఏవి ఇవ్వాలనే విషయంలో మళ్లీ సీఎం ఎన్.చంద్రబాబుకు పరీక్షగా మారింది.
పంపకాలు ఎలా?
రాష్ట్ర స్థాయిలో చైర్మన్, డైరెక్టర్ పోస్టులతో పాటు, గత ప్రభుత్వ కాలంలో నాయకులకు పునరావాసం కోసం అన్నట్లు కుల సంఘాల కార్పొరేషన్లు సృష్టించండం ద్వారా 135 పదవులు భర్తీ చేసింది. అందులో ప్రస్తుతం కొందరు పదవీకాలం ముగియకపోవడం, రాజ్యాంగబద్ధ పదవులకు రాజీనామా చేయలేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం దాదాపు 95 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అలాగే 217 మార్కెట్ కమిటీ చైర్మన్లు, 13 జిల్లా గ్రంథాలయ సంస్థలు, 13 నుంచి 18 వరకు క్యాబినెట్ హోదా కలిగిన పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా రాష్ర్ట స్థాయి చైర్మన్ పోస్టులతో పాటు కీలకమైన ఆలయ పాలక మండళ్లలో శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం అప్పన్న దేవస్థానంత పాటు ప్రధానంగా టీటీడీ చైర్మన్ పోస్టు కోసం తీవ్ర పోటీ ఏర్పడింది.
పవన్ కల్యాణ్ సెల్ఫ్ గోల్
"ప్రతి ఒక్కరు చైర్మన్ పోస్టు కావాలంటున్నారు. టీటీడీ చైర్మన్ పోస్టు కోసం 50 మంది అడిగారు" అని వెల్లడించడం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశావహులు పోటీని బహిర్గతం చేశారు. "అన్ని పదవులు కావాలని సీఎంను అడిగితే, మా పార్టీ వాళ్ల సంగతి ఏమి చేయాలంటే ఏమి చెప్పాలి" అని వ్యాఖ్యనించడం ద్వారా ఆయనకు ఆయనే ముందరికాళ్లకు బంధం వేసుకున్నట్టైంది. "పరిమితులు ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి" అంటూనే. పదవులు వస్తాయి. గత పదేళ్లు.. ఎన్నికల వేళ ఎవరు ఎలా పనిచేశారు. అనే అంశాలు ప్రామాణికంగా పదవులు దక్కుతాయి" అని పవన్ కల్యాణ్ ఊరడింపు మాటలు చెబుతూనే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఆదర్శంగా తీసుకుని త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని హితవు పలకండంపై నిరాశకు గురి చేసినట్లు కనిపించింది. ఆ సంస్థల వాళ్లు పదవుల్లోకి ఇలా వస్తారు. పూర్తి కాగానే మళ్లీ అలా కార్యకర్తలా మారిపోతారు. మనకు అది అలవాటు కావాలి. పదవులు రాలేదని కోపపడవద్దు. మీరు నా గుండెల్లో ఉంటారు. అని చెప్పిన కల్యాణ్, పదవులు ఆశిస్తున్న వారు తన సమయం వృధా చేయకుండా నేరుగా అడగాలని సూచిస్తే, ఎంఎల్సీ హరిప్రసాద్ కు దరఖాస్తులు అందించాలని చెప్పడం కాస్త సాంత్వన పలికినట్లు మారింది.
గత ప్రభుత్వంలో ఎస్సీ,, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొత్తం పదవుల్లో 56 శాతం కేటాయించారని అధికార లెక్కలు చెబుతున్నాయి. అందులో 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కట్టబెట్టింది. అందులో కుల సంఘాల కార్పొరేషన్లు కూడా కొత్తగా చిత్రీకరించి, పునారావాసం కల్పించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అందులో తూర్పు గోదావరికి 17, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలకు 12 పదవులు ఇచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి మాత్రం ఏడు పదవుల వంతున పంచారు. మిగతా జిల్లాలకు పదేసి వంతున పదవుల పంపకం జరిగింది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు మిగతా రెండు పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా పదవులకు ఎంపిక చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సామాజికవర్గాల సమీకరణతో పాటు, తమ పార్టీ ప్రాతినిధ్యం లేని చోట, ఆ లోటును భర్తీ చేసుకోవాలి. మంత్రి పదవులు దక్కని వారిని కూడా సంతృప్తి పరచాలి. కోస్తా జిల్లాల తరువాత అధిక సీట్లు అందించిన రాయలసీమకు పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నారు. ఆ ఆశతోనే ఎన్నికల్లో కష్టపడిన నేతలు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా లేఖలు అందించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ ఏతీరుగా ఉంటుందో అనే ఆందోళనలో కూడా ఉన్నారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుని సీఎం చంద్రబాబు ప్రకటన కోసం ఔత్సాహిక నేతలు ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. ఈ పదవుల పంపకం కూటమి పార్టీల్లో ఎలాంటి వాతావరణం సృష్టిందో వేచి చూడాలి.
Tags:    

Similar News