ప్రముఖుల దారులన్నీ పుట్టపర్తి వైపే... ఆకట్టుకున్న సత్యసాయి రథోత్సవం

ప్రశాంతి నిలయానికి చేరుకున్న సీఎం బాబు. రేపు ప్రధాని రాక.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-18 14:30 GMT
పుట్టపర్తిలో వెండిరథంలో సత్యసాయి చిత్రపటం ఊరేగిస్తున్న యాత్రికులు

సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి మంగళవారం “శ్రీ సత్యసాయి రథోత్సవం” వైభవంగా నిర్వహించారు. కొత్తగా నిర్మించిన రజత శ్రీసత్యసాయి రథానికి ఆర్.జె. రత్నాకర్, హిమవాహిని రత్నాకర్ దంపతులు పూజలు చేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రముఖులు పోటెత్తారు.


సత్యసాయి రథోత్సవంతో పుట్టపర్తి వీధులు కిటకిటలాడాయి. సామాన్య యాత్రికులతో రద్దీగా మారింది. సీఎం నారా చంద్రబాబు పుట్టపర్తికి చేరుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు.


కనులపండువగా రథోత్సవం
పుట్టపర్తిలో సత్యాసాయి శతజయంతి ఉత్సవాలను కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. సత్యసాయి జయంతి ఉత్సవాలు మంగళవారం వెండి రథోత్సవంతో ప్రారంభించారు. సత్యసాయి రథోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, రాష్ట్ర మంత్రులు రథాన్ని లాగుతూ సేవలు చేశారు. వెండిరథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అందులో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచిన భక్తులు ఊరేగింపు నిర్వహించారు. ప్రశాంతి నిలయంతో పాటు, పట్టణ వీధుల్లో సాగుతున్న రథంపై మిద్దెలపైకి చేరిన జనం పూలవర్షం కురిపించారు. స్థానికులే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా రథోత్సవంలో పాల్గొనడంతో వీధులన్నీ కిక్కిరిశాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎస్. సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి (పుట్టపర్తి), పరిటాల సునీత (రాప్తాడు) తోపాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు పుట్టపర్తి ప్రశాంతి నిలయం, సాయి కుల్వంత్ హాలులో భగవాన్ శ్రీసత్యసాయి మహాసమాధిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు సవితమ్మ , సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు.

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ స్వాగతం పలికారు.
కుల్వంత్ హాలులో..

ప్రశాంతి నిలయంలో సత్యసాయి సమాధి వద్ద మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తోపాటు మంత్రులు కూడా ప్రార్ధనలు చేశారు. ఆ హాలులో 1,100 దంపతులు శ్రీసాయి సత్యనారాయణ వ్రతం పాటించారు. వేదఘోష మధ్య సాగిన ఈ వ్రతం ప్రశాంతి నిలయం పరిసరాలను ఆధ్యాత్మికతను నింపింది.

"ప్రశాంతి నిలయంలో నిర్వహించే ఈ ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోతాయి" అని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ చెప్పారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాలులో వేదపారాయణం అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు అబ్బీ వి. అంతరా నంది “‘సురాంజలి’ ఘటించారు.
ప్రముఖుల తాకిడి

సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టపర్తికి చేరుకున్నారు. అంతకుముందే రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వచ్చారు. బుధవారం పుట్టపర్తి రానున్న ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సాయికుల్వంత్ హాలులో సత్యసాయి సమాధిని దర్శించుకోవడంతో పాటు ప్రార్ధనల్లో పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ తోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందంలొని అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, ఎస్. సవితమ్మ పరిశీలించారు. ఈ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర నోడల్ అధికారులు ఎంటి. కృష్ణబాబు, జి.వీర పాండియన్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో చర్చించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డిఐజి షిమోషి భాజ్పై, ఆర్డీవోలు మహేష్, సువర్ణ, వివిఎస్ శర్మ, ట్రస్టు సభ్యులు, అధికారులు కార్యక్రమాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

సత్యసాయి మళ్లీ వచ్చారా..!
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు కనువిందు చేస్తున్నాయి.

పుట్టపర్తి హారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన  లేజర్ షోలో సత్యసాయి ప్రత్యక్షమయ్యే దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులే కాకుండా, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఈ లేజర్ షోకు హాజరవుతున్నారు.
Tags:    

Similar News